( మార్తి సుబ్రహ్మణ్యం) హైదరాబాద్ స్టేట్.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్.. తెలంగాణ-ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు ఏర్పడిన నాటి నుంచి ఇప్పటివరకూ ఏ పాలకుడికీ రాని ధర్మ సందేహం తెలంగాణ యువ ఏలిక రేవంత్‌రెడ్డికి వచ్చింది. అసలు నిజమైన జర్నలిస్టు ఎవరు? జర్నలిస్టును నిర్వచించేదెవరు? అన్నదే రేవంతుడు సమాజానికి సంధించిన గొప్ప ధర్మసందేహం లాంటి భేతాళ ప్రశ్న. మామూలుగా ఓ ముప్పయ్ ఏళ్ల క్రితమైతే జర్నలిస్టు పదానికి ఠక్కున నిర్వచనం చెప్పే అవకాశం ఉండేది. కానీ ఆది ఇప్పుడు భేతాళ ప్రశ్న కంటే కొంచెం క్లిష్టమైనది. దానిని నిర్వచించే మహానుభావులు, పాత్రికేయ స్రష్ఠలు ఉన్నారేమో ఓసారి చూద్దాం.
హైదరాబాద్‌లో జర్నలిస్టుల హౌసింగ్ సొసైటీకి ఇళ్ల స్థలాలకు సంబంధించిన పత్రాలను, తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి ఆ సొసైటీ పాలకవర్గానికి అందించారు. సంతోషం. నిజానికి ఇప్పటివరకూ ఏ ముఖ్యమంత్రీ చేయని పని అది. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ పదవీ విరమణకు ముందు ఇచ్చిన తీర్పు పుణ్యాన, జర్నలిస్టు హౌసింగ్ కష్టాలు గట్టెక్కాయి. నిజానికి చాలాకాలం నుంచి జర్నలిస్టులను, ముఖ్యమంత్రులు ఇళ్ల స్థలాలపై ఊరిస్తూ వచ్చారు. కానీ ఎవరూ ఆచరణలో పత్రాలివ్వలేకపోయారు. సుప్రీంకోర్టు సానుకూల తీర్పు ఇచ్చిన తర్వాత కూడా కేసీఆర్‌కు స్థలాలిచ్చేందుకు మనసొప్పలేదు. అలాంటి పార్టీ కూడా, జర్నలిస్టులపై దాడి గర్హనీయమంటూ కన్నీరు కార్చడం కామెడీ.
ఎందుకంటే తనకు వ్యతిరేకంగా రాసే జర్నలిస్టులను పదడుగులు పాతరేస్తానని, అలాంటి వారికి స్థలాలు ఇచ్చే పనిలేదని బహిరంగంగానే హెచ్చరించారు కాబట్టి. కానీ జస్టిస్ రమణ తీర్పును అమలుచేసిన రేవంత్ సాహసం మెచ్చదగిందే.
Ads
అసలు తెలంగాణ ఉద్యమానికి ఊపిరిలూది, అప్పటి ప్రజాప్రతినిధులు, అధికారులను తెలంగాణ వాదంతో దుంపతెచ్చి.. సొంత రాష్ట్రం సాకారమయేందుకు కారణమైన వారిలో జర్నలిస్టులే ప్రథమం. ఆంధ్రా యాజమాన్యాల కింద పనిచేసినా, తెలంగాణ కోసం తెగువ చూపిన వైనం మర్చిపోలేం. నిజానికి ‘తెలంగాణ జాతిపిత’ కేసీఆర్ అధికారం లోకి వచ్చిన వెంటనే, తమ ఇళ్ల స్థలాల సమస్యకు మోక్షం లభిస్తుందని జర్నలిస్టులు ఆశించారు. అందులో తప్పులేదు. అది అత్యాశేమీ కాదు.
అసలు కేసీఆర్ సీఎం అయిన వెంటనే తమను నెత్తిన పెట్టుకుంటారని, ఉద్యమ సమయంలో సచివాలయంలో పిడికిలి బిగించిన జర్నలిస్టులు చాలామంది ఆశించారు. కానీ విచిత్రంగా అధికారంలోకి వచ్చిన కొద్దిరోజుల్లోనే.. సీఎంఓ కింద ఉన్న సీపీఆర్వో గది, పైన ఉన్న సీఎంఓలోకి నిషేధాజ్ఞలు విధించారు. దానితోపాటు బారికేడ్లు కట్టి, దగ్గరలో ఒక గది నిర్మించి పిడికిలి బిగించిన జర్నలిస్టులకు కానుకగా దానిని బహుకరించారు. ఇది ఎవరు అవునన్నా, కాదన్నా నిష్ఠుర నిజం. తర్వాత తర్వాత అసలు సచివాలయ ప్రవేశంపై నిషేధాజ్ఞలు విధించారు. అది కేసీఆర్‌కు జర్నలిస్టులపై ఉన్న ప్రేమ మరి!
