ఎఫ్బీఐని ముప్పుతిప్పలు పెడుతున్న మిస్సింగ్ క్రిప్టోక్వీన్! సినిమాను తలదన్నే స్టోరీ!!
అమెరికన్ ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీకి.. ఓ మహిళ ఇప్పుడు నిద్ర లేని రాత్రులు మిగులుస్తోంది. ఎఫ్బీఐ అర్జంటుగా పట్టుకోవాల్సిన క్రిమినల్స్ జాబితాలో.. సుమారు 529 మంది కరడుగట్టిన నేరస్తులున్నారు. అందులో 11 మంది మహిాళా నేరస్తులుంటే… వారిలో ఎప్పుడెప్పుడు పట్టుకుంటామా అన్నట్టుగా ఓ కిలేడీ కోసం ముమ్మురమైన గాలింపు కొనసాగుతోంది. నంబర్ వన్ క్రిమినల్ గా ఇప్పుడు ప్రపంచమంతా మిస్సింగ్ క్రిప్టో క్వీన్ అంటూ మాట్లాడుకుంటున్న వేళ.. ఎఫ్బీఐ ఫోకసంతా ఆమె పైనే. ఇంతకీ ఎవరామె..?
ఆమే.. ఎఫ్బీఐ మోస్ట్ వాంటెండ్ క్రిప్టో క్వీన్ రూజా ఇగ్నాటోవా.
Ads
ఇంతకీ ఇగ్నాటోవా ఏం చేసింది..?
క్రిప్టో కరెన్సీ పేరిట ఏకంగా 37 వేల కోట్ల రూపాయల మోసానికి తెరలేపింది. ఇప్పుడు డిజిటల్ కరెన్సీ చలామణి పెరిగాక నల్లధనం ఎంతగా తగ్గిందనుకుంటున్నారో.. అదే స్థాయిలో మోసాలూ పెరిగిపోతున్నాయి. పైగా క్రిప్టో కరెన్సీపైన భారత్ వంటి దేశంలోనూ ఏకంగా ఆర్బీఐయే నిషేధం విధించింది. కానీ, దాన్ని సుప్రీంకోర్ట్ ఖండించింది. ఆ నిషేధాన్ని ఎత్తేసింది.
అసలెంటీ… క్రిప్టో కరెన్సీ…?
క్రిప్టో కరెన్సీ కూడా డిజిటల్ కరెన్సీనే. కాకపోతే ఇది వర్చువల్ కరెన్సీ. అయితే, డిజిటల్ కరెన్సీపైన ఆయా దేశాలకు సంబంధించిన కేంద్ర బ్యాంకుల నియంత్రణ ఉంటుంది. కానీ, క్రిప్టో కరెన్సీ అందుకు అతీతం. డీసెంట్రలైజ్డ్ గా ఎక్కడైనా ఎవరి నియంత్రణా లేకుండా పనిచేస్తాయన్న మాట. క్రిప్టో కరెన్సీల విలువ అనేది డిమాండ్ – సరఫరా ఆధారంగా ఎప్పటికప్పుడూ మారుతూ ఉంటుంది. బ్లాక్ చెయిన్ టెక్నాలజీ ద్వారా పనిచేసే ఈ క్రిప్టో కరెన్సీని నతోషి నకమోటో 2008లో కనుగొన్నారు.
అంతకుముందు పలువురు ప్రయత్నించినా… నకమోటో సక్సెస్ ఫుల్ గా క్రిప్టో కరెన్సీ అనే డీ సెంట్రలైజ్డ్ డిజిటల్ కరెన్సీని చలామణిలోకి తీసుకొచ్చారు. ఈ క్రిప్టో కరెన్సీల్లో రకరకాలుగా ఉంటాయి. వాటిలో బిట్ కాయిన్, ఇథీరియమ్, డాష్, మెనెరో, రిపుల్, లైట్ కాయిన్ అనే కొన్ని ప్రముఖంగా కనిపిస్తుండగా… ఇగ్నాటోవా వన్ కాయిన్ క్రిప్టోకరెన్సీ పేరుతో మోసానికి తెరలేపి.. ఎఫ్బీఐకి అంతుదొరక్కుండా తిరుగుతూ.. మిస్సింగ్ క్రిప్టోరాణిగా అవతరించింది.
