మీకు ఎలాంటి వార్తలు నచ్చుతాయో తెలియడం లేదు సార్ అన్నాడు ఓ ఫేస్ బుక్ మిత్రుడు… ఎలాంటి వార్తలు అంటే..? రొటీన్‌కు భిన్నంగా ఏదో తెలియని ఎమోషన్ మనల్ని చుట్టుముట్టేసే వార్తలు అన్నాను… సరే, ఓ తాజా ఉదాహరణ చెబుతాను… చిన్నదే… కళ్లల్లో నీళ్లు వంటి పెద్ద పదాలు వద్దులే గానీ… చదువుతుంటే ఓరకమైన ఉద్వేగం, ఓ పాజిటివ్ భావన మనల్ని కుదిపేస్తుంది…
సరిగ్గా తీయగలిగితే ఏ మణిరత్నమో మాత్రమే సరిగ్గా తీయగలడేమో… అది జైపూర్… సంగనేర్ పోలీస్ స్టేషన్ పరిధి… 14 నెలల క్రితం పృథ్వి అనే 11 నెలల పిల్లాడు కిడ్నాపయ్యాడు… కిడ్నాపర్ ఎవరు..? ఓ హెడ్ కానిస్టేబుల్… నిజమే, మీరు చదివింది… ఆ కిడ్నాప్ కేసు బుక్కయ్యాక తనపై 25 వేల రివార్డు కూడా ప్రకటించారు పోలీసులు…
కిడ్నాప్ చేశాడు, కానీ దొరకకూడదు.,. అందుకని ఓ సన్యాసిగా మారిపోయాడు ఆ నిందితుడు… గడ్డం పెంచాడు, జుట్టు పెంచాడు… బృందావన్‌లోని పరిక్రమ మార్గంలో యమునా నదికి సమీపంలోని ఖాదర్ ప్రాంతంలో ఓ గుడిసె వేసుకున్నాడు… అక్కడ తన గుర్తింపు ఎవరికీ తెలియకుండా గడుపుతున్నాడు కొంత కాలంగా…
Ads
ఈ నిందితుడి పేరు తనూజ్ చాహర్, ఉత్తర ప్రదేశ్‌లోని ఆగ్రాకు చెందినవాడు… అలీగఢ్ (యూపీ) రిజర్వ్ పోలీస్ లైన్స్‌లో హెడ్ కానిస్టేబుల్… అఫ్ కోర్స్, ప్రస్తుతం సస్పెన్షన్‌లో ఉన్నాడు… తను గతంలో యూపీ పోలీసుల స్పెషల్ ఫోర్స్, నిఘా టీమ్స్‌లో కూడా మెంబర్… నిందితులు తరచూ చేసే తప్పులు తెలుసు కదా…
అందుకే పరారీలో ఉన్న సమయంలో అస్సలు మొబైల్ ఫోన్ వాడలేదు… సిగ్నల్స్ బట్టి దొరికిపోతాడు కదా… తరచూ తన స్థానాలు మార్చేవాడు… తనతో కిడ్పాప్ చేయబడిన అమ్మాయి తల్లికి బంధువు… చాలా చాకచక్యంగా… తనకు పరిచయమైన వాళ్లను రెండోసారి కలిసేవాడుకాదు… గడ్డం పెంచుతాడు, కొన్నిసార్లు రంగు వేసుకుంటాడు… కొత్త వ్యక్తుల జోలికి పోవడం లేదు…
కానీ పృథ్విని తన సొంత కొడుకులాగే ప్రేమగా చూసుకునేవాడు… తను సన్యాసిలా కాలం గడుపుతున్నట్టు పోలీసులకు సమాచారం అందింది… ఆ పిల్లాడి వేటలో ఉన్న స్పెషల్ పోలీసులు కూడా సన్యాసుల్లా వేషాలు వేసుకుని, భక్తిగీతాలు పాడుతూ మధుర, ఆగ్రా, అలీగఢ్ ప్రాంతాల్లో తిరగసాగారు…
ఆగస్టు 22 నుంచి అన్వేషణ… చివరకు ఆగస్టు 27న… అలీగఢ్ వెళ్లినట్టు పక్కా సమాచారం దొరికింది… పోలీసులు తనను సమీపించగానే తనూజ్ పిల్లాడిని పట్టుకుని పొలాల వెంబడి పరుగు తీశాడు… పోలీసులు అతన్ని 8 కిలోమీటర్లు వెంబడించి మరీ పట్టేసుకున్నారు… పిల్లాడి ముద్దుపేరు కుక్కూ… తల్లి పేరు పూనమ్…
ఆ ఇద్దరూ తనతోనే జీవించాలనేది నిందితుడి ఆశ… కానీ ఆమె నిరాకరించేది… దాంతో ఆమెను బెదిరించి, నిర్బంధంగా తన తోవకు తీసుకురావడానికి తన సహచరులతో కలిసి ఆ పిల్లాడిని కిడ్నాప్ చేశాడు… గారాబంగా, ప్రేమగా చూసుకున్నాడు… పూనమ్‌కు తరచూ ఫోన్ చేసి తన డిమాండ్ చెప్పేవాడు… ఇదీ కేసు…
ఇక్కడ విశేషం ఏమిటంటే… ఇన్ని నెలలయిపోయింది కదా… ఆ పిల్లాడిని ఆ నిందితుడి నుంచి తీసుకోవడానికి పోలీసులు ప్రయత్నిస్తే గట్టిగా ఏడుస్తూ ఆ పిల్లాడు నిందితుడిని హత్తుకుని ఏడవసాగాడు… తనను వదిలేసి రావడానికి మొరాయించాడు… పోలీసులే విస్తుపోయారు… ఈ బంధాన్ని చూసి..! అంతగా ఆ పిల్లాడికీ, కిడ్నాపర్‌కూ నడుమ బంధం ఏర్పడిపోయింది… చివరకు ఓ పోలీసు అధికారి మరీ బలవంతంగా విడదీసి తల్లికి అప్పగించాడు… అటు పిల్లాడు ఏడుస్తూనే ఉన్నాడు… ఆ నిందితుడు కూడా…!!
Share this Article