వైఎస్ సీఎంగా ఉన్నప్పుడు ఇప్పటి ప్రజాభవన్‌లోకి జర్నలిస్టులు సులభంగా వెళ్లేవారు. సచివాలయంలో మంత్రుల చాంబర్లకు యధేచ్చగా వెళ్లి, వారితో చిట్‌చాట్ చేసిన రోజులూ లేకపోలేదు. కేసీఆర్ పుణ్యాన అవన్నీ తీపి జ్ఞాపకాలుగా మిగిలిపోయింది. మంత్రులు జర్నలిస్టులతో ఫోన్లలో మాట్లాడేందుకే వణికిపోయేవారు. ట్యాపింగ్ అవుతాయని భయం మరి. ఇవన్నీ కట్టుకథలు కావు. అప్పట్లో పనిచేసిన జర్నలిస్టులకు అనుభవమైనవే. రేవంత్‌రెడ్డి సీఎం అయ్యాక మళ్లీ పాతరోజులకు తెరలేపారు. అంటే నియంతృత్వం నుంచి.. మళ్లీ ప్రజాస్వామిక యుగంలోకి తీసుకువెళ్లారన్నమాట.
ఎందుకంటే రేవంత్‌కు జర్నలిస్టుల విలువ తెలుసు. ఆయన స్వతహాగా ఒక పత్రికలో పనిచేసిరావడం ఒక కారణమైతే.. టీడీపీలో ఆయన ఆ పార్టీ వ్యవహారాలు చూసే జర్నలిస్టులతో ఎక్కువ చనువుగా ఉండటం మరొక కారణం అయి ఉండవ చ్చు. సహజంగా టీడీపీ స్కూల్ నుంచి వచ్చిన నేతలు, మీడియాతో సన్నిహితంగా ఉంటారు. అందుకు రేవంత్ మినహాయింపు కాదు. అయితే అప్పుడు టీడీపీ-ఆ శిబిరంలో ఉన్న ఆయనపై.. కాంగ్రెస్,టీఆర్‌ఎస్ అనుకూల మీడియాలో పనిచేసి, అనేక వ్యతిరేక వార్తలు, కథనాలు రాసిన వారికే ఇప్పుడు పెద్ద పదవులివ్వడం అదో వైచిత్రి. అది వేరే ముచ్చట.
ఇక రేవంత్ భేతాళ ప్రశ్న దగ్గరకు వద్దాం. అసలు నిజమైన జర్నలిస్టులు ఎవరు? దానిని నిర్వచించేది ఎవరన్న ఆయన ప్రశ్నకు, ఇప్పుడయితే జవాబు చెప్పడం బహు కష్టం. అసలు రేవంత్ ఈ ప్రశ్న వేయడానికి దారితీసిన పరిస్థితుల సృష్టికర్త.. ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న కాంగ్రెస్ పార్టీకి ఆరేళ్లు సీఎంగా వెలిగిన దివంగత నేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి. వైఎస్ సీఎం అయేంత వరకూ ఈనాడు, ఆంధ్రజ్యోతి మాత్రమే పెద్ద పత్రికలు. టీవీ9, ఎన్టీవీ, టీవీ 5 పెద్ద చానెళ్లు. వీటిలో సింహభాగం టీడీపీకి అనుకూలంగా వ్యవహరించినవే.
దానితో వైఎస్ అనేక సందర్భాల్లో ‘ఆ రెండు పత్రికలు’ అని విమర్శించేవారు. తనపై జరుగుతున్న మీడియా దాడిని ఎదుర్కొనేందుకు.. తన కొడుకు జగన్‌తో సాక్షి పత్రిక, చానెల్ పెట్టించారు. అప్పటివరకూ సొంత మీడియా లేదన్న లోటు-బాధ కాంగ్రెస్‌కు తీరినట్టయింది. ఇక అక్కడి నుంచే జర్నలిస్టులపై కూడా పార్టీల ముద్ర పెరిగింది. కాబట్టి.. నిజమైన జర్నలిస్టులెవరన్న అంశంపై రేవంత్ వగ చాల్సిన అవసరం లేదు. ఎందుకంటే దానికి ఆద్యుడు కాంగ్రెస్ సీఎం వైఎస్సే కాబట్టి!