వన్ కాయిన్ పేరుతో ఇగ్నాటోవా ప్రపంచవ్యాప్తంగా పెట్టబడిదారుల నుంచి 4.5 బిలియన్ డాలర్స్.. అంటే, ఏకంగా సుమారు 37 వేల కోట్ల రూపాయలను సేకరించి జాడా పత్తా లేకుండా పోయింది. ఇప్పుడా బాధితులంతా లబోదిబోమంటుంటే. ఏకంగా ఇగ్నాటోవా కేసు ఎఫ్బీఐకి చేరింది. ఎఫ్బీఐకి కూడా కొరకరాని కొయ్యగా తప్పించుకు తిరుగుతోంది 42 ఏళ్ల ఇగ్నాటోవా.
2014లోనే పక్కా స్కెచ్ వేసి… తన పథకాన్ని ప్రారంభించింది ఇగ్నాటోవా. లండన్ లోని వెంబ్లీ అరేనా అనే ఇన్వెస్టర్స్ సమ్మిట్ లో వేదికపైకొచ్చి.. అభివృద్ధి చెందుతున్న క్రిప్టోకరెన్సీలో బిట్ కాయిన్ కు ప్రత్యామ్నాయంగా.. లాభదాయకమైందిగా వన్ కాయిన్ గురించి ప్రచారం చేసింది. ఆమె ఎక్స్పర్టైజ్డ్ ప్రసంగంతో.. బడా పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులు కూడా వలలో పడ్డారు.
అలా, ఆమె వన్ కాయిన్ క్రిప్టోకరెన్సీ ఫేక్ ప్రచారానికి లోనైనవారంతా ఆమె ప్రాజెక్టులో పెట్టుబడి పెట్టారు. అలా సేకరించిన నిధులతో.. సరిగ్గా 16 నెలల కాలం తర్వాత… 2017లో ఉడాయించింది ఇగ్నాటోవా. చివరగా బల్గేరియాలోని సోఫియాలో విమానమెక్కేటప్పుడు కనిపించిన ఇగ్నాటోవా… ఆ తర్వాత జాడ పత్తా లేకుండా పోయింది. దాంతో ఎఫ్బీఐ ఆమెను మోస్ట్ వాంటెడ్ జాబితాలో చేర్చింది.
సరిగ్గా 2017 నుంచి ఎఫ్బీఐ 529 మంది నోటోరియన్ క్రిమినల్స్ లిస్ట్ ప్రకారం… పదకొండు మంది మహిళా నేరస్తులుండగా.. అందులో ఇప్పుడు ఎఫ్బీఐకి గత ఏడేళ్లుగా కంటిమీద కునుకు లేకుండా చేస్తూ… ఓ సవాల్ గా మారిన క్రిమినల్ ఇగ్నాటోవా. ఇప్పుుడు అమెరికాకే కాదు.. యూరప్ దేశాలకూ మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ గా కళ్లు గప్పి తిరుగుతున్న నేరస్తురాలు ఇగ్నాటోవా.
జర్మన్ పౌరసత్వాన్ని కల్గి ఉన్న రూజా ఇగ్నాటోవా.. బల్గేరియాలో జన్మించింది. తండ్రి ఇంజనీర్, తల్లి ఉపాధ్యాయురాలు. ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీలో యూరోపియన్ లా లో గ్రాడ్యుయేట్. ఆ తర్వాత బల్గేరియా రాజధాని సోఫియాలో మెక్ కిన్సే అండ్ కంపెనీలో కన్సల్టెంట్ గా పనిచేసింది.
