రాఘవేంద్రరావు దర్శకత్వ జైత్రయాత్రలో మరో అడుగు 1977 లో వచ్చిన ఈ అమరదీపం సూపర్ హిట్ సినిమా . కృష్ణంరాజుకు బాగా పేరు తెచ్చిన సినిమా . సినిమా ప్రారంభంలో హాయిహాయిగా తిరిగే స్త్రీలోలుడిగా , నేర నేపధ్యంలో కోటీశ్వరుడుగా , తమ్ముడు దొరికాక అతనిని ప్రేమించే అన్నగా , చెల్లెలిని అభిమానించే గొప్ప అన్నగా , తమ్ముడి భార్య మీద వచ్చిన అపోహలను తొలగించేందుకు తన జీవితాన్నే త్యాగం చేసే అమరజీవిగా కృష్ణంరాజు బాగా నటించారు .
జయసుధ తన కెరీర్ని గ్లామర్ + ఏక్షన్ కేరక్టర్ నటిగా మలచుకునే క్రమంలో వచ్చిన మరో సినిమా ఈ అమరదీపం . ఈ సినిమాలో మనం మెచ్చుకోవలసిన మరో నటి మాధవి . మాధవి కూడా జయసుధ లాగానే పాపులర్ నటిగా నిలదొక్కుకుంటున్న రోజులు అవి . ఈ సినిమాలో జయసుధ , మాధవి కొన్ని సీన్లలో పోటాపోటీగా నటించారు .
ఇతర పాత్రల్లో మురళీమోహన్ , జయమాలిని , సత్యనారాయణ , సాక్షి రంగారావు , మాడా , రమాప్రభ ప్రభృతులు నటించారు . ఈ సినిమాలో మంచి పాత్ర సారధి నటించిన డ్రైవర్ రహీం పాత్ర . నెగటివ్ షేడ్ ఉన్న తన యజమానికి నమ్మినబంటుగా , అభిమానపాత్రుడిగా బాగా నటించారు . గుర్తు ఉండిపోయే పాత్ర .
Ads
ఈ సినిమా విజయానికి ఇతర కారకులు సంగీత దర్శకులు సత్యం , పాటల రచయితలు వేటూరి , ఆరుద్ర , ఆత్రేయ , మాటల రచయిత జంధ్యాల , డాన్స్ మాస్టర్ సలీం . ముఖ్యంగా వేటూరి వ్రాసిన నా జీవన సంధ్యా సమయంలో పాట . రాఘవేంద్రరావు తన దర్శక ప్రతిభను బాగా చూపారు . డ్రమ్ములపై జయసుధ డాన్స్ , ఆమె నాట్య భంగిమలు బాగుంటాయి . ఈ పాట వీర హిట్ అయింది . సినిమాకే హైలైట్ అయింది .
మిగిలిన పాటలు యే రాగమో ఇది యే తాళమో , ఇంతే ఈ జీవితం , అతడే ఆత్మయోగి , కొత్తగా ఉందా బాధగా ఉందా పాటలు కూడా శ్రావ్యంగా ఉంటాయి . సినిమాలో సెట్టింగులను కూడా చాలా రిచ్ గా పెట్టారు .
కృష్ణంరాజుకు ఉత్తమ నటుడిగా నంది అవార్డు , ఫిలిం ఫేర్ అవార్డులు కూడా వచ్చాయి . మా గుంటూరు లిటిల్ కృష్ణా థియేటర్లో డైరెక్టుగా సిల్వర్ జూబిలీ ఆడింది . ఇప్పుడు ఈ థియేటర్ లేదు . జయసుధ ఉన్నది కదా ! రెండు మూడు సార్లు చూసి ఉంటానేమో ! టివిలో కూడా చూసా . ఈ సినిమా రజతోత్సవాలు మద్రాసులో జరిగాయి .అక్కినేని , వాణిశ్రీ , డి వి యస్ రాజు అతిధులు .
మన తెలుగు సినిమాకు మాతృక 1976 లో మళయాళంలో సక్సెస్ అయిన తీక్కనాల్ సినిమా . మధు , శ్రీవిద్య నటించారు . మన తెలుగు సినిమా తర్వాత తమిళంలో దీపం అనే టైటిల్ తో తీసారు . శివాజీ గణేశన్ , సుజాత , సంగీత , విజయకుమార్ నటించారు . ఈ సినిమాను బాలాజీ నిర్మించారు . ఆయనే తర్వాత కాలంలో రాజేష్ ఖన్నా , వినోద్ మెహ్రా , షబానా ఆజ్మీ , దీపలతో హిందీలో నిర్మించారు . అన్ని భాషల్లోనూ విజయవంతం అయింది . మహిళలు మెచ్చిన కధ .
సినిమా యూట్యూబులో ఉంది . చూడనివారు ఉంటే తప్పక చూడతగ్గ మంచి సినిమా . పాటల వీడియోలు కూడా ఉన్నాయి . నా జీవన సంధ్యా సమయంలో వీడియోని మిస్ కాకండి . An emotion-filled , sentimental entertainer . #తెలుగుసినిమాలసింహావలోకనం #తెలుగుసినిమాలు (దోగిపర్తి సుబ్రహ్మణ్యం) అప్పట్లో పత్రికలు ఇలాంటి సూపర్ హిట్ సినిమాల రజతోత్సవాలు, శతదినోత్సవాలకు ప్రత్యేక వాణిజ్య అనుబంధాల్ని వేసేవి… ఈ ఫోటో అదే…
Share this Article