అయితే అంతమాత్రాన రేవంత్ ప్రశ్నను పక్కనపెట్టడానికి లేదు. నిజానికి అది ఈ కాలానికి సజీవమైన ప్రశ్న. కేసీఆర్ కూడా టీఆర్‌ఎస్ ప్రచారం కోసం నమస్తే తెలంగాణ, టీ న్యూస్‌ను వెలిగించగా తర్వాత ఇంగ్లీషు పత్రికనూ ప్రారంభించారు. విభజనకు ముందు వామపక్షాలకు విశాలాంధ్ర- ప్రజాశక్తి పత్రికలుండగా.. విభజన తర్వాత ఆ రెండూ ఆంధ్రాకు పరిమితమై, వాటి స్థానంలో నవ తెలంగాణ, మన తెలంగాణలు పేరు మార్చుకున్నాయి. తరువాత సీపీఐ మన తెలంగాణ ప్రయోగం విఫలమై ఇదే శ్రీనివాసరెడ్డి సంపాదకుడిగా సీపీఐ ప్రజాపక్షం వస్తోంది…
తర్వాత మన తెలంగాణలో బీఆర్‌ఎస్ ఎంపి సంతోష్‌రావు పెట్టుబడులు ఉన్నాయని, ఇందులో త్వరలో ఖమ్మం జిల్లాకు చెందిన ఒక మంత్రి గారు త్వరలో పెట్టుబడులు పెట్టబోతున్నారన్నది ఒక ముచ్చట. అంటే రావు గారు వెళ్లి, రెడ్డిగారొస్తున్నారన్నమాట. కాంగ్రెస్ వచ్చిన తర్వాత ఆ పత్రికకు యాడ్లు నిలిపివేసినందున.. సర్కారుతో సంధి కోసమే, ఏపీలో జగన్‌కు సేవ చేసిన మాజీ సర్కారు సలహాదారును ఎడిటర్‌గా తెచ్చిపెట్టారని.. సదరు మంత్రితో మాట ముచ్చట్లన్నీ, సదరు మాజీ సలహాదారునివేనని వినిపిస్తున్న మరో ముచ్చట. సరే మజ్లిస్‌కు ఇత్తెమాద్ పత్రిక ఎప్పటినుంచో ఉన్నదే. ఇదీ స్థూలంగా ఉమ్మడి- విభజిత రాష్ట్రాల్లో మీడియా ప్రస్థానం.
వీటిలో ఈనాడు, ఆంధ్రజ్యోతి, ఆంధ్రభూమి, ఆంధ్రప్రభ, విశాలాంధ్ర, ప్రజాశక్తి ఉన్నంతవరకూ పెద్దగా పేచీలు రాలేదు. వామపక్షాలకు సంబంధించిన పత్రికలు తమ ప్రింటింగ్ ప్రెస్‌లకు గవర్నమెంటు పుస్తకాలు, ఇతర ఆర్డర్లు, సమాచారశాఖ నుంచి ప్రకటనలు మాత్రమే ఆశించేవి. ఆంధ్రభూమి-డెక్కన్ క్రానికల్ స్వతహాగా కాంగ్రెస్ మూలాలతో ప్రారంభమైనప్పటికీ, నిష్పక్షపాతంగానే వ్యవహరించేది. ఇక గిరీష్ సంఘీ ఒక్కడే అప్పట్లో కాంగ్రెస్‌కు బహిరంగ మద్దతుదారైనప్పటికీ, ఆయన దానివల్ల రాజకీయంగా లబ్ధిపొందారు. వైఎస్ జమానాలో ప్రభుత్వం నుంచి లెక్కలేనన్ని భూములు పొందారు. కానీ ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ అధికారికంగా సాక్షి, టీఆర్‌ఎస్ నమస్తే తెలంగాణ ఆవిర్భవించాయో అప్పటినుంచే.. రేవంత్ ఇప్పుడు వేసిన ‘నిజమైన జర్నలిస్టులు ఎవర’న్న పంచాయతీ మొదలయింది.
అయితే ఈనాడు-జ్యోతిది తొలి నుంచీ టీడీపీ అనుకూల వైఖరే కాబట్టి, కొత్తగా వచ్చిన సమస్యేమీ లేదు. అప్పటి కాంగ్రెస్ పాలకులపై అవి కూడా యుద్ధం చేశాయి. సహజంగా టీడీపీ అధికారంలోకి వచ్చిన ప్రతిసారీ, సమాచార శాఖ బడ్జెట్‌లో సింహభాగం ఆ రెండు పత్రికలకే సమర్పించుకున్న వైనం, ఆ రెండు పత్రికల జర్నలిస్టులకే పెద్దపీట వేస్తున్న నిజం రహస్యమేమీ కాదు. దానికి కులం ఒక కారణమైతే, ప్రతిపక్షంలో ఉండ గా తన కోసం పనిచేసిన కృతజ్ఞత మరో కారణం కావచ్చు. ఆ సంప్రదాయం ఇంకా విజయవంతంగా కొనసాగుతోందనేది నిష్ఠుర నిజం. ఆ పార్టీ కోణంలో అది సరైనదే కావచ్చు.
