బాగా పరపతి గల్గిన ఓ స్పోర్ట్స్ కోచ్… పోలీస్ ఉన్నతాధికారుల పరిచయాలు… హై ఫై లైఫ్ స్టైల్… ఇదంతా ఒకెత్తైతే… ఉన్నపళంగా ఇద్దరు పిల్లల అత్యాచారం, హత్య, సజీవదహనం వంటి ఆరోపణలతో ఆ కోచ్ అరెస్ట్… ఇదిగో ఇలా మొదలై.. ఓ క్రైమ్ లీగల్ సైకలాజికల్ థ్రిల్లర్ ను వీక్షకులకందించాలన్న ఓ ప్రయత్నమే ZEE 5 ఓటీటిలో విడుదలైన NAIL POLISH… WILLIAM DEIHLS రచనలో వచ్చిన నవల… ఆ తర్వాత అదే పేరుతో 1996లో హాలీవుడ్ లో తెరకెక్కిన సినిమా PRIMAL FEAR తో పాటు… 1960లో ఆల్ ప్రెడ్ హిచ్ కాక్ దర్శకత్వంలో వచ్చిన PSYCHO సినిమాల తరహా మూవీగా కూడా ఇప్పుడీ సినిమాను విశ్లేషకులు వర్ణిస్తున్న పరిస్థితి. అయితే ఈ సినిమాలో వీర్ సింగ్ అలియాస్ చారురైనా పాత్రలో మానవ్ కౌల్ నటన అద్భుతం. శంకర్ దర్శకత్వంలో వచ్చిన అపరిచితుడు తరహాలో… ఒక క్యారెక్టర్ ఇంకో క్యారెక్టర్ లోకి పరకాయ ప్రవేశం చేసి.. ప్రేక్షకులను ఆద్యంతం రక్తి కట్టించడమంటే ఎంతో శ్రద్ధ పెడితేనేగానీ కుదరని పని. కానీ, వీర్ సింగ్ పాత్రకూ… జైల్లో సైకో పాత్రకు… ఆ తర్వాత డిసోసియేటివ్ ఐడెంటిటీ డిజార్డర్ తో బాధపడుతూ గతంలో తాను ప్రేమించిన చారు సిన్హా పాత్రల్లో ఒదిగిపోయి ఒక పాత్ర ప్రభావం ఇంకో పాత్రపై ఏమాత్రం కనిపించకుండా నటించిన మానవ్ కౌల్ ఈ సినిమాకు ఓ ఎస్సెట్.
అయితే డైరెక్టర్ బగ్స్ భార్గవ కృష్ణ భిన్నమైన ఆలోచనల సమ్మేళనంగా ఈ క్రైమ్ లీగల్ సైకలాజికల్ థ్రిల్లరైన NEIL POLISHను చూడాల్సి ఉంటుంది. ఇందులో మానవ్ కౌల్ తో పాటు… సిద్ధార్థ్ జైసింగ్ (సిధ్ జైసింగ్) గా నటించిన అర్జున్ రాంపాల్ పెర్ ఫార్మెన్స్ కూడా వ్యూయర్స్ ను అట్రాక్ట్ చేస్తుంది. పబ్లిక్ ప్రాసిక్యూటర్ అమిత్ గా నటించిన ఆనంద్ తివారీ, కేసు వాదోపవాదాల సమయంలో బ్యాలెన్స్ డ్ గా వ్యవహరించే జడ్జ్ భూషణ్ పాత్రలో రజిత్ కపూర్.. మళ్లీ ఎన్నాళ్ల తర్వాతో ఓవైపు మందుకు బానిసై… ఇంకోవైపు జడ్జైన భర్త భూషణ్ పై ప్రేమను చంపుకోలేక.. వృత్తిగత జీవితంలోని సవాళ్లకు దీటుగా భూషణ్ వ్యక్తిగత జీవితంలోనూ ఓ మానసిక సంఘర్షణకు కారణమయ్యే శోభ పాత్రలో తెరపైకొచ్చిన డ్రంక్ మధుబాల… ఇలా క్యారెక్టర్స్ తక్కువే అయినా.. వీరంతా సినిమాలో ఒదిగిపోయేందుకు చేసిన యత్నం మాత్రం తాననుకున్న శైలిలో తెరకెక్కించే యత్నం చేశాడు బగ్స్ భార్గవ.
Ads
ఇక కథ విషయానికొస్తే… స్పోర్ట్స్ కోచైన వీర్ సింగ్ ఇద్దరు పిల్లలతో పాటు… అంతకుముందు కూడా ఎందరినో అత్యాచారం, హత్య చేశాడన్న అనుమానిత నిందితుడిగా అరెస్టవ్వడం.. వీర్ సింగ్ కేసును సిధ్ జైసింగ్ టేకప్ చేయడం.. పబ్లిక్ ప్రాసిక్యూటర్ అమిత్, జైసిధ్ ల మధ్య కోర్టులో జరిగే వాదనలు.. ఆ కోర్ట్ విచారణ కాలంలోనే జైలులో అక్కడుండే ఖైదీలతో ఎదురయ్యే సవాళ్ల.. ఒకానొక రోజు సైకోగా మారి ఏకంగా తననిబ్బంది పెడుతున్న వ్యక్తిపై వీర్ అటాక్ చేయడం… ఆ క్రమంలో ఇతర ఖైదీలంతా కలిసి వీర్ పై మూకుమ్మడి దాడి.. ఆ దెబ్బకు ఆసుపత్రి పాలైన వీర్ సింగ్… ఉన్నపళంగా డిసోసియేటివ్ ఐడెంటిటీ డిజార్డర్ అనే వ్యాధికి గురై… గతంలో తాను ప్రేమించిన అమ్మాయి చారు సిన్హాగా మారిపోయే పరిస్థితులు అసలు సినిమాను డిఫరెంట్ మూడ్స్ లోకి తీసుకెళ్లేందుకు దర్శకుడి యత్నంలో భాగంగా కనిపిస్తాయి. మొతమ్మీద పిల్లలను చంపి సజీవదహనమయ్యే సిచ్యుయేషన్ డిమాండ్ చేసే లాంగ్ షాట్ సీన్స్ ఒకటీ అరా మినహా… ఎక్కడా హింసను ప్రేరేపించే సీన్లేమీ లేకుండానే.. ఒక ఉత్కంఠను కల్గించేలా.. కోర్టులో జరిగే వాదోపవాదాలను.. సైకాలజికల్ డిజార్డర్ తో జరిగే మార్పులను పట్టిచూపించేందుకు క్యాన్వాస్ కెక్కిన చిత్రమే NAIL POLISH….. By….. రమణ కొంటికర్ల
Share this Article