పోర్ట్ బ్లెయిర్ టూ శ్రీ విజయపురం! పేర్లు, వాటి మార్పు.. వెనుక కథేంటి..?
అండమాన్, నికోబార్ దీవుల రాజధాని పోర్ట్ బ్లెయిర్ ఇప్పుడు శ్రీ విజయ పురం. పేర్లు మార్చే ఆనవాయితీని ఓ అలవాటుగా మార్చుకున్న బీజేపీ నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వం.. బ్రిటీష్ కలోనియల్ శకం ఆనవాళ్లను ఇంకా దేశంలో ఉంచడానికి ఏ మాత్రం సంకోచించడం లేదు. ఇదే విషయాన్ని నిన్న శుక్రవారం హోం మంత్రి అమిత్ షా తన X ఖాతాలో షేర్ చేశారు. దేశాన్ని వలసవాద ముద్రల నుండి విముక్తి చేయడానికి ప్రధానమంత్రి నరేంద్రమోడీ దార్శనికతను కొనియాడుతూ.. ఆయన స్ఫూర్తి నుంచే ఈ నిర్ణయమన్నట్టుగా అమిత్ షా ట్వీట్ కనిపించింది.
Ads
వలస వారసత్వానికి చెక్ పెట్టే క్రమంలో పోర్ట్ బ్లెయిర్ పేరు మార్పు!
అమిత్ షా ఏమంటారంటే.. మన స్వాతంత్ర్య పోరాటంలో సాధించిన విజయానికి అండమాన్ నికోబార్ దీవులు సాక్షీభూతంగా నిల్చాయి. నేతాజీ సుభాష్ చంద్రబోస్ ద్వారా మన తిరంగా మొట్టమొదట ఆవిష్కరించిన ప్రదేశం. వీర్ సావర్కర్ వంటి స్వాతంత్ర్య సమరయోధులు అండమాన్ జైల్లోనే త్యాగాలతో కూడిన తమ కాలాన్ని గడిపారు. ఒకప్పుడు చోళ సామ్రాజ్యానికి నావికా స్థావరం. ఈ రోజు మన దేశ వ్యూహాత్మక, అభివృద్ధి ఆకాంక్షలకు కీలకమైన ద్వీపం. అందుకే ఇంత ప్రత్యేక పాత్ర పోషిస్తున్న అండమాన్ రాజధాని పోర్ట్ బ్లెయిర్ పేరును శ్రీ విజయపురంగా మారుస్తున్నాం.
18వ శతాబ్దానికి చెందిన బ్రిటీష్ నావికాదళ అధికారైన లెఫ్టినెంట్ ఆర్చిబాల్డ్ బ్లెయిర్ పేరుతో తన ఉనికి చాటుకుంటున్న ఈ నగరం.. ఇప్పుడు ఆ పోర్ట్ బ్లెయిర్ నుంచి శ్రీ విజయపురం పేరుతో.. భారత స్వాతంత్ర్య పోరాటంలో అండమాన్ రాజధాని పాత్రకు ప్రతీకలా నిలుస్తుందన్నది షా చెప్పిన మాట,
పోర్ట్ బ్లెయిర్ కు ఆ పేరెలా వచ్చింది.. ఆ బ్లెయిర్ ఎవరు..?
18వ శతాబ్దం ప్రారంభంలో రాయల్ నేవీలో పనిచేసిన బ్రిటీష్ నౌకాదళ లెఫ్టినెంట్ అధికారి పేరు.. ఆర్చిబాల్డ్ బ్లెయిర్. ఆయన పేరునే.. ఫిష్ హార్బర్ గా ఉన్న నగరానికి పెట్టారు.