అయితే ఆ రెండు పత్రికలూ స్వతహాగా టీడీపీ స్థాపించిన పత్రికలు కావు. ఆ పార్టీ కళ్లు తెరవకముందే పుట్టిన పత్రికలు. ఆంధ్రజ్యోతిని వెలిగించింది కూడా కాంగ్రెస్ పార్టీనే. విచిత్రంగా ఈ రెండు పత్రికలు ఇప్పటికీ.. టీడీపీ అధినేత అయిన సీఎంను మినహాయించి, మిగిలిన మంత్రులు-అధికార వ్యవస్థపై వ్యతిరేక కథనాలు రాస్తుంటాయి. మరి పాఠకులు, సర్క్యులేషన్, మార్కెటింగ్ కూడా ముఖ్యం కదా? అదొక వ్యూహం అనుకోండి.
సాక్షి, నమస్తే తెలంగాణ కళ్లు తెరిచిన తర్వాత, రేవంత్ వేసిన నిజమైన జర్నలిస్టులెవరన్న ప్రశ్న తెరపైకి వచ్చింది. ఎందుకంటే తమ రాజకీయ ప్రత్యర్ధులకు వ్యతిరేకంగా ప్రారంభించిన ఆ మీడియా సంస్థల రాజకీయ లక్ష్యాన్ని నెరవేర్చే బాధ్యత.. సహజంగా ఆ మీడియా సంస్థల్లో జర్నలిస్టులదే. ఆ క్రమంలో తమ ప్రత్యర్ధి పార్టీలపై వ్యతిరేక కథనాలు రాయడం, ప్రెస్‌మీట్లలో వ్యతిరేక ప్రశ్నలు అడగటమనే సంప్రదాయం ప్రారంభమయింది.
దానితో ఆయా రాజకీయ పార్టీలు ఫలానా మీడియాను బహిష్కరిస్తున్నాం అని ప్రకటించే పరిస్థితి వచ్చింది. రేవంత్‌రెడ్డి టీడీపీలో ఉన్నప్పుడే ఈ సంప్రదాయం మొదలయిన విషయం మర్చిపోకూడదు. తర్వాత తమకు వ్యతిరేకంగా రాసే మీడియాకు.. పాలకులు ప్రకటనలు నిలిపివేసే చెడు సంప్రదాయం వైఎస్ నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి మొదలయితే, దానిని అన్ని ప్రభుత్వాలు అనుసరిస్తున్నాయి.
అయితే ఇందులో జర్నలిస్టులు నిమిత్తమాత్రులన్న విషయం పాలకులకూ తెలుసు. కానీ వారిపైనే అక్కసు అన్యాయం. రాజకీయ నేతలు పార్టీలు మారినప్పుడల్లా విధేయుతలు మారుస్తునట్లు.. జర్నలిస్టులు కూడా మీడియా సంస్ధలు మారిన, తర్వాత విధేయతలు మార్చుకుంటున్న పరిస్థితిని కొట్టివేయలేం. ఎందుకంటే అది వారికి జీవనభృతి కాబట్టి. ఈ క్రమంలో వారు రాసే రాతలకు సహజంగా విశ్వసనీయత ఉండకపోవచ్చు.
ఆ క్రమంలో వారి రాతలకు ఆగ్రహించే వర్గాలు జర్నలిస్టులపై దాడి చేస్తే అప్పుడు జర్నలిస్టుపై దాడి అంటారా? లేక ఫలానా పార్టీ జర్నలిస్టు అనాలా? ఆ పార్టీ తరఫున నడిపే పేపరు కాబట్టి, అందులో పనిచేసే రిపోర్టరుపై దాడి జరిగినప్పుడు తెరపైకి వచ్చే సందేహాలే ఇవి. దీనిని నేరుగా చెప్పేందుకు రేవంత్ మొహమాటపడినప్పటికీ, అసలు సందేహం.. రేవంత్ కవి హృదయం కూడా అదే.
