ఏమైంది, ఏమీ కాలేదు… నిక్షేపంలా ఉంది, బంగారంలా ఉంది, అత్యద్భుతమైన అతి గొప్పాతిగొప్ప ప్రాజెక్టు… ప్రపంచ ఎనిమిదో వింత… జస్ట్, ఒక పిల్లర్ కుంగింది, మరో పిల్లర్ కాస్త ఫ్రాక్చరయింది, అంతే… ఈమాత్రం దానికి ఇంత ఏడవాలా రేవంత్ రెడ్డి..?
అసలు కాళేశ్వరం లేకుండా యాసింగిలో నీళ్లిస్తవా, ఇచ్చి చూడు, మేమూ చూస్తాం… మాట్లాడితే లక్ష కోట్ల అవినీతి అంటవ్, కేసీయార్ తినేశాడు అంటవ్, మళ్లీ మళ్లీ అదే కూస్తే మర్యాద దక్కదు సుమా…….. దాదాపు ఇలాగే సుదీర్ఘంగా వివరిస్తూ, ఆడిపోసుకుంటూ, ఏవేవో వివరణలు ఇచ్చుకుంటూ రెండు ఫుల్ పేజీలను కుమ్మేసింది నమస్తే తెలంగాణ…
అరె, హఠాత్తుగా మళ్లీ ఏమైంది..? ఈ హడావుడి ఏమిటబ్బా అని చూస్తే… ఏమీలేదు, విచారణ కమిషన్ చాలా సీరియస్‌గా, చాలా లోతుగా తవ్వుతూనే ఉంది… ఇదేదో మైండ్ గేమ్… అబ్బే, ఏమీ కాలేదు అని మాయ చేయడానికి, జనం కళ్లకు గంతలు కట్టడానికి, అంతే…
Ads
విచిత్రం ఏమిటంటే… నమస్తే తెలంగాణ ఇలా నానా నానా ప్రయాస పడుతూ ఉంటే… ఈనాడు ఫస్ట్ పేజీలోనే ఓ బైలైన్ స్టోరీ వేసింది… ఏమిటయ్యా అంటే..? కాళేశ్వరం నిర్మాణ సమయంలో అధికారులు, కంట్రాక్టర్లు ఎలా కుమ్మక్కయ్యారు, నాణ్యత పరీక్షలకు ఎలా తిలోదకాలు వదిలారు, మాయ రిపోర్టులు ఎలా ప్రిపేర్ చేశారు, ఫేక్ ధ్రువీకరణలకు ఎలా పాల్పడ్డారో విజిలెన్స్ వాళ్లు నిగ్గుతేల్చారట… విచారణ కమిషన్‌కు సవివరంగా సమర్పించారట…
సరే, ఎలాగూ ప్రభుత్వానికి కూడా ఓ రిపోర్టు ఇస్తారు కదా… ఇస్తూనే సదరు ఇంజనీర్లపై క్రిమినల్ చర్యలు తీసుకోబోతున్నారనేది వార్త… (కేసీయార్‌ను నిజంగానే ఎక్కడైనా పర్‌ఫెక్ట్‌గా బుక్ చేయాలనే తాపత్రయమో, దూకుడో రేవంత్‌లో కనిపించడం లేదు… ఏవో వార్తల్లో రాసుకోవడమే ఇలా…) నిజాలు ఇలా ఉంటే, మరోవైపు నమస్తే తెలంగాణ అనబడే కేసీయార్ మైక్ ‘ఏమీ లేదహో, అంతా బాగుందహో’ అని డీజే సౌండ్‌తో మోతమోగిస్తోంది…
పంపుహౌజులన్నీ నిక్షేపం అంటారు… గతంలో ఓ పంపు హౌజ్ మునిగిపోయింది మాత్రం గుర్తుచేయరు… ఎల్లంపల్లి నుంచి నీళ్లు పట్టుకొస్తే, అదంతా కాళేశ్వరం మహత్తే అంటారు… మరి అన్నారం, మేడిగడ్డ బరాజులు ఏమాత్రం దృఢంగా లేవనీ, ఎప్పటికైనా ప్రమాదమే అని ఢిల్లీ ఇంజినీర్లు వచ్చి ఏదో రిపోర్టు కూడా ఇచ్చారట కదా, అది అస్సలు ఊసెత్తరు… పోనీ, నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఏమంటోంది..? అదైనా రాయొచ్చు కదా…
ఎందుకో గానీ, ఏం జరిగిందో గానీ ఆంధ్రజ్యోతి కాళేశ్వరం ఫాలోఅప్ పూర్తిగా వదిలేసింది… ఆర్కే గారూ, ఎనీ రాగద్వేషమ్స్… సరే, సాక్షి ఎలాగూ మరో నమస్తే తెలంగాణాయే కాబట్టి.., కాదు, అంతకు ఎక్కువే కాబట్టి.., అదెలాగూ రాయదు… మరి కాంగ్రెస్ వెలుగులకు, వివేకుడి వెలుతురులకు ఏమైందో… ప్చ్…!! అవునూ, ఈ విచారణలకు హరీష్, కేసీయార్‌లను కూడా పిలిచే వీలుందా..?! సీఎం రేవంత్ రెడ్డి సార్, కేసీయార్ తన సొంత పత్రికలో సీదా సవాల్ అంటున్నాడు, జవాబ్ దో అంటున్నాడు… ఇంకా చదివావో లేదో గానీ..!! జవాబు క్రిమినల్ చర్యలతోనేనా..!! నమస్తే ఇందిరమ్మా అని ఓ పేపర్ పెడితే బెటరేమో..!!
Share this Article