సోషల్ మీడియాలో ఓ మిత్రుడి అభిప్రాయం కరెక్టే అనిపించింది… విషయం ఏమిటంటే..? కల్కి మేకర్స్, అనగా వైజయంతి మూవీస్ వాళ్లు 25 లక్షల రూపాయల విరాళాన్ని ఏపీ సీఎం రిలీఫ్ ఫండ్‌కు ఇచ్చారు… ఆయ్ సినిమా నిర్మాత తన వారం రోజుల షేర్‌లో 25 శాతం ఇస్తానని ప్రకటించాడు… అదీ ఏపీ సీఎం రిలీఫ్ ఫండ్‌కే…
వీళ్లు తీసే ఏ సినిమాలకైనా అత్యధిక వసూళ్లు వచ్చేవి నైజాం ఏరియాలోనే… అంటే తెలంగాణలో… వీళ్లు ఉండేది ఇక్కడే… ఈ హైదరాబాద్ నుంచే పాన్ ఇండియా సినిమాలు తీస్తారు… కల్కి సినిమాకు 1100 కోట్ల వసూళ్లు అని చెబుతున్నారు… ఇదే కల్కి సినిమా కొన్ని ఆంధ్రా జిల్లాల బయ్యర్లు మునిగిపోయారు… బ్రేక్ ఈవెన్ కూడా రాలేదు… నైజాం మాత్రం భారీగా వసూళ్లను కట్టబెట్టింది…
ఐనాసరే, వరద కష్టం వచ్చినప్పుడు వీళ్ల హృదయాలు ఆంధ్రా కష్టాలకే కొట్టుకున్నాయి గానీ తెలంగాణ కూడా అదే వరద నష్టాలకు గురవుతోంది కదా… తెలంగాణలోనే అధిక నష్టం వాటిల్లింది కదా… మరి తెలంగాణ సీఎం రిలీఫ్ ఫండ్‌కు రూపాయి సాయం చేయలేదేం..? వీళ్లు ఎన్నేళ్లయినా అక్కడి వాళ్లే తప్ప ఇక్కడి వాళ్లు కాలేరు……. ఇదీ ఆ మిత్రుడి అభిప్రాయం స్థూలంగా…
Ads
నిజమే కదా… ఏపీ కష్టాలకే స్పందించే మానవతా హృదయాలకు తెలంగాణ కష్టాలు ఎందుకు కనిపించవు..? ఇప్పుడే కాదు, తెలంగాణకు ఏ కష్టం వచ్చినా ఏ టాలీవుడ్ పెద్ద తలకాయ స్పందించినట్టుగా ఎప్పుడూ చదివినట్టు గుర్తులేదు… మన జనం ఫ్యాన్స్ పేరిట వాళ్లను ఆరాధిస్తారు, పూజిస్తారు, అంగీలు చింపుకుంటారు… మన ప్రభుత్వాలు కూడా వాళ్లెవరైనా మరణిస్తే అధికార లాంఛనాలతో పైలోకాలకు సాగనంపుతాయి…
నిజానికి ఇతర భాషల ఇండస్ట్రీలతో పోలిస్తే తెలుగు సోకాల్డ్ లెజెండ్స్, సెలబ్రిటీలు జనం కష్టాల పట్ల పెద్దగా స్పందించరు… స్పందించే సందర్భాల్లో కూడా ఏపీ మీదే దృష్టి… అదెందుకు..? ఎందుకీ ప్రాంతీయ వివక్ష..? ఇలాంటి అభిప్రాయాలు వెల్లడిస్తేనేమో తప్పు… విరాళాలు వస్తుంటే రంధ్రాన్వేషణ అంటారు… కానీ నిజం మాట్లాడుకోవాలి కదా…
వెంకయ్యనాయుడి విరాళం తీరు చూస్తే… తన పెన్షన్ల సొమ్ము నుంచి ఏపీ, తెలంగాణలకు అయిదేసి లక్షలు ఇచ్చాడు… కొడుకు, కూతురు నడిపే ఫౌండేషన్ల నుంచి కూడా సమానంగా రెండు రాష్ట్రాల రిలీఫ్ ఫండ్లకు విరాళం ప్రకటించారు… అంతేకాదు, తను ప్రధానితో కూడా మాట్లాడాడు… అదీ పరిణతి… మరి ఈ సినిమాల మేకర్స్..? ఇదే కల్కి మేకర్ అశ్వినీదత్ మీద అమరావతి భూముల బాపతు బోలెడు ఆరోపణలున్నాయి…
రూపాయి విదిల్చాలన్నా తనకు ఏపీయే కనిపిస్తుంది… పొలిటికల్ యాంబిషన్స్ కూడా ఉన్నట్టున్నాయి… మరి ఎంతసేపూ ఈ లెక్కలు, ఈ వివక్షతోనే కాలం గడిపితే నువ్వు చూపే మానవతాసాయానికి విలువేం ఉన్నట్టు మహాశయా..? నీ అంతరాత్మకు సమాధానం చెప్పు ఓసారి… తెలంగాణ సమాజానికి కాదు..!! నీ ప్రకటనలో చివరగా రేపటి కోసం అని రాశారు కదా, తెలంగాణ జనానికి కూడా రేపు అనేది ఉంటుంది మాస్టారూ…
అప్‌డేట్ :: జూనియర్ ఎన్టీఆర్ రెండు రాష్ట్రాలకూ 50 లక్షల చొప్పున విరాళం ప్రకటించాడు… భేష్… మిగతా హీరోలకు ఆదర్శం…
Share this Article