నిజమే. ఉమ్మడి రాష్ట్రంలో విద్యుత్ ఉద్యమం ఉధృతంగా జరిగిన రోజుల్లో, వామపక్షాలు క్రియాశీల పాత్ర పోషించాయి. ఆ సందర్భంలో వాటి అనుబంధ సంస్థలు, ముఖ్యంగా విద్యార్ధి సంస్థల నేతలు అరెస్టయ్యారు. అందులో ఎస్‌ఎఫ్‌ఐ, ఏఎస్‌ఎఫ్‌ఐ,ఈవైఎఫ్‌ఐ సంఘాల నేతలు కూడా ఉండేవారు. ఆ సందర్భంలో జర్నలిస్టులను అరెస్టు చేయడం అన్యాయమంటూ, జిల్లా జర్నలిస్టు సంఘాలు గోల పెట్టేవి.
తీరా ఆరా తీస్తే.. అరెస్టయిన ఆ విద్యార్ధి సంఘ నేతల్లో కొందరు విశాలాంధ్ర, ప్రజాశక్తి అక్రెడిటేషన్ ఉన్న జర్నలిస్టులని తేలింది. మరి వారిని జర్నలిస్టులనాలా? విద్యార్ధి సంఘ నేతలనాలా? ఇప్పటికీ అదొక సందేహం. వామపక్షాలు తమ ఫుల్‌టైమర్లకు, జర్నలిస్టులకిచ్చే అక్రెడిటేషన్ కార్డులు తీసుకుంటారు. వాటిని ప్రభుత్వం ఎలా ఇస్తుందన్నది ప్రశ్న.
ఇంకొంచెం లోతుల్లోకి వెళితే.. ఒక పార్టీ అధికారంలో ఉండగా, ఆ పార్టీతో అంటకాగి ప్రెస్‌అకాడెమీ చైర్మను, ప్రభుత్వ సలహాదారు, ఆర్టీఐ పదవులు పొంది.. అధికారం పోయిన తర్వాత మళ్లీ పాతవృత్తిలోకి వచ్చిన వారిని జర్నలిస్టులంటారా? జనరలిస్టులంటారా? ఒక పార్టీతో బహిరంగంగా అంటకాగి, ఆ పార్టీ ప్రభుత్వం ఇచ్చే పదవులు తీసుకునే వారు పార్టీ నేతలవుతారే తప్ప జర్నలిస్టులెట్లవుతారన్నది పాత్రికేయ సమాజం సందేహం. దీనిని అనుభవజ్ఞుడైన తెలంగాణ ప్రెస్ అకాడమీ చైర్మన్ ఒక్కరే నిర్వంచగలరన్నది వారి నమ్మిక.
అసలైన జర్నలిస్టు ఎవరన్న రేవంత్ ధర్మసందేహం నేపథ్యంలో.. అక్రెడిటేషన్ ముచ్చట వచ్చింది కాబట్టి, కాసేపు దాని గురించి ముచ్చటించుకుందాం. ఇరవై ఏళ్ల క్రితం సమాచారశాఖ కంట్రిబ్యూటర్లకు జిల్లా స్థాయిలో, స్టాఫ్ రిపోర్టర్లు-ఫ్రీలాన్స్ జర్నలిస్టులకు రాష్ట్ర స్థాయి అక్రిడెటేషన్లు ఇచ్చేవి.దానికి మీడియా సంస్థ అధీకృత లేఖ ఉంటే సరిపోయేది. అప్పటివరకూ ఎలాంటి సమస్యలూ లేవు. కంట్రిబ్యూటర్లు, స్టాఫ్ రిపోర్టర్లకు యాడ్ల టార్గెట్లూ లేవు.
కానీ ఎప్పుడైతే జర్నలిస్టు సంఘాలు జిల్లా స్థాయిలో కలెక్టర్లతో మాట్లాడి, యూనియన్ల కోటా కింద సిఫార్సు చేసే సంప్రదాయం ప్రారంభమయిందో, అప్పటినుంచే సమస్యలు ప్రారంభమయ్యాయి. ఈ క్రమంలో యూనియన్ల మధ్య పోటీ పెరిగి, ఎక్కువ అక్రెడిటేషన్లు తీసుకోవడం ప్రతిష్ఠగా మారింది.
