ఓ పబ్లిక్ ఈవెంట్ లో తన మనసులో మాట బయటపెట్టడంతో పాటు… కార్ల తయారీదారులపై చురకలంటించారు కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రి నితిన్ గడ్కరీ. ఆయన ఆ మంత్రిత్వ బాధ్యతలు చేపట్టాక హైవేలపై సీరియస్ గా ఫోకస్ చేశారు. ఇవాళ తెలంగాణా, ఆంధ్రప్రదేశ్ ల్లో హైవేల రూపకల్పనలో కూడా ఆయన చొరవ చెప్పుకోవాల్సిందే. నాటి వాజ్ పాయ్ హయాంలో స్వర్ణ చతుర్భుజిని తలపించే విధంగా.. ఇప్పుడు కొన్ని చోట్ల హైవేస్ ను విదేశాలను మరిపించేలా తీర్చిదిద్దారు.
అయితే, ఆయనకున్న కంప్లైంటల్లా.. రోడ్ల కన్నా కూడా.. భారతీయ రోడ్లకనుగుణంగా కార్ల డిజైన్ చేయకపోవడమే. అందుకే రెండు రోజుల క్రితం ఓ సభలో ఆయన తన మనసులో మాటల్ని బయటపెట్టారు. తాను భారత్ కే చెందిన ఓ ప్రధాన కార్ల తయారీ కంపెనీ ఓనర్ కు ఓ సలహా ఇచ్చారట. అదేంటంటే.. మీ కారుతో పాటు అమృతాంజన్ బామ్ కూడా ఇవ్వండని. అయితే, ఆ కార్ల తయారీదారైన ఆ యజమాని పేరు మాత్రం ఆయన చెప్పడానికి ఇష్టపడలేదు.
అది ఆ ఒక్క ప్రధాన తయారీదారుకే కాదు… అందరికీ వర్తించే చురక. అవునూ.. తాను అగ్రశ్రేణి వాహన తయారీదారులెందరినో తిట్టానని ఆయన బాహటంగానే కుండబద్ధలు కొట్టారు. వాహనాల ఖర్చును తగ్గించి అందరికీ అందుబాటులోకి తీసుకురావాలనే యోచనొక్కటే సరిపోదని.. నాణ్యత కూడా ముఖ్యమని వారికి చెప్పినట్టు ఆ సభ సాక్షిగా కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రి హోదాలో భారత్ లో కార్ల తీరుపై ఆయన సెటైర్స్ వేశారు.
Ads
అదే సమయంలో భారతీయ ఆటోమోబైల్ రంగం సాధించిన గణనీయమైన అభివృద్ధిని కూడా ఆయన కొనియాడారు. విదేశీ కంపెనీల మార్కెట్ వాటాను తగ్గించి… భారతీయ కంపెనీల వాటాను ఐదు నుంచి ఏడు శాతం పెంచినందుకు ఆయా ఉత్పత్తిదారులను ఆయన ప్రశసించారు.
అలా ప్రశంసిస్తూనే.. ఉత్పత్తిదారులు కేవలం మార్కెట్ లాభాల కోసం.. పెద్దఎత్తున ఉత్పత్తి కోసం.. కొత్త కొత్త డిజైన్స్ కోసం మాత్రమే కాకుండా.. భారతీయ రోడ్లు.. వాటికనుగుణమైన తయారీ విధానాలు.. నాణ్యతపై దృష్టి సారించాలంటూ ఒకింత వ్యంగ్యాన్నీ జోడించారు.
రానున్న ఐదేళ్లల్లో భారత్ ఆటోమోబైల్ రంగాన్ని ప్రపంచంలోనే నంబర్ వన్ స్థాయికి తీసుకెళ్లాన్నది తమ యోచన అన్నారు. అందుకు ఆటోమోబైల్ కంపెనీల సహకారం అవసరమని.. అందుకు నాణ్యత, పర్యావరణ పరిరక్షణ వంటివాటిని దృష్టిలో పెట్టుకోవాలన్నది గడ్కరీ ప్రశంసలోని ఓ చురకలాంటి సూచన.
నొప్పింపిక తానొవ్వక చురకలంటించడంలో.. సునిశితమైన పదాలతో ప్రసంగాన్ని ఆకట్టుకునేలా చేయడంలో.. చర్చకు పెట్టడంలో గడ్కరీ దిట్ట అనేది ఆయన యూట్యూబ్ ను ఫాలో అయ్యేవారందరికీ తెలిసిందే!
అయితే, కొసమెరుపేంటంటే.. ఆ సభ తర్వాత.. గడ్కరీ ఓ కొత్త చర్చకైతే తెరలేపాడు. కార్లతో పాటు ఓ అమృతాంజన్ బాటిల్ ను కూడా మీ పూర్ డిజైన్ నేపథ్యంలో కస్టమర్స్ కు ఇవ్వాలన్న సలహాతో.. గడ్కరీ అంతమాటన్న ఆ కార్ల ప్రధాన తయారీదారెవ్వరై ఉంటారన్న ప్రశ్నను మిగిలిన ఆటోమోబైల్ ఇండస్ట్రియలిస్టుల ముందుంచాడు. తనకు, తాను ఎవరైనేతే అన్నారో వారికి మాత్రమే తెలిసినదాన్ని విప్పీ విప్పనట్టుగా రివీల్ చేసి.. ఎవరై ఉంటారబ్బా అని మిగిలిన పారిశ్రామికవేత్తలంతా తలలు పట్టుకుని, వారంతా ఇప్పుడు అమృతాంజన్ ఆశ్రయించేలా చేశాడు. (రమణ కొంటికర్ల)
Share this Article