కొత్త పలుకు… వీకెండ్ కామెంట్… పేరు ఏదైతేనేం..? ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ తన ఆకాంక్షలు, తన అంచనాలు, తన అభిప్రాయాల్ని ఏదేదో రాస్తుంటాడు… సరే, తన మీడియా తన ఇష్టం… చాలాసార్లు లాజిక్కులకు, పాత్రికేయ ప్రమాణాలకు దూరంగా కూడా పరుగు తీస్తుంటాడు, అది వేరే సంగతి…
ఈరోజు తన కొత్త పలుకు మరీ తీవ్రంగా హాశ్చర్యపరిచింది… గత ఐదేళ్ల పాలనలో జగన్ పాలనలో జరిగిన విధ్వంసం మళ్లీ రావాలనుకుంటున్నారా..? మీరిలాగే వ్యవహరిస్తే అదే జరుగుతుంది, అందరమూ మట్టికొట్టుకుపోతాం అని యెల్లో కూటమి ఎమ్మెల్యేలు, నాయకులకు హితవు చెబుతున్నాడు… ఒరేయ్ బాబూ, కాస్త పద్ధతిగా ఉండండర్రా, లేకపోతే జనానికి చిర్రెత్తి మళ్లీ జగన్‌ను గెలిపిస్తారు, జగన్ ఎమ్మెల్యేలను చిత్తుగా అందుకే ఓడించాడు అంటున్నాడు…
అదే జరిగితే రాష్ట్రమే సర్వనాశనం, దుంపనాశనం అని… జగన్‌ను చూపుతూ హెచ్చరికలు చెప్పడం దేనికి..? అలాంటి అవలక్షణ ఎమ్మెల్యేలను, వాళ్ల కుటుంబసభ్యులను కట్టడి చేసుకోవాల్సిన బాధ్యత ప్రత్యేకించి చంద్రబాబుదే కదా… తనే కదా టికెట్లు ఇచ్చింది… మిత్ర పార్టీలకు ఎమ్మెల్యే అభ్యర్థులు లేకపోతే తనే సర్దుబాటు కూడా చేశాడట కదా… మరి అధికారదర్పంతో ఊగిపోతున్నవాళ్లకు పగ్గాలు వేయాల్సింది కూడా తనే… జగన్‌ను బూచిగా చూపడం దేనికి..? పైగా కేడర్ నుంచి ఇంకా ‘అవలక్షణ భరితంగా’ ఉందామని ఒత్తిళ్లు వస్తున్నా చంద్రబాబు సంయమనం పాటిస్తున్నాడట…
Ads
సరే, జగన్ మీద విషం ఎప్పుడూ చిమ్మేదే కాబట్టి, దాన్నలా వదిలేస్తే… కాదంబరి జెత్వానీ ఇష్యూలో తన పత్రికలో వచ్చిన కథనాలు మంచి మసాలా వేసి వండబడ్డాయి… పంచ్ ఉన్నాయి, చాలా వివరాలతో రాశారు, ఈనాడు వెలవెలాబోయింది… ఇలాంటి ఇష్యూలు వచ్చినప్పుడు ఈనాడు కథనాలు ఉత్త పులిహోర, ఉప్మా తరహా… కానీ ఈ కేసుపై తన అభిప్రాయం రాయాల్సి వచ్చినప్పుడు రాధాకృష్ణ కొత్త పలుకులో పంచ్ లేదు, పేలవంగా ఉంది… తనేం రాస్తున్నాడో తనకే తెలియనట్టు…
ప్రత్యేకించి సాక్షిని రోత మీడియా అని, దాన్ని అనుసరించేవాళ్లను కూలి మీడియా అంటుంటాడు కదా… మరి కాదంబరి విషయంలో సాక్షి తనెందుకు బురద పూసుకునే రాతలకు దిగింది..? దాన్నే తిడుతూ రాధాకృష్ణ ఏదో రాయాలనుకున్నాడు… అదీ పేలవంగా ఉంది… నిజానికి సాక్షి కాదంబరి ఏదో అంతర్జాతీయ హానీట్రాప్ టెర్రరిస్టు అన్నట్టు, ఆ ఐపీఎస్‌లు శుద్ధపూసలు అన్నట్టు… చిత్రవిచిత్రమైన కథనాల్ని నెత్తికెత్తుకుంది… చీదరగా కూడా అనిపించింది… ఫాఫం, ఇక్కడ మాత్రం రాధాకృష్ణ సాక్షిని సరిగ్గా తిట్టలేకపోయాడు…