అప్పట్లో ఈనాడు మినహా చాలాకాలం క్రితం వరకూ, మీడియా సంస్థలు నేరుగా కంట్రిబ్యూటర్లకూ అక్రెడిటేషన్ లేఖలు ఇచ్చేవి. ఆ తర్వాత కొత్తగా వచ్చిన పత్రికలు- చానెళ్లూ దానిని అమ్మకానికి పెట్టే సంస్కృతి మొదలయింది. నియోజకవర్గానికి ఇంత కడితే కంట్రిబ్యూటర్ కార్డు, జిల్లాకు ఇంత వసూలు చేస్తే జిల్లా అక్రెడిటేషన్ కార్డుల వేలం జర్నలిజం విలువలకు పాతరేసింది. ఆ తర్వాత ఏకంగా జిల్లాలనే వేలం వేసి, ఎవరు ఎంత ఎక్కువ ఇస్తే వారికి జిల్లాలు రాసిచ్చే దుష్ట సంప్రదాయం మొదలయి, ఆ వ్యవస్ధ ఇప్పటికీ విజయవంతంగా నడుస్తోంది.
వేలంలో ఎక్కువ రేటు పెట్టి కొన్న వాడు, దానిని రికవరీ చేసుకునేందుకు నియోజకవర్గాల రిపోర్టర్ల పోస్టులను వేలం వేసే సంస్కృతి కొనసాగుతోంది. ఇక్కడే రౌడీ షీటర్లు, బ్లాక్‌మెయిలర్లు, కులసంఘాల నేతలు రిపోర్టర్ల అవతారమెత్తుతున్నారు. నిజం చెప్పాలంటే ఇప్పటికీ చాలా వరకూ చిన్న, మధ్య తరహా పత్రికలు వీరిపైనే బతుకుతున్నాయి.
ఈ బాపతు పత్రికలు నడిపే యజమానులకు.. హైదరాబాద్‌లో పనిచేసే స్టాఫ్‌రిపోర్టర్లు, డెస్కు వారికి తప్ప మిగిలిన వారెవరికీ జీతాలిచ్చే అవసరం లేదు. డబ్బులు కట్టిన ఫ్రాంచైజర్‌కే వందో, రెండు వందల కాపీలో పంపిస్తారు. వీటికి సొంతంగా ప్రింటింగ్ ప్రెస్సులు కూడా ఉండటం మరో విశేషం.
అంతేనా? వందల కాపీలు ప్రింట్ చేసే ఈ బాపతు పత్రికా యజమానులకు, ప్రభుత్వ భూసేకరణ ప్రకటనలు వరం. సర్క్యులేషన్ ఎంతన్నది పక్కనపెట్టి, ఎవరు ఎక్కువ కమిషన్ ఇస్తే వారికే భూసేకరణ ప్రకటనలిస్తున్న అధికారుల అవినీతితోనే, చాలా పత్రికలు బతికేస్తున్నాయి. అసలు భూసేకరణ ప్రకటనలపైనే బతికే చిన్నా చితకా పత్రికలు వందలకు పైమాటే. దీనికి ఇప్పటికీ అడ్డుకట్ట వేసే దిక్కులేదు.
జర్నలిస్టు కార్డులతో దందాలు చేసుకోవచ్చని కొందరు, అక్రెడిటేషన్ కార్డుంటే ఇళ్ల స్థలాలు, హెల్త్ కార్డులు వస్తాయన్న ఆశతో మరికొందరు, యాజమాన్యాల టార్గెట్ల ఉచ్చులో పడుతున్న విషాదం కొనసాగుతోంది. ఇక ప్రతి ఏటా ముద్రించే క్యాలెండర్లకు యాడ్ల టార్గెట్ల అరిగోస మరో ఛండాలం.
ఈ ‘కార్డుల బలహీనత’ను గ్రహించిన చిన్న-మధ్య తరహా మీడియా యాజమాన్యాలు.. డబ్బులిస్తే చాలు. దావూద్ ఇబ్రహీం లాంటి వాళ్లకూ అక్రెడిటేషన్ సిఫార్సు చేస్తున్న దారుణ పరిస్థితి ఉందన్నది మనం మనుషులం అన్నంత నిజం. తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 60 శాతం శాతం మంది కంట్రిబ్యూటర్లు, 40 శాతం మంది స్టాఫ్‌రిపోర్టర్ల కార్డులతో కేసులున్న రౌడీషీటర్లు, జైళ్లకు వెళ్లివచ్చిన బాపతు, కులసంఘాల నేతలు.. అక్రెడిటేషన్ల కార్డులతో జర్నలిస్టులుగా చలామణి అవుతున్నారన్నది బహిరంగ రహస్యం. మరిని వారిని కూడా జర్నలిస్టులని పిలవాలా? లేదా? అన్నది జర్నలిస్టు వీర విప్లవ సంఘ నేతలే సెలవివ్వాలి.