ఎఫ్బీఐ అంచనా ప్రకారం 2017, అక్టోబర్ 25న ఇగ్నాటోవా సోఫియా నుంచి ఏథెన్స్ కు ప్రయాణించి… ఆ తర్వాత ఇతర ప్రాంతాలకు పారిపోయి ఉండవచ్చు. జర్మనీ పాస్ పోర్ట్ కల్గి ఉన్న ఇగ్నాటోవా.. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, బల్గేరియా, జర్మనీ, రష్యా, తూర్పు ఐరోపా వంటి ప్రాంతాల్లో ఎక్కడో ఓ చోట ఉండొచ్చన్నది ఎఫ్బీఐ నమ్మకం. అదే సమయంలో, ఆమె తను కచ్చితంగా సాయుధురాలై ఉంటుందని.. తననెవ్వరూ గుర్తు పట్టకుండా ముఖానికి ప్లాస్టిక్ సర్జరీలతో ఎప్పటికప్పుడు రూపం మార్చుకుంటుండొచ్చుననీ ఎఫ్బీఐ ప్రాథమికంగా అనుమానిస్తోంది.
కేవలం యూఎస్ కే పరిమితం కాకుండా ప్రపంచ వ్యాప్తంగా వన్ కాయిన్ అనే ఓ ఫేక్ క్రిప్టోకరెన్సీ పేరుతో.. ఇగ్నాటోవా ఎందరో పెట్టుబడిదారులను బురిడీ కొట్టించిన విషయాన్ని ఎఫ్బీఐ గ్రహించింది. ఆమె బిట్ కాయిన్ ను అధిగమించే క్రిప్టోకరెన్సీగా వన్ కాయిన్ గురించి ప్రచారం చేసింది. దాన్ని మించిన ఇండిపెండెంట్ బ్లాక్ చెయిన్ టెక్నాలజీగా నమ్మబలికింది. కానీ, యూఎస్ నిపుణుల మాటల ప్రకారం వన్ కాయిన్ అసలు విలువే లేనిది. ఏమీ లేకుండానే… నేటి సాంకేతికతను క్యాష్ చేసుకుని… ఏదో ఉన్నట్టు వన్ కాయిన్ పేరుతో కొత్త పథకాన్ని సృష్టించి అత్యంత చాకచక్యంగా పెట్టుబడిదారులను బురిడీ కొట్టించిన ఇగ్నాటోవాపై.. వైర్ ఫ్రాడ్, మనీ లాండరింగ్, సెక్యూరిటీస్ ఫ్రాడ్ వంటి అభియోగాలతో కేసులు నమోదయ్యాయి.
ఇగ్నాటోవా ఈ బురిడీ పథకాన్ని ముందుగానే తన భాగస్వాములతో చర్చించి సిద్ధం చేసుకుందని… అమాయకులైన వారికి కుచ్చుటోపీ పెట్టి అసలు మార్కెట్ లో చలామణిలో లేని.. ఎలాంటి విలువ లేని వన్ కాయిన్ అనే క్రిప్టోకరెన్సీలో పెట్టుబడులు పెట్టించారని… యునైటెడ్ స్టేట్స్ లో టాప్ మోస్ట్ ప్రాసిక్యూటరైన అటార్నీ డామియన్ విలియమ్స్ వంటివారే పేర్కొన్నారు. తమ కళ్లుగప్పి చేసిన ఈ మోసంపై.. కష్టించి సంపాదించి పెట్టుబడి పెట్టిన అమాయకులు ఓవైపు లబోదిబోమంటుంటే… మరోవైపు గత ఏడేళ్లుగా మిస్సింగ్ క్రిప్టోక్వీన్ ఇగ్నాటోవా కోసం ఎఫ్బీఐ గాలింపు ముమ్మురంగా కొనసాగుతూనే ఉంది. మొత్తంగా ఓ సినిమాను తలపించే క్యూరియాసిటిని రేకెత్తిస్తోన్న క్రిప్టోరాణి ఇగ్నాటోవా.. ఇప్పుడో సంచలనంగా మారింది…… (రమణ కొంటికర్ల)
