కొందరి ఆలోచనలు, వారి ప్రత్యేకతలు… వారిని మిగిలిన సమాజం నుంచీ, వారి తోటివారి నుంచి ఇంకాస్తా భిన్నంగా నిలబెడతాయి. అదిగో అలాంటి ముఖ్యమంత్రే ఆయన. ఈమధ్యకాలంలో రాజకీయంగా తన ఎదుగుదలకవసరమనిపించే మూడు పార్టీలు మారిన తీరూ ఓ సంచలనమే కాగా… ట్రెక్కింగంటే ఇష్టపడే ఆయనలోని పర్వాతారోహణ.. ఆ ముఖ్యమంత్రిలో ఓ సాహసం చేసే డింభకుణ్ని కూడా కళ్లకు కడుతుంది. తన రాష్ట్రాన్ని పర్యాటక రంగంలో మరింత ముందు నిలపడానికి… ఓ బైక్ రైడర్ అవతారమెత్తుతాడు. ఇతర మంత్రులతో కలిసి పర్వతలోయల ఘాట్ రోడ్డులో కాన్వాయ్ తో ప్రయాణిస్తూ అందరినీ అబ్బురుపరుస్తాడు. అదే ఆయనకు ఎందరో సీఎంల్లోకి ఓ ప్రత్యేక సీఎంగా గుర్తింపు తెచ్చిపెట్టింది. ఆయనే అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి పెమాఖండూ.
ముందుగా ఓ పరిచయ వాక్యంగా ఖండూ గురించి చెప్పుకోవాలంటే… 2016లో అరుణాచల్ ప్రదేశ్ లో రాజకీయ సంక్షోభం నెలకొన్న సందర్భంలో కాంగ్రెస్ అధినేత్రి సోనియాను కలవడానికి వెళ్లితే… మూడురోజుల పాటు ఆమె అపాయింట్ మెంటే దొరకలేదు ఖండూకు. కానీ తాను వెళ్లినరోజు సాయంకాలమే ప్రధాని మోడీని మాత్రం కలవగల్గారు. అప్పుడే సొంత పార్టీకి చెందిన ముఖ్యమంత్రిని కలవలేని అధినాయకత్వంపై ఫైరైన పెమాఖండూ.. హస్తానికి హ్యాండిచ్చి ఏకంగా 42 మంది ఎమ్మెల్యేలతో కలిసి.. ముఖ్యమంత్రి హోదాలో కాంగ్రెస్ పార్టీకే సవాల్ విసురుతూ నాటకీయ పరిణామాల మధ్య బీజేపి అలయెన్స్ గా ఉన్న పీపుల్స్ పార్టీ ఆఫ్ అరుణాచల్ లో చేరాడు. ఆ తర్వాత పీపుల్స్ పార్టీ ఆఫ్ అరుణాచల్ పార్టీలో అంతర్గత కలహాలు, అసమ్మతి కారణంగా ఏకంగా పార్టీ నుంచే సస్పెండయ్యాడు. బీజేపీలో చేరి బలనిరూపణ చేసుకుని ముఖ్యమంత్రి పీఠాన్ని దక్కించుకున్నాడు. అలా 37 ఏళ్ల వయస్సుకే రాజకీయ సంచలనాలకు తెరలేపిన పెమాఖండూ.. 2024 ఎన్నికల్లోనూ ముచ్చటగా మూడోసారి ముఖ్యమంత్రై.. బీజేపీనీ మూడోసారి అధికారంలోకి తెచ్చిన గండరగండడు. అంతేనా..? ఇప్పటికీ.. 44 ఏళ్ల వయస్సులోనూ… పర్వాతారోహణతో మరిన్ని సంచలనాకు మారుపేరై వార్తల్లో నిల్చే వ్యక్తే.