ఒక్క హైదరాబాద్‌లోనే పెద్ద పత్రికలు-చానెళ్లు, చిన్న, మధ్య తరహా పేపర్లతో పాటు, వాట్సాప్ పత్రికలు, రేవంత్‌రెడ్డి చెప్పిన యూట్యూబ్ చానెళ్లు పుట్టగొడుగుల్లా పుట్టుకువస్తున్నాయి. వీటిలో పనిచేసే కంట్రిబ్యూటర్లకు వేతనాలు ఉండవు కాబట్టి, వారికి వారి పరిథిలో బిల్డింగులు నిర్మించే బిల్డరే ఆదాయవనరు. ఇక లోకల్ పోలీసుస్టేషన్లలో చిన్న చిన్న సెటిల్‌మెంట్లే వీరి జీవనాధారం. వీరిలో ఎక్కువమంది పేదలే మరి.
మీడియాలో ఎడిటర్, బ్యూరో చీఫ్ స్థాయిలో పనిచేసే వారు సైతం.. ఇళ్లు కట్టుకునే సందర్భాల్లో , ఈ తరహా కంట్రిబ్యూటర్ల బెదిరింపులకు గురైన వారేనంటే నోరెళ్లబెట్టక తప్పదు. ఈ మధ్య కాలంలోనే జర్నలిస్టు పేరుతో ఇలాంటి బ్లాక్‌మెయిల్ చేసే వారిపై హైదరాబాద్ పోలీసులు కేసులు, రౌడీషీట్లు ఓపెన్ చేసే విధానం మొదలయింది. ఇది చాలా ఆలస్యంగా మొదలైన ప్రక్రియ.
అసలు హైదరాబాద్‌లో హైడ్రాకు, ఈ తరహా కేసులు కూడా అప్పగిస్తే, జర్నలిస్టుల ముసుగులో చేస్తున్న బ్లాక్‌మెయిలింగు సగం తగ్గిపోతుందన్నది బాధితుల సూచన. భూములు, భవన నిర్మాణాలు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లోనే ఈ దందాలు ఎక్కువ. ఒక్క హైదరాబాద్‌లోనే కాదు. తెలుగు రాష్ట్రాల్లోని చాలా పట్టణాల్లోనూ ఇదే దుస్థితి. మరి వీరినీ జర్నలిస్టులంటారా? జనరలిస్టులంటారా? అన్నది రేవంత్‌రెడ్డి సందేహం కావచ్చు.
ఒకప్పుడు కంట్రిబ్యూటర్లకు యాజమాన్యాలు సెంటీమీటరుకు ఇంత చొప్పున.. లైన్ అకౌంట్ కొలమానంతో గౌరవ వేతనం మాదిరి ఇచ్చేవి. ఇప్పటికీ ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి పెద్ద పత్రికలు, ఈటీవీ, టీవీ9, ఎన్టీవీ, టీవీ5 వంటి పెద్ద చానెళ్లు మాత్రమే.. పట్టణాల్లో కంట్రిబ్యూటర్లకు వారి పనికి తగ్గ పారితోషికం ఇస్తున్నాయి. జిల్లా స్టాఫ్ రిపోర్టర్లకు జీతాలిస్తున్నాయి.
ఇక మిగిలిన పత్రిలు-చానెళ్లలో పనిచేసే జర్నలిస్టులు.. యాడ్స్ తీసుకుని, ఆ కమిషన్లతోనే బతికేస్తున్న విధానం కొన్నేళ్ల నుంచి విజయవంతంగా కొనసాగుతోంది. దానితో సహజంగానే వారు తాము బతుకుతూ, సంస్థను బతికించేందుకు అడ్డదార్లు- బ్లాక్‌మెయిలింగులకూ పాల్పడుతున్నారన్నది నిష్ఠుర నిజం. దీనితో ఫలానా పత్రిక, ఫలానా చానెల్ రిపోర్టర్లకు జీతాలివ్వడం లేదన్న విషయం యాడ్లు ఇచ్చే రాజకీయ నేతలకూ అర్ధమయేందుకు కారణమయింది.
జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోసం పోరాడుతున్నామని ప్రచారం చేసుకునే సంఘాలు.. జిల్లాల్లో పనిచేసే కంట్రిబ్యూటర్లకు కనీసం లైన్ అకౌంట్లను కూడా, మీడియా సంస్థల నుంచి ఎందుకు ఇప్పించలేకపోతున్నాయి? హక్కుల కోసం ప్రభుత్వాలపై పోరాడే యూనియన్లు, మీడియా సంస్థల్లో పనిచేసే వారికి కనీస వేతనాల కోసం ఎందుకు పోరాడవు? నిజానికి ముందు న్యాయం చేయాల్సింది పనిచేసే సంస్థల్లోనే కదా?