బ్లెయిర్ కెరీర్ పరంగా చూస్తే.. బ్రిటీష్ వలసవాదుల నాటి సామ్రాజ్యకాంక్షలో భాగంగా అండమాన్ లో కీలకంగా వ్యవహరించిన నేవీ అధికారి. బ్రిటీష్ వలసవాదుల సామ్రాజ్య విస్తరణలో వ్యూహాత్మకమైన ఈ మారుమూల ప్రాంతంలో.. బ్లెయిర్ చేసిన సేవలకుగాను ఈ నగరానికి పోర్ట్ బ్లెయిర్ అని నామకరణం చేశారు. 1789లోనే నాటి బెంగాల్ ప్రభుత్వం చాతల్ ఐల్యాండ్ ఆగ్నేయ తీరంలోని పీనల్ కాలనీకి బ్లెయిర్ పేరు పెట్టింది.
అండమాన్ మరియు నికోబార్ దీవులను అన్వేషణ, అభివృద్ధి విషయంలో బ్లెయిర్ భాగస్వామ్యం కీలకంగా మారింది. ఇక్కడ పాలనను ప్రారంభించడంతో పాటు.. బ్రిటీష్ వలసవాదులకు పోర్ట్ బ్లెయిర్ ను ఓ హబ్ లా మార్చాడు. క్షేత్రస్థాయి సందర్శనలు చేశాడు. ఈ ద్వీపం.. మిగిలిన ప్రాంతాలపై బ్రిటీష్ పాలకులు పట్టు సాధించేందుకు ఏవిధంగా ఉపయోగపడుతుందో కనిపెట్టి మ్యాప్స్ ద్వారా కళ్లకు కట్టినట్టు చూపించి పోర్ట్ బ్లెయిర్ ద్వీప భూభాగం ఎంత అవసరమో చెప్పగల్గాడు.
అలా ఆయన జ్ఞాపకార్థం అండమాన్, నికోబార్ రాజధాని నగరానికి పోర్ట్ బ్లెయిర్ అనే నామకరణం చేయగా.. బ్రిటీష్ పాలకుల రాజ్య విస్తరణకు ఇది నిజంగా ఎంతో ఉపయోగపడింది. తూర్పు బంగాళాఖాతంలో ఉన్న ఈ దీవి నుంచి సైనిక, వ్యాపార, వాణిజ్య కార్యకలాపాలకు ఓ కేంద్ర బిందువుగా మారింది. అంతేకాదు, పక్కనున్న ద్వీపాల ఆక్రమణలోనూ, వాటి సంరక్షణలోనూ కీలకమైన కేంద్రంగా పోర్ట్ బ్లెయిర్ మారింది. అయితే, నాటి బ్లెయిర్ పర్యవేక్షణలోనే ఇక్కడి ఓడరేవు అభివృద్ధి జరిగింది.
బ్లెయిర్ జీవితం గురించి మరింత సవివరమైన రికార్డులేమీ లేకపోయినప్పటికీ… అండమాన్, నికోబార్ దీవులపై మాత్రం ఓ లెఫ్టినెంట్ అధికారిగా తాను చేయాల్సిన దానికంటే ఎక్కువ చేసి.. తన మార్కును చూపించాడు బ్లెయిర్. ఆ ఫలితమే ఇప్పుడు బీజేపి శ్రీవిజయపురంగా మార్చిన పోర్ట్ బ్లెయిర్ పట్టణానికి ఆ పేరు స్థిరపడటానికి ప్రధాన కారణమైంది.
అలా బ్లెయిర్ సాధించిన విజయాలతో నాటి బ్రిటీష్ పాలకులు అండమాన్ రాజధానికి పోర్ట్ బ్లెయిర్ అని నామకరణం చేస్తే… భారత స్వాతంత్ర్య సమరంలో అండమాన్ వేదికగా సాగిన పోరాటాల చరిత్ర, స్వాతంత్ర్య సాధనకు ప్రతీకలా మారిన నాటి ఘటనల ఆధారంగా నేటి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం శ్రీవిజయపురమనే పేరు మార్చి.. ఇప్పుడు నాటి పోర్ట్ బ్లెయిర్ ను.. నేటి శ్రీవిజయపురాన్ని చర్చల్లో పెట్టింది…… రమణ కొంటికర్ల
Share this Article