“భారతదేశంలో 200 మిలియన్ల పిల్లలు నిరాసక్తంగా బ్రతుకుతూ ఉన్నారు”…
చాలా దిగులు చెందవలసిన వార్త ఇది. దేశంలో మొట్టమొదటిసారిగా “ఆటలు మరియు వ్యాయామం” గురించిన సర్వే ఒకటి నిర్వహించబడింది. పెద్దల్లో ఉండే రకరకాల ఆపోహలని ఈ సర్వే బయటపెట్టింది. పిల్లలు రోజుకి కనీసం గంటా రెండు గంటలు అయినా ఆడుకోనివ్వకుండా పెద్దలు కట్టడి చేయటానికి ఈ క్రింది కారణాలు వివరించింది ఆ సర్వే.
1. ఎక్కువ అలసిపోతే చదువు సరిగ్గా ఎక్కదు. ఆశ్చర్యం కలిగించే విషయం ఏమిటంటే తల్లిదండ్రుల్లో ఐదుగురిలో కనీసం ఒకరు దీన్ని నమ్ముతున్నారు.
2. వ్యాయామం అనేది కేవలం స్థూల కాయం ఉన్నవారికి మాత్రమే అని ముగ్గురు పేరెంట్స్ లో ఒకరు నమ్ముతున్నారు.
3. ‘వ్యాయామం’ అనేది 50 దాటిన పెద్దలకు… ‘ఆటలు’ అనేవి చిన్నపిల్లలకు మాత్రమే అని, అవేమీ తమకు అవసరం లేదని 20 దాటిన యువకులు నమ్ముతున్నారు.
4. నెలసరి సమయంలో ఎక్కువ అలసి పోకూడదని ఆడ పిల్లలని పెద్దలు కట్టడి చేస్తున్నారు.
5. వ్యాయామం వల్ల కండలు గట్టిపడితే అది వివాహానికి అడ్డంకి అని 60 శాతం గ్రామీణ యువతులు భావిస్తున్నారు.
6. ఆటల్లో ఎక్కువ పాల్గొన్నా., ఎక్కువ వ్యాయామం చేసినా పొత్తికడుపులో నొప్పి వస్తుందని స్త్రీలు ఇప్పటికీ నమ్ముతున్నారు.
7. ఒక వయసు వచ్చిన తర్వాత ఆటలు మానేయాలి.
8. మోకాళ్ళ నొప్పులకు కారణం ఆటలు, వ్యాయామం… అని చదువుకున్న వారు కూడా బలంగా నమ్ముతున్నారు.
9. 16 ఏళ్లు దాటిన ఆడపిల్లలకు ఆటలు అవసరం లేదు. ఎక్కువసేపు ఆడితే మొహం నల్లబడిపోతుంది. చర్మం మందంగా తయారవుతుంది. శరీరం సున్నితత్వం కోల్పోతుంది.
10. శరీర సౌష్టవ పోటీల్లో పాల్గొనటానికి మాత్రమే యువకులు కండరాలు పెంచుతారు. మిగతా జనాలకి అది అనవసరం.
Ads
ఇటువంటి దిగ్భ్రాంతకరమైన పది పాయింట్లని ఈ సర్వే వెల్లడి చేసింది. జనం…. ముఖ్యంగా పిల్లలు, యువతీ యువకులు జీవితం పట్ల జడులుగా, నిరాసక్తంగా బతకటం గురించి విచారం వెలిబుచ్చింది.
“ఆటలు, వ్యాయామం మనుషుల్ని ఏ వయసులో అయినా హుషారుగా ఉంచుతాయి” అని భావించని జనం భారతదేశంలో 200 మిలియన్లకు పైగా ఉండటం విచారించదగ్గ విషయం… (యండమూరి వీరేంద్రనాథ్)
Share this Article