విధి నిర్వహణలో చనిపోయిన జర్నలిస్టుల కుటుంబాలకు ప్రెస్ అకాడమీల నుంచో, ప్రభుత్వం నుంచో నష్టపరిహారం కోసం పోరాడే యూనియన్లు.. ఆయా సంస్థల నుంచి పరిహారం ఇప్పించేందుకు యాజమాన్యాలపై ఎందుకు పోరాడవు? డెస్కు, రిపోర్టింగ్‌లో పనిచేసే ఉద్యోగులకు పీఎఫ్ చెల్లించాలని ఎందుకు ఉద్యమించవు? అసలు ఈ వ్యవహారాలతో ప్రభుత్వాలకు ఏం సంబంధం? జర్నలిస్టులకు ఆయా సంస్థలే సాయం చేయాలి తప్ప, ప్రభుత్వాలు ఎందుకు సాయం చేయాలని ప్రశ్నించేవారూ లేకపోలేదు. రేవంత్ మాదిరిగా ఎవరి ప్రశ్న వారికి రైటే మరి.
తోటి జర్నలిస్టుల నుంచి చందాలు సేకరించి, ఆరోజు అంత్యక్రియలు జరిపిస్తున్న ఘటనలు కోకొల్లలు. వీరిలో పేరు గొప్ప పత్రికల్లో పనిచేసే వారూ ఉండటం విషాదం. ఆ సందర్భాల్లో ఓ పూలమాలతో వచ్చి నివాళులర్పించి, దానిని పేపర్లలో వేయించుకునే జర్నలిస్టు నేతల సంఖ్యకూ తక్కువ లేదు. ఆవిధంగా విధి నిర్వహణలో మృతి చెందిన జర్నలిస్టులకు పరిహారం మాట అటుంచి, కనీసం పనిచేసిన ఆ నెల జీతం కూడా ఎగ్గొట్టే సంస్థలకు లెక్కేలేదు.
అందుకే రేవంత్ ప్రశ్న భేతాళుడికంటే పెద్దదని చెప్పింది. మరి ఇప్పుడు ఆ పదానికి నిర్వచనం ఇచ్చేదెవరు? ఫలానా వాడు నిజమైన జర్నలిస్టు అని సర్టిఫై చేసేదెవరు? అసలు జర్నలిస్టులెవరు.. జనరిలిస్టులెవరని తేల్చేదెవరు? యాడ్ల టార్గెట్లు పెట్టి అక్రెడిటేషన్లు సిఫార్సు చేసే యాజమాన్యాలా? వారి లేఖలను అమలుచేసే సమాచార శాఖ అధికారులా? ఫలానా వారికి కార్డులివ్వమని సిఫార్సు చేసే జర్నలిస్టు యూనియన్లా? ప్రెస్ అకాడెమీనా?.. అసలు ఈ ప్రశ్న వేసిన రేవంత్‌రెడ్డి సర్కారు వీటిలో ఏ ప్రాతిపదిక నిజమైన జర్నలిస్టును గుర్తిస్తుంది?
అసలు రేవంత్‌రెడ్డి నిజమైన జర్నలిస్టులు ఎవరన్న ప్రశ్న సభాముఖంగా సంధించకుండా.. వివిధ పార్టీ పాలకుల జమానాలో ప్రెస్ అకాడమీ చైర్మన్లు, సర్కారీ సలహాదారులు, ఆర్టీఐ కమిషనర్లుగా తరంచి.. మళ్లీ జర్నలిస్టుల అవతారమెత్తిన జర్నలిస్టు విప్లవనేతలను అడిగితే సరి.
అన్నట్లు.. రేవంత్ చెప్పిన ఆ ట్యూబు.. ఈ ట్యూబుల పేరుతో మెడలో కార్డులేసుకుని తిరిగే వాళ్లు.. ఈ మధ్య చట్టసభల్లో కూడా కాలుపెట్టారు. వారికి ఆయన పార్టీనే ఎమ్మెల్సీ టికెట్ కూడా ఇచ్చినట్లుంది. అలాంటి వారిని అడిగినా రేవంత్ సందేహానికి సమాధానం దొరుకుతుంది. అసలు గత ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ను బద్నామ్ చేసి, కాంగ్రెస్‌ను గెలిపించింది కూడా ఆ ట్యూబు, యూ ట్యూబు చానెళ్లే…. (ఈ సుదీర్ఘ వ్యాసంలోని ప్రతి వాక్యమూ రచయిత సొంత అభిప్రాయాలే… ముచ్చట అభిప్రాయాలు కానక్కర్లేదు…)
Share this Article