Ads
ఆమధ్య… ఓ రెండేళ్ల క్రితం పెమాఖండూ ఓ రికార్డ్ సృష్టించారు. అంతవరకూ ఏ ముఖ్యమంత్రి కూడా చేరుకోని.. ఓ మారుమూల కొండ ప్రాంతానికి వెళ్లి అందరి మన్ననలందుకున్నారు. దాదాపు రెండురోజుల పాటు 157 కిలోమీటర్లు ప్రయాణించి.. చాంగ్ లాంగ్ జిల్లాలోని మయన్మార్ సరిహద్దు ప్రాంతం విజయనగర్ లో పర్యటించారు. అడవులు, కొండాకోనల మార్గంలో బురద, మట్టిరోడ్డుపై స్వయంగా కారు నడిపిన ముఖ్యమంత్రి… రాత్రివేళ అడవిలో చెట్ల కిందే సెక్యూరిటీతో విశ్రాంతి తీసుకున్నారు. సీఎం జర్నీకి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. స్వయానా పెమాఖండే దాన్ని ట్వీట్ చేశారు. ఆ ప్రాంతానికి రోడ్డు నిర్మిస్తానని.. రహదారి నాణ్యతను అంచనా వేయడానికే తన ప్రయాణమని చెప్పుకొచ్చారు. రోడ్డు మార్గాన్ని పూర్తి చేస్తానని హామీ ఇచ్చాడు. ఇప్పుడు రహదారుల అభివృద్ధిలో అరుణాచల్ ప్రదేశ్ 64 శాతం ఇంక్రీజ్ రేటుతో వాహ్వా అనిపించేలా చేశాడు. సీఎం మూడురోజులు పర్యటించిన తీరుపై ఆ రాష్ట్ర గవర్నర్ కూడా నాడు పెమాఖండును అభినందించారు.
అయితే ఖండూకు ఇలాంటి సాహస పర్యటనలు కొత్తేం కాదు… అంతకుముందు తవాంగ్ లో ఆయన పర్యటనే అందుకో ఉదాహరణ. అరుణాచల్ ప్రదేశ్ లో చైనా, తైవాన్ వంటి దేశాలు ఆ భూభాగం తమదేనంటూ పట్టుబట్టే ఓ వివాదాస్పాద జిల్లా తవాంగ్. అంతేకాదు.. దేశంలోనే అత్యల్ప జనసంఖ్య కల్గిన జిల్లాల్లో 8వ స్థానం తవాంగ్ ది. ఆ తవాంగ్ అనే జిల్లా కేంద్రం నుంచి 97 కిలోమీటర్ల దూరంలో ఉన్న లుగ్ తంగ్ కు వెళ్లడమంటే… ఓ అడ్వెంచరే. ఏ సాహస యాత్రికులో మాత్రమో వెళ్లగల్గే ప్రదేశమది. అక్కడి ప్రజలకు బాహ్య ప్రపంచంతో సంబంధమే కనిపించని ప్రాంతం. సముద్రమట్టానికి 14 వేల 500 మీటర్ల ఎత్తులో ఉన్న కొండప్రాంతం. కట్ చేస్తే… ముఖ్యమంత్రి పెమాఖండూ ఉండేది రాజధాని ఈటానగర్. అక్కడి నుంచి సుమారు 450 కిలోమీటర్ల దూరంలో తవాంగ్ జిల్లా కేంద్రం. దానికి 97 కిలోమీటర్ల దూరంలో కొండలపైన లుగ్ తంగ్. అదిగో అక్కడికి కాలిబాటన… ట్రెక్కింగ్ చేస్తూ పెమాఖండూ సాహసయాత్ర చేశాడు. సరిగ్గా తవాంగ్ నుంచి 97 కిలోమీటర్ల దూరంలో లుగ్ తంగ్ చేరాలంటే… ఎవరైనా 24 కిలోమీటర్ల ట్రెక్కింగ్ చేసి ఆ పర్వతాలను అధిరోహించాల్సిందే. అప్పుడుగానీ లుగ్ తంగ్ చేరుకోలేరు. కానీ పెమాఖండూ ఎత్తుపల్లాలన్నింటినీ దాటుతూ… ఏకంగా 11 గంటల పాటు కష్టపడి లుగుతంగ్ చేరుకున్నాడు. మీ పరిస్థితేంటో తెలుసుకుందామనే స్వయానా ఇలా కాలిబాటన నేనే వచ్చానంటూ అక్కడి జనాన్ని సమ్మోహనపర్చాడు. పెమాఖండూ తండ్రి డోర్జీ ఖండూ కూడా అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేస్తున్న సమయంలో… 2011లో తవాంగ్ నుంచి ఈటానగర్ కు వెళ్లే క్రమంలో ప్రమాదవశాత్తూ హెలిక్యాప్టర్ కూలి మరణించాడు. ఆ ఘటన లుగ్ తాంగ్ సమీపంలోనే జరిగింది. దాంతో… స్థానికులతో కలిసి తండ్రి స్థూపం వద్దకు వెళ్లి నివాళులర్పించారాయన. అప్పుడు కూడా ఆయన ట్విట్టర్ లో షేర్ చేసిన తన సాహసయాత్ర ట్రెండింగ్ న్యూస్.