హైడ్రా విషయంలో కొన్ని కొత్త విషయాలు చెప్పుకొచ్చాడు… కాంగ్రెస్ నాయకుడు పళ్లంరాజు ఇంటిని కూల్చివేయడం మీద ఆయన ఖర్గేకు ఫిర్యాదు చేస్తే, ఠాట్, నువ్వు వెంటనే ఢిల్లీ వచ్చి వివరణ ఇచ్చుకో అని హైకమాండ్ హుకుం జారీ చేసిందనీ, వెళ్లి రేవంత్ కొన్ని సాక్ష్యాలు ఇవ్వడంతో రాహుల్ సపోర్ట్ చేశాడనీ, దాంతో కాంగ్రెసోళ్లు అందరూ సైలెంటయ్యారనీ రాసుకొచ్చాడు… తను కూడా రానురాను నమస్తే తెలంగాణ జర్నలిస్టుగా మారిపోతున్నాడనిపిస్తోంది…
ప్రస్తుతం పళ్లంరాజుకు కాంగ్రెస్‌లో అంత సీన్ లేదు… ఆయన ఏదో చెప్పగానే ఓ ముఖ్యమంత్రిని పిలిచి చీవాట్లు పెట్టి, క్లారిఫికేషన్స్ అడిగేంత సీన్ లేదు… ఆయన, కేవీపీ తదితర కాంగ్రెస్ నాయకులు హైదరాబాదులో దాదాపు బీఆర్ఎస్ నాయకుల్లాగే చెలాయించుకున్నారు పవర్‌ను..! నిజంగానే పళ్లంరాజుకు అంత సీన్ ఉంటే, రేవంత్ పోయి పోయి తనతో ఎందుకు గోక్కుంటాడు… ఇల్లు కూల్చేసినప్పుడు తనకు తెలియదా..? తనకు తెలియకుండానే కూల్చివేతలు జరుగుతున్నాయా..?
కాకపోతే ఒకటి నిజం… రేవంత్ ఈ హైడ్రా దూకుడును ఇలాగే కొనసాగించలేడు… కష్టం… దీన్ని ఎటువైపు తీసుకెళ్తాడు..? అనూహ్యం… మల్లారెడ్డి, అల్లుడు, పల్లా రాజేశ్వరరెడ్డి, జన్వాడ ఫామ్‌హౌజులు మాత్రమే కాదు, తన మనసులో ఇంకా ఏవేవో టార్గెట్లు ఉన్నట్టున్నాయి… దాన్నలా వదిలేస్తే… ఒకవైపు చెరువులు, నీటికుంటల ఆక్రమణలో హైదరాబాద్ మునిగిపోతోందని చెబుతూనే రాధాకృష్ణ జీవో111 పరిధిలో నిర్మాణాల్ని రెగ్యులరైజ్ చేయాలంటూ ఓ ఉచిత సలహా పడేశాడు…
ఎలాగూ ఆ జంట జలాశయాల నీళ్లు వాడటం లేదు కదా, టూరిస్ట్ ప్లేసులు చేసెయ్ అంటున్నాడు… మరి నగరంలో మాయమైపోయిన చెరువుల నీళ్లు ఏమైనా వాడుతున్నారా..? అలాంటప్పుడు ఇవీ రెగ్యులరైజ్ చేసేస్తే పోలా..? సో, ఇదొక దిక్కుమాలిన వాదన… చెరువులు వరద నియంత్రణకు కూడా ఉపయోగపడతాయనే బేసిక్ మరిచిపోయాడు… రసాయనాలను మరిపించే నీళ్లున్న హుసేన్ సాగర్ కూడా పూడ్చేసి, ప్లాట్లు చేసి అమ్మితే కూడా సొమ్ములు వస్తాయి కదా సారూ… థాంక్ గాడ్, ఆ సలహా ఇవ్వలేదు నయం… కొంపదీసి జీవో 111 పరిధిలో రాధాకృష్ణకూ ఏమైనా కట్టడాలున్నాయా..? పర్లేదు, ఉన్నా, రేవంత్ వాటి జోలికి వెళ్లడు… అది మాత్రం పక్కా..!!
Share this Article