మునుగోడు ఎమ్మెల్యే శ్రీమాన్ కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి సాబ్… ఏమిటి మీరు చేస్తున్న పని..?
సరే, ఓ మందు షాపుల వద్దకు వెళ్లారు… ఈ మందు షాపుల ఆకస్మిక తనిఖీలు ఏమిటి..? ఎవరైనా ఆఫీసులో, స్కూళ్లో, హాస్టళ్లో, ఇంకా ఏవైనా ప్రజావసరాల సంబంధిత వ్యవస్థలో తనిఖీలు చేస్తారు… మంచీచెడూ కనుక్కుంటారు… కానీ తమరేమిటి ఇలా మందు షాపులు బాగా నడుస్తున్నాయా లేదాని తనిఖీలు చేస్తున్నారు..?
సరే, చేశారు… ప్రభుత్వ ఖజానాకు ఆదాయం ముఖ్యం కాబట్టి, తమ పరిధుల్లోని మద్యం దుకాణాలను ఇలాగే ప్రతి ఎమ్మెల్యే సందర్శించి, తనిఖీలు చేసి, అవి సజావుగా నడిచేలా చూడాలి… మీరు స్పూర్తి… నకిలీ మద్యం అమ్ముతున్నారా అని పరిశీలించారు, గుడ్, ఖజానాకు మహారాజపోషకులైన మందుబాబుల ఆరోగ్యం బాగుంటేనే కదా వ్యవస్థలు బాగుండేది…
Ads
వాడు బాగుంటేనే కదా, ఖజానా నిండేది… ఉద్యోగులకు జీతభత్యాలు సక్రమంగా వచ్చేది… వ్యవస్థలు నడిచేది… సో, వాడు బాగుండాలి, ఉండాలంటే కల్తీ మద్యం రావద్దు… ఇవన్నీ నిజమే గానీ… బెల్టు షాపుల బెడద గురించి అడగడం ఏమిటి..? అవి నడిస్తేనే కదా, జనం నాలుగు సీసాలు ఎక్కువ తాగేది..? ఖజానాకు నాలుగు రాళ్లు ఎక్కువ జమయ్యేది..?
పాపం, పొద్దుగాల పొద్దుగాల తమ డ్యూటీ నిర్వర్తించడానికి వచ్చిన త్యాగజీవులను మందలించడం ఏమిటి అసలు..? అలా నిరుత్సాహపరిస్తే జనం ఎంత షాక్‌కు గురవుతారు..? ఎక్సయిజు, జీఎస్టీ గట్రా ఖజానాకు ధారబోయడానికి తగిన ఉత్సాహం, జోష్, కిక్కు ఎలా వస్తాయి..?
అసలే పేద కుటుంబాలు, పూట గడవడం ఎలా..? పెళ్లాంపిల్లలు ఏమైపోవాలి అని దబాయించి గట్టిగా నిలదీస్తే పాపం వాళ్ల మనసులు చిన్నబుచ్చుకోవా..? ఎర్లీ మార్నింగు డ్యూటీకి వచ్చినా సరే తిట్లు తినాల్సిందేనా..?
పొద్దుగాల పర్మిట్ రూమ్స్ తెరిస్తే బాగుండదు అని ఆదేశిస్తే ఎలా సార్..? అంతంత డబ్బులు పోసి పెట్టుకున్న మందు దుకాణాలు… బొచ్చెడు డబ్బు కడుతున్నారు ప్రభుత్వానికి… ప్రభుత్వమే పర్మిట్ రూమ్స్ ‘పనివేళలు’ ఖరారు చేసింది… మరి పొద్దుగాల మూసేయాల్సిందే అంటే ఎలా..? సాయంత్రం మాత్రమే పర్మిట్ రూమ్స్ తెరుస్తాము అంటే మందుబాబులకు ఎంత అవమానం..? ఎంత నామర్దా..?
పొద్దునపూట పర్మిట్ రూమ్స్ తెరవకుండా ఓ పాలసీ తీసుకురావాలి సార్… రేవంత్ రెడ్డితో సీరియస్‌గా డిస్కస్ చేయొచ్చుగా ఓసారి… ఓన్లీ ఈవెనింగ్ పర్మిట్, నో మార్నింగ్ పర్మిట్ అని తేల్చిపారేస్తే సరి… ఈసారి వైన్స్ దందాలో ఎంతమంది మిగులుతారో చూద్దాం… ఏమంటారు సార్..? సారూ, జెర పైలం… మందుబాబులతో పెట్టుకుని అంత జగనుడే కళ్లు తేలవేశాడు మరి…!!
Share this Article