ఇతర ముఖ్యమంత్రులైతే చాలావరకూ ఏంచేస్తారు…? ఎవరో అధికారుల బృందాన్నో, మంత్రులనో పంపి… వివరాలు సేకరిస్తారు. లేదంటే… హెలీక్యాప్టర్ లో విహంగ వీక్షణం చేస్తారు. పెద్ద పెద్ద కాన్వాయ్ లతో, రోప్ పార్టీల హంగామాతో చేసేది గోరంతైతే.. పబ్లిసిటీ మాత్రం కొండంత చేసుకుంటారు. కానీ పెమాఖండూ.. అక్కడి ప్రజల రవాణాకు ఎలాంటి పరిస్థితులుంటాయి… తమ ఊరు దాటి బాహ్య ప్రపంచంలోకి రావాలంటే వారెంత కష్టపడాల్సి ఉంటుందనేటుంవంటి పలు క్షేత్రస్థాయి పరిస్థితులను స్వయంగా తానే తెలుసుకోవాలన్న తపనతో ఓ సాహసయాత్రికుడై.. ఓ పర్వతారోహకుడై బయల్దేరుతాడు. అయితే పెమాఖండూ ట్రెక్కింగ్ తరచూ వార్తల్లోకెక్కడం మాటటుంచితే… ఖండూ సహజంగా స్వభావరీత్యానే ఓ సాహసి. 2019లో కూడా ఆయన ఓసారి బైక్ యాత్రను చేబట్టారు. తమ రాష్ట్ర పర్యాటకాన్ని అభివృద్ధి బాట పట్టించే క్రమంలో… వాడు నడిపే బండి రాయల్ ఎన్ఫీల్డంటూ… 122 కిలోమీటర్లు ప్రయాణం చేసి తన రాష్ట్ర పర్యాటకశాఖకు తానే ఓ బ్రాండ్ అంబాసిడరయ్యాడు. బాలీవుడ్ స్టార్ హీరో సల్లూభాయ్ తో కలిసి.. బైక్ యాత్రలు చేశాడు ఖండూ. అలా ఆయన వీడియోలు, ఫోటోలు, వార్తలూ ఎప్పుడూ వైరలే మరి!
అంతేకాదు రాష్ట్ర అభివృద్ధిలో భాగంగా తమ అధికారుల్లో ప్రతిభా, సామర్థ్యాలను పెంపొందించేందుకు ఐఐఎం షిల్లాంగ్ కు చెందిన డాక్టర్ అబ్దుల్ కలాం సెంటర్ ఫర్ పాలసీ రీసెర్చ్ అండ్ అనాలిసిస్ తో ఒప్పందం కుదుర్చుకున్నా… కోవిడ్ సమయంలో రాష్ట్రంలో ప్రతీ ఒక్కరికీ కరోనా వ్యాక్సినేషన్ పూర్తి చేసిన రికార్డైనా… ఇలా ప్రతీ పనిలో పెమాఖండూ ఉత్సుకత.. అందులోని ప్రత్యేకత కొట్టవస్తుంది.
రాజకీయాల్లో ఉన్నవాళ్లు రాజకీయాలు చేయాల్సిందే. అందుకు పెమాఖండూ మినహాయింపేం కాదు. అయితే, రాజకీయాల్లో రాజనీతితో వ్యవహరించే పెమాఖండు.. ఏనాడూ అరుణాచల్ ప్రదేశ్ ప్రజల మన్ననలు మాత్రం కోల్పోలేదు. అదే ఆయన రాజనీతిజ్ఞత. సరే, రాజకీయాల విషయంలోనూ ఆయన గురించి భిన్నాభిప్రాయాలే ఉన్నా… ప్రజల కోసం, రాష్రం కోసం ఆలోచించి కాలిబాటన క్షేత్రస్థాయి పరిస్థితులను పరిశీలించే ముఖ్యమంత్రిగా మాత్రం.. పెమాఖండు కచ్చితంగా ఓ అరుదైన ముఖ్యమంత్రే!
Share this Article