తిండి కలిగితే కండ గలదోయ్… కండ కలిగినవాడే మనిషోయ్…. అని చిన్నప్పుడు చదివాం… ఇప్పుడూ అదే చదివితే, అదే పాటిస్తే కుదరదు… సరైన తిండి లేనివాళ్ల సంఖ్య కోట్లల్లో ఉంది, వాళ్లకు తిండి కావాలనేది కరెక్టే… అందరికీ సరైన తిండి కావాలనేదీ కరెక్టే… కానీ తిండే ప్రధానం అంటే తేడా వస్తుంది ఈ రోజుల్లో…
అసలే ఒబెసిటీ బాధితుల సంఖ్య, మధుమేహుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతున్న రోజులివి… పైగా జిమ్ములు, బాడీ బిల్డింగ్ హడావిడుల సంఖ్య కూడా భారీగా పెరుగుతోంది… అది మంచిదా..? కాదు… కరోనా వచ్చిపోయింది గానీ… అనేకానేక దైహిక అవలక్షణాల్ని మన బాడీలకు అంటగట్టి వెళ్లిపోయింది… ఉఫ్, వెళ్లిపోలేదు, కాకపోతే బలం తగ్గిపోయింది, ప్రాణాపాయాలు తప్పాయి… కానీ..?
వేక్సినే ఎదురుతన్నిందో, మరే కారణమో గానీ… జనం మూడేళ్లపాటు టపటపా గుండెపోట్లతో రాలిపోయారు… మరీ ప్రత్యేకించి జిమ్ములు, ఎక్సర్‌సైజులు చేసేవాళ్లు కుప్పకూలిపోయారు… సరే, ఓ వార్త విషయానికి వద్దాం… పైన చెప్పిన విషయంతో సంబంధం ఉందో లేదో గానీ…
Ads
ఆయన పేరు ఇలియా… ప్రపంచంలోకెల్లా అత్యంత భీకరమైన బాడీ బిల్డర్‌గా పిలవబడ్డాడు ఓ దశలో… 36 ఏళ్ల వయస్సులో గుండెపోటుకు గురయ్యాడు… వెంటనే హాస్పిటల్‌కు హెలికాప్టర్‌లో తరలించారు (ఎయిర్ లిఫ్ట్).., కోమాలో నుంచి బయటికి రాలేదు, పైలోకాలకు వెళ్లిపోయాడు…
చిన్నప్పుడు, అనగా స్కూలింగులో 70 కిలోల వరకూ ఉండేవాడు… అసలు పుషప్స్ కూడా సరిగ్గా తీయగలిగేవాడు కాదు… సిల్వెస్టర్ స్టాలోన్, అర్నాల్డ్ ష్వార్జ్ నెగ్గర్ వంటి బాడీ బిల్డర్లకు కమ్ హాలీవుడ్ హీరోలను చూసి ఇన్‌స్పయిర్ అయ్యాడు… తన బాడీ బిల్డింగ్ మీద శ్రద్ధ పెట్టాడు… నిరంతరం అదే శ్రమ…
పోనీ, ఏదైనా ప్రొఫెషనల్ పోటీల్లో పాల్గొన్నాడా అంటే అదీ లేదు… సోషల్ మీడియాలో ఫోటోలు, వీడియోలు పెట్టుకునేవాడు… ఒళ్లంతా టాటూలు… ఒక దశలో రోజూ 16,500 కేలరీల మేరకు ఫుడ్ తీసుకునేవాడు… ఉదాహరణకు 2.5 కిలోల బీఫ్, 108 ముక్కలు సుశీ ఎట్సెట్రా… (సుశీ అంటే సీ ఫుడ్ ప్లస్ రైస్ రెసిపీ)… రోజుకు ఏడుసార్లు లాగించేవాడు… తినాలి, బాడీ బిల్డింగ్ ఎక్సర్‌సైజులు చేయాలి, ఇదే పని… ఇదే జీవితం…
340 పౌండ్ల దాకా బరువు పెరిగాడు, అంటే 154 కిలోల పైచిలుకు… ఆరు అడుగుల ఒక అంగుళం ఎత్తు… ఛాతీ 61 ఇంచులు… బైసెప్స్ 25 ఇంచులు… భీకరాకారం… చూశారు కదా ఫోటో… జెక్ రిపబ్లిక్‌లో, కొన్నాళ్లు దుబయ్‌లో… మరికొన్నాళ్లు అమెరికాలో బతికాడు… చివరకు ఆ బాహుబలి కన్నుమూశాడు… విపరీతమైన ఆ బాడీ బిల్డింగు వ్యాయామాలే దెబ్బతీశాయని డాక్టర్లు అంటున్నారు… బాడీ దృఢమైంది గానీ గుండె బలహీనపడిందట…. నిజం చెప్పాలంటే… ఓ వయస్సు దాటాక ఎంత బక్కగా ఉంటే అంతగా మంచిది దేహానికి… బీపీ, సుగర్ అదుపులో ఉంటాయి అట..!!
Share this Article