ఒక వార్త… ప్రజాశక్తిలో… అది సీపీఎం పత్రిక… మోడల్ రాష్ట్రంలో ఇళ్లపై మొసళ్లు అని శీర్షిక… ఇంట్రో చదువుతూ ఉంటే… ‘‘మోడీ గుజరాత్ దేశానికే మోడల్ అంటుంటాడు… కానీ కొన్నిరోజులుగా వర్షాలు, వరదాలు ఆ రాష్ట్రాన్ని నామరూపాలు లేకుండా చేస్తున్నాయి… ఇంటి పైకప్పులపై మొసళ్లు తిరుగుతున్నాయి… జనం బిక్కుబిక్కుమంటున్నారు…
డబుల్ ఇంజన్ సర్కారు చేతులెత్తేసింది… తీవ్ర నిర్లక్ష్యంతో వర్షాలు తగ్గినా వరదలు కొనసాగుతూనే ఉన్నాయి… నిత్యావసరాల పంపిణీలో గానీ, పునరావాస శిబిరాల్లో సౌకర్యాల కల్పనలో గానీ శ్రద్ధ వహించడం లేదు ప్రభుత్వం…. ఇలా సాగిపోయింది… అబ్బో, ఇదేదో బాగానే ఉంది,ఆ ప్రభుత్వ నిర్లక్ష్యం గురించి ఏం రాశారో చదువుదామని టెక్స్ట్‌లోకి వెళ్తే అక్కడేమీ లేదు…
స్పాట్ వార్త.,.. ఎక్కడెక్కడ ఎంత వర్షాలు, వరదల ఉధృతి గట్రా వివరాలున్నాయి, అంతే… సహాయక చర్యల్లో ఎన్‌డిఆర్ఎఫ్, ఎస్‌డిఆర్ఎఫ్‌తోపాటు త్రివిధ దళాలు పాల్గొంటున్నట్టుగా కూడా ఉంది… ట్రాఫిక్, కరెంటు, రైల్వే సర్వీసులకు అంతరాయాల గురించీ ఉంది… మరి ఈమాత్రం దానికి డబుల్ ఇంజన్ సర్కారు, ఇళ్లపై మొసళ్లు, రాష్ట్రమే నామరూపాల్లేకుండా పోతోందనే తీవ్ర వ్యాఖ్యలు దేనికి..?
Ads
ఎందుకంటే..? హెడింగ్, ఇంట్రోలో కేవలం మోడీ మీద ద్వేషమే కనిపిస్తోంది… రెండు తెలుగు రాష్ట్రాల్లో వరద పరిస్థితుల వార్తలు చదువుతుంటే ఇదుగో ఈ వార్తే ఇలా గుర్తొచ్చింది హఠాత్తుగా… ఒక్కో మీడియా తన పొలిటికల్ లైన్ అనుగుణంగా వార్తల్ని వండుతోంది… ఏ రాష్ట్రమైనా సరే ఇలాంటి విపత్తులు వచ్చినప్పుడు వెంటనే ఎస్‌డిఆర్ఎఫ్, ఎన్‌డిఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగిపోతాయి… రాష్ట్రంలో ఎవరు అధికారంలో ఉన్నారనేది ఇక్కడ అప్రస్తుతం… ఈ నిధులు అందుబాటులో ఉంటాయి… పౌర అధికార యంత్రాంగం అప్రమత్తత, వేగమే ప్రజల్ని కాపాడేవి… సరే, పరిస్థితులు కాస్త చక్కబడ్డాక నష్టం అంచనాలు, పరిహారాలు గట్రా కథలు వేరు…
జనాన్ని సురక్షిత ప్రాంతాలకు తరలించడం, ప్రాణనష్టాన్ని నివారించడం తక్షణ కర్తవ్యాలు… భారీగా వరదలు వచ్చి, ఇళ్లు మునిగి, నీళ్లలోని మొసళ్లు ఇంటి పైకప్పుల మీద కనిపిస్తే కూడా మోడీదేనా బాధ్యత..? మొసళ్లేం ఖర్మ, నీటిలో ఉండే జీవాలన్నీ కనిపిస్తాయి… పోనీ, నిజంగానే రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం ఉంటే, అదైనా వివరంగా రాయాలి కదా, అదీ లేదు… పాత్రికేయం గురించి నీతులు చెప్పడం కాదు కామ్రేడ్స్, ఆచరణలో అది కనిపించాలి…
కేరళలో వయనాడ్ బీభత్సం తెలుసు కదా… ఈరోజుకూ పరిస్థితులు కుదుటపడలేదు… మరక్కడ ఉన్నది మీ లెఫ్ట్ ప్రభుత్వమే కదా… కేరళ మొత్తం నామరూపాల్లోకి కొట్టుకుపోతోందనే వ్యాఖ్య అప్పుడెందుకు రాలేదు..? ఈరోజుకూ జనం అవస్థలు తీరలేదు అక్కడ… గుజరాత్ వేరు, కేరళ వేరు కాదు ప్రకృతి విపత్తులకు… విపత్తులకు వివక్షలుండవు… దానికి బీజేపీ సర్కారు, సీపీఎం సర్కారు అనే రాగద్వేషాలు ఉండవు… ఎలాగూ పొలిటికల్ స్టోరీల్లో ఏదేదో రాసేస్తున్నారు…
కనీసం ఇలాంటి ఉపద్రవాలు సంభవించినప్పుడు స్ట్రెయిట్‌గా, న్యూట్రల్‌గా వార్తలు రాయొచ్చు కదా… ఇక రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇలాంటి అడ్డదిడ్డం వార్తలు మొదలవుతాయి… ప్రతిపక్షాల కరపత్రాలు, మైకులు ఇక స్టార్ట్ చేస్తాయి… నిజానికి అటు చంద్రబాబు ప్రభుత్వం గానీ, ఇటు రేవంత్ రెడ్డి ప్రభుత్వం గానీ ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ, అప్రమత్తంగానే కనిపిస్తున్నాయి…
అప్పుడే యాంటీ టీడీపీ సోషల్ మీడియా స్టార్ట్ చేసింది… అమరావతి మునిగిపోయింది, ఇదీ మన రాజధాని అంటూ ఫోటోలతో కుమ్మేస్తున్నారు పోస్టులు… ఈ ముప్పు ఉంది కాబట్టే చంద్రబాబు అక్కడ కొండవీటివాగు వరదల్ని మళ్లింపు అంశాల్ని కూడా అమరావతి ప్రాజెక్టులో పొందుపరిచాడు… ఇలా ఇంకెన్ని చదవాలో..!!
Share this Article