ఈ ప్రపంచంలో అన్నిటి కన్నా భయంకరమైన బాధ ఏమిటి? మరణం ముందు దీర్ఘకాల రోగం, ఆర్ధిక సమస్యలు, కోర్టు కేసులూ… ఉహు… ఇవేమీ కావు. అన్నిటి కన్నా పెద్ద సమస్య… మనకి ఇష్టం లేనివారితో కలిసి బ్రతకాల్సిరావటం.
అవును. శారీరక బాధల్లోనూ, ఆర్ధిక సమస్యల్లోనూ, ‘ఎప్పటికైనా ఈ అవస్థ నుంచి బయట పడక పోతామా’ అన్న చిన్న ఆశ చిరుదీపంలా మినుక్కు మినుక్కు మంటూ ఉంటుంది. కానీ “కష్టసాధ్యమైన మనుష్యులతో” కలిసి ఉండటం కన్నా నరకం మరొకటి ఉండదు. ఒకే ఇంట్లో ‘ఎడమొహం’ వ్యక్తులతో, ఉమ్మడి కుటుంబంల్లోని పెడమొహం సభ్యులతో, ఆఫీసులో ‘నచ్చని’ అధికారులతో, ఫ్యాక్టరీల్లో ‘పడని’ కొల్లీగ్స్ తో కలిసి పని చేయటం నరకం.
మనుష్యుల్లో స్ట్రెస్ గురించి, 5 వేల మంది సంసారులు, ఉద్యోగులు, వర్కర్లపై ఒక సర్వే చేసారు. అందులో నూటికి ఎనభైమంది ఫీలయ్యే ‘స్ట్రెస్’ ఏమిటో తెలుసా? ఇంటర్-పెర్సనల్-రిలేషన్స్..! అవును. ఇంట్లో, ఆఫీసులో, బంధువుల్లో, తమ చుట్టూ ఉన్నవారి వల్ల వచ్చే స్ట్రెస్ కి చాలామంది లోనవుతున్నారని వెల్లడి అయింది.
Ads
అజ్ఞాని అయిన అధికారి, బద్దకస్తుడైన తోటి ఉద్యోగి, ఎప్పుడూ సణుగుతూ ఉండే భార్య, నిరంతర కోపగ్రస్తుడైన భర్త, చాదస్త రోగ రూపిణి అత్తగారు, డామినేటింగ్ ఆడబడుచు,… దుప్పట్లో దోమల్లాంటివారు. వీళ్ళు మన శక్తిని పీల్చేస్తారు. జీవితం పట్ల ఉత్సాహాన్ని, నవ్వునీ హరించి వేస్తారు.
కానీ ‘వీళ్ళు’ అంటే ఎవరు? మనమేగా. ఈ ఇంటికి ఆ ఇల్లు ఎంత దూరమో, ఆ ఇంటికి ఈ ఇల్లూ అంతే దూరం కదా. వాళ్లలో మనకి ఎన్ని లోట్లు కనపడుతున్నాయో, మనలో కూడా వారికి అన్ని ‘మైనస్’లు కనపడతూ ఉంటాయి. కానీ, ఇద్దరూ కలిసి జీవించటం తప్పనిసరి అయినప్పుడు ఉన్నంతలో కాస్త సర్డుకుపోవటం ఎలా? ఇటువంటి పరిస్టితుల్లో ఏమి చెయ్యాలి?
1. Identify your Sympathizers: రామాయణంలో విభీషణుడిలా అవతలి సైన్యం మన వైపు సానుభూతి పరులెవరో గ్రహించాలి. ఇంట్లో / office లో అప్పటికే బలీయమైన స్థానంలో ఒకరు ఒకరుంటారు. “నేను శత్రుపక్షంలో ఉండడంవల్ల నీకెక్కువ నష్టం కలుగుతుంది కాబట్టి నన్ను మంచి చేసుకుంటే నువ్వు లాభం పొందుతావు’’ అని అప్పటివరకూ మొదటి స్థానంలో మనిషికి ఇన్‌డైరెక్ట్‌గా ‘హింట్’ లిస్తూ ఉండాలి. అది సాధ్యం కాకపొతే అప్పటి వరకూ రెండవ స్థానంలో ఉంటూ పోరాడుతున్న వ్యక్తికి ఆసరాగా వెళితే, (ఇద్దరూ కలిసి) మొదటి స్థానంలో ఉన్న వ్యక్తి బలాన్ని తగ్గించవచ్చు. అయితే ఇది అన్ని చోట్లా సాధ్యం కాదు.
2. Identify the weaknesses: అవతలివారి ప్రవర్తనకి ‘కోపిష్టి, మంకుపట్టు, అశుభ్ర, బద్దకస్త, ఈగోయిస్టిక్’ లాంటి లేబుల్స్ అతికించకండి. ఏ వ్యక్తి కూడా మరీ అంత మానసికంగా అస్పృశ్యుడు కాదు. ఇద్దరికీ ఇష్టమైన విషయాలు కనీసం కొన్నైనా ఉంటాయి. వాటిని పెంచటానికి, ఆ సర్కిల్ లో ఎక్కువ కాలం ఉండటానికి ప్రయత్నం చెయ్యండి. Build on commonalities అంటారు. ఎదుటి వ్యక్తిలో ఉన్న (మంచి + చెడు) క్వాలిటిస్ లో మీకు నచ్చని వాటి సర్కిల్స్ లోకి వీలైనంత వరకూ వెళ్ళకుండా ఉండటానికి ప్రయత్నం చెయ్యండి. ఈ సర్కిల్స్ లోంచి బయట పడే అవకాశం ఏమైనా ఉన్నాదా అని అన్వేషించండి తప్ప, వీలైనంత వరకూ వాదించకండి. వాళ్ళతో వాదించి మీరు గెలవలేరు. వాళ్ళు తమ తప్పులని అస్సలు వొప్పుకోరు. కానీ ఒక క్షణం ఆలోచించండి. మీరు మీ తప్పులనీ బలహీనతలనీ వొప్పుకుంటున్నారా?
3. Never play loose games: ఊహించని కోణంలోంచి విపత్తు వస్తే తట్టుకోగలిగే ధైర్యం ఉండాలి. ఉదాహరణకి అత్తవారింట్లో అడుగు పెట్టగానే ఆడపడుచు (తన ఈడుదే అవడం వల్ల) మంచి స్నేహితురాలిలా కనపడవచ్చు. మనసు విప్పి అన్నీ ఆమెకి చెప్పుకుంటే, ఏదో మనస్పర్థ వచ్చినప్పుడు ఆ ఆడపడుచు వెళ్ళి చెప్పకూడని విషయాలు ఆమె తల్లికి చెప్తే… అగ్నిపర్వతం పేలిపోయే ప్రమాదం ఉంది. అలాగే – అత్తగారి గురించి తోడికోడలు దగ్గర పాస్ చేసిన కామెంట్ ఆమె నోరు జారవచ్చు.
4. Build small bridges. అవతలివారిని మభ్య పెట్టవలసిన పరిస్థితిని ‘లౌక్యం’ అంటారు. చిన్న చిన్న కాంప్లిమెంట్లు శత్రువునైనా సంతోషపడేలా చేస్తాయి. చిన్న చిన్న వంతెనలు కట్టటానికి ప్రయత్నించండి. అవతలి వాళ్ళు కూల్చేస్తున్నారు … అనొద్దు. అసలు మీరు కడుతున్నారా? అన్నది ప్రశ్న. గతంలో ప్రయత్నించి ఓడిపోయాను అన్నది మీ సమాధానం అయితే… ఒకటే మార్గం. అవతలి వారి undue influence నుంచి బయటకు రండి. చెప్పటం సులభమే. ఆచరణలో కష్టం. తెలుసు. కానీ ఒక్క విషయం గుర్తు పెట్టుకోవాలి. వాళ్ళు బాగానే ఉన్నారు. వారి మాట సాగుతోంది. కాబటి వాళ్ళు మారరు. మారాల్సిన అవసరం వాళ్లకి లేదు. కలసి ఉండాల్సిన అవసరం మీకుంది. అసలు ఇలాంటి పరిస్తితి ఎందుకు వచ్చింది?
“బ్రతుకు తెరువు కోసం తప్పని సరిగా ఒకరితో కలిసి ఉండాల్సి రావటం, సామాజిక కట్టుబాట్ల పట్ల భయం, ఆర్ధిక స్వాతంత్రం లేకపోవటం, దుర్మార్గపు కొడుకు, తాగుబోతు మనవడు లాంటివాళ్ళని వదుల్చుకోలేని ‘రక్త సంబంధం పట్ల ప్రేమ”… ఇవే సాధారణంగా మనని బాధ పెట్టే, మనకి ఇష్టంలేని వ్యక్తులతో కలిసి జీవించేలా చేస్తాయి.
‘తివిరి ఇసుమున తైలంబు తీయవచ్చు- తవిలి మృగతృష్ణలో నీరు త్రాగవచ్చు- తిరిగి కుందేటి కొమ్ము సాధింపవచ్చు- చేరి మూర్ఖుని మనసు రంజింప రాదు” అన్న పద్యమే శరణ్యం. కానీ ప్రయత్నం చేయటంలో తప్పు లేదుగా. ఎప్పుడో పాతిక సంవత్సరాల క్రితం ‘విజయానికి ఐదు మెట్లు’ అన్న పుస్తకంలో కొటేషన్ చెప్పి ముగిస్తాను. “అతను ఒక చిన్న వృత్తం గీసుకొని నన్ను బయటకి తోసేశాడు. నేను ఒక పెద్ద వృత్తం గీసి అతడిని లోపలికి ఆహ్వానించాను…”. (మిమ్మల్ని మీరు గెలవగలరు” పుస్తకం నుంచి…) — యండమూరి వీరేంద్రనాథ్
Share this Article