నిజంగా ఎంత బాధ్యతారాహిత్యం… ఈ 12 మంది మరణాలకు ఎవరిని నిందించాలో అర్థం కాదు… పెత్తనాలు, సంపాదన, అరాచకం తప్ప మరేమీ పట్టని వర్తమాన రాజకీయాల్లో నేతలెవరికీ ఎలాగూ పట్టదు… కీలక పదవుల్లో ఉన్న ఉన్నతాధికారుల బుర్రలేమైనాయో అర్థం కాదు… స్వీపర్ పోస్టులకు సైతం వేల మంది పోస్ట్ గ్రాడ్యుయేట్లు పోటీపడుతున్న తీరు ఇంతకుముందు చదువుకున్నాం కదా… ఇది మరో కథ…
జార్ఖండ్… ఆగస్టు 22 నుంచి ఎక్సయిజు కానిస్టేబుళ్ల పోస్టులకు అర్హత పరీక్షలు నిర్వహిస్తున్నారు… అందులో మొదటిిది ఫిజికల్ ఫిట్‌నెస్ పరీక్ష… గతంలో 1.6 కిలోమీటర్లు ఆరు నిమిషాల్లో పరుగెత్తాలని నిబంధన ఉండేది… దాన్ని కాస్తా కొన్నేళ్ల క్రితం గంటలో 10 కిలోమీటర్లు పరుగెత్తాలని మార్చారు… నిజానికి ఎక్సయిజు కానిస్టేబుల్ పోస్టుల భర్తీ ఆ రాష్ట్రం ఏర్పడిన 2000 తరువాత ఎప్పుడూ జరగలేదు… 2008, 2019 సంవత్సరాల్లో ప్రక్రియ ప్రారంభించారు గానీ, ఆగిపోయింది… ఇన్నేళ్లకు ఇప్పుడు మళ్లీ…
ముందు ఫిజికల్ ఫిట్‌నెస్ నిరూపించుకున్నాక రాత పరీక్ష అట, తరువాత వైద్య పరీక్షలు అట… ఇష్టారాజ్యంగా రూల్స్ చేంజ్ చేశారు.,. ఈ ఫిజికల్ ఫిట్‌నెస్ పరీక్షల్లో ఇప్పటికి 12 మంది మరణించారు… మొత్తం ఇప్పటివరకు 1.87 లక్షల మంది ఈ పరీక్షలకు హాజరు కాగా, 1.17 లక్షల మంది తదుపరి రౌండ్‌కు అర్హత సాధించారట…
Ads
10 కిలోమీటర్ల పరుగు, అదీ గంటలో… చాలామంది అలిసిపోయారు… హఠాత్తుగా కుప్పకూలిపోయారు… ఐతే పోలీసులు సింపుల్‌గా దీన్ని కొట్టిపడేస్తున్నారు… కొందరు అభ్యర్థులు గుండెపోటుతో మరణించారు… ఇతరత్రా కారణాలు కూడా ఉండొచ్చు అని తేలికగా తీసిపడేస్తున్నారు… అదనపు డీజీ స్థాయి పోలీస్ అధికారి అయితే ఈ అర్హత పరీక్షకు హాజరు కావడానికి ముందే మెడికల్ చెకప్స్ చేయించుకోవాలిగా అనేశాడు…
‘‘పోలీస్ కానిస్టేబుళ్ల పోస్టుల భర్తీకి కూడా అర్హతల్ని 2014లో సవరించారు… దాని ప్రకారం పురుషులైతే గంటలో 10 కిలోమీటర్లు, మహిళలయితే 5 కిలోమీటర్లు పరుగెత్తాలి… అవే రూల్స్‌ను ఎక్సయిజు కానిస్టేబుళ్ల పోస్టులకూ వర్తింపజేస్తూ రూల్స్ సవరించారు… మేం రూల్స్ ఫాలో అవుతున్నాం, అంతే’’ అని సమర్థించుకున్నాడు ఆయన…
మరి ముందుగానే రాత పరీక్ష నిర్వహించి, అందులో పాసైన వాళ్లకే ఈ పరుగు పరీక్ష పెడితే సరిపోతుంది కదా, గతంలో అలాగే ఉండేది కదానే ప్రశ్నకు ఎక్సయిజు డిపార్ట్‌మెంట్ సెక్రెటరీ ‘అబ్బే, అభ్యర్థులందరికీ రాత పరీక్ష నిర్వహించడం వేస్ట్, మాకు తెలివితేటలుకంటే ఫిజికల్ ఫిట్‌నెసే ముఖ్యం’ అన్నాడు… అవీ మన ఉన్నతాధికారుల తెలివితేటలు…
ఎక్సయిజు కానిస్టేబుళ్లకు బుర్రలు పెద్దగా అక్కరలేదట, ఫిట్‌గా ఉండి, పరుగు తీసే సామర్థ్యం ఉంటే చాలట… పైగా ఈ పరీక్షల్ని ఉదయం నుంచే నిర్వహిస్తున్నారు… వాతావరణంలో తేమకు తోడు చాలామంది అభ్యర్థులు అసలు అంతకుముందు ప్రాక్టీస్ కూడా చేసినవారు కాదు… దాంతో ఒక్కసారిగా కుప్పకూలిపోయారు… సీఎం హేమంత్ సోరెన్ రిక్రూట్‌మెంట్ నియమాల్ని మారుస్తానని ఇప్పుడు చెబుతున్నాడు… ఈ మరణాలు బీజేపీ, జేఎంఎం నడుమ వాగ్వాదాలకు దారితీసింది సహజంగానే… కానీ పోయిన ప్రాణాలు మళ్లీ రావు కదా…!!
Share this Article