రష్యా అధినేత పుతిన్ వార్త చదవగానే కాస్త నవ్వొచ్చినా… ఆలోచనాత్మకమే..! ‘ఎంతగా తీరిక లేని కొలువులు చేస్తున్నా సరే, లంచ్ బ్రేకుల్లో, టీ బ్రేకుల్లో శృంగారానికి కూడా కాస్త వీలు చూసుకొండి, పిల్లల్ని కనండి’ అని పిలుపునిచ్చాడు తను రీసెంటుగా…
శృంగారానికి తీరిక లేకపోవడం కాదు, పిల్లల్ని కనడం మీద ఆసక్తి లేదు జనానికి… పెళ్లిళ్లు, సంసారం, బాధ్యతల జంఝాటం మీద వైరాగ్యం, అనాసక్తత… లక్షల మంది దేశం విడిచివెళ్లిపోతున్నారు, జననాల రేటు మరీ 1.5కు పడిపోయింది… నిజానికి అది రష్యా సమస్యే కాదు, జపాన్, చైనా వంటి దేశాల్లో చాన్నాళ్లుగా చూస్తున్నదే…
నిన్న సాక్షిలో ఓ పెద్ద వార్త… మన దేశంలో విడాకుల రేట్లు విపరీతంగా పెరుగుతున్నాయి… మెట్రో నగరాల్లో మరీ ఎక్కువ… కేరళలో గత పదేళ్లలో 350 శాతం వృద్ధి… పంజాబ్, హర్యానా, మహారాష్ట్ర వంటి ధనిక రాష్ట్రాల్లోనూ అంతే… మరీ ఒకటీరెండు సంవత్సరాల్లోనే విడాకుల కేసులు పడుతున్నయ్… ఎటొచ్చీ ఈ తాకిడికి తగినట్టు సెటిల్ చేయలేక కోర్టులే వెనకబడిపోతున్నాయి… లక్షల కేసులు పెండింగ్… మోడీ ప్రభుత్వం ఏదో ఒకటి సీరియస్ ఆలోచన చేయాలేమో…
Ads
మహిళల్లో ఆర్థిక స్వాతంత్ర్యం పెరగడం ఒక్కటే కాదు… అనేక కారణాలు ప్రత్యేకించి మహిళల్ని విడాకుల వైపు నెట్టేస్తున్నాయి… అనేకచోట్ల 28-30 ఏళ్లు కనీస వివాహ వయస్సు అయిపోయింది… అంత త్వరగా పెళ్లిబంధంలో ఇరుక్కుపోవడానికి ఇష్టపడటం లేదు ఎవ్వరూ… రాజీపడుతూ కొనసాగడమూ ఇష్టం లేదు లక్షల మందికి… గతంలో విడాకులు ఓ మైనస్ పాయింట్, ఇప్పుడు జస్ట్, కాజువల్… పడలేదు, విడిపోయాం, అంతే… అబ్బాయిల ఆలోచనారీతులు కూడా ఇలాగే ఉంటున్నాయి…
పెళ్లి, పిల్లలు, సంసారాన్ని గుదిబండలుగా భావించడానికి జీవనవ్యయం విపరీతంగా పెరిగిపోవడం కూడా ఓ కారణమే… సగటు వేతనాల శాతం ఎంత పెరిగినా సరే చాలామంది ఒంటరి జీవనమే బెటర్ అనుకోవడానికి ఇంకా అనేక కారణాలూ ఉండొచ్చు… అధికారికంగా విడాకులకు జాప్యం జరుగుతున్నా సరే, విడిపోయి లక్షల మంది ఒంటరి జీవనం గడుపుతున్నారు… ప్రస్తుతం లైంగిక సంబంధాల్లో గతంలో ఉన్నట్టుగా ‘అక్రమం’ అనే మాట ఎక్కువగా వినిపించడం లేదు…
మొన్నమొన్నటిదాకా ఉమ్మడి కుటుంబం కనుమరుగు అనేది వార్త, చర్చ, ఆందోళన… న్యూక్లియర్ ఫ్యామిలీల మీద అధ్యయనాలు… ఇప్పుడు అసలు కుటుంబం, వైవాహిక వ్యవస్థ తీరు మీదే ప్రధాన చర్చ… ఒంటరి జీవనాల గురించి మాట్లాడుకుంటున్నాం… ఇంకా రాబోయే రోజుల్లో…?
పెళ్లి వద్దు, పిల్లలు వద్దు, పిల్లలు ఓ జంఝాటం, ఓ బాధ్యత… సంసారం ఓ బందిఖానా అనే ధోరణి ఇంకా పెరుగుతుంది… ఆసక్తి ఉన్నా సరే ఆరోగ్య సమస్యలతోనూ జననాల రేటు పడిపోతోంది… ఇక తరువాత ఏమవుతుంది..? జనాభా పెరుగుదల మందగిస్తుంది… కొత్త తరాల జనాభా పడిపోతుంది… ఎలాగూ సగటు ఆయుప్రమాణాలు పెరిగాయి కాబట్టి ముసలోళ్లు ఎక్కువై, పిల్లలు తక్కువై… సృష్టి క్రమం తప్పుతుంది… అప్పుడేమవుతుంది..? ఈమధ్య అవీ చదువుకున్నాం కదా…
జపాన్‌లో అనామక మరణాల సంఖ్య విపరీతంగా పెరిగిపోతోందని… వృద్ధాప్యంలో కూడా ఒంటరి బతుకులు… చివరకు అలా మరణిస్తే కొన్నిరోజులపాటు బయటకు వెల్లడికాని మరణాలు కూడా… జననాలు తగ్గే ప్రతి దేశం ఈ స్థితిని చూడబోతోంది… చివరకు మనిషిని ఇంకా ‘ఒంటరితనం’ కమ్మేసి, ఏ బంధాలూ లేకుండా… పుట్టాం, బతికాం, పోయాం అనే ఓ కాజువల్ జీవనంలోకి జారిపోతాడేమో..!!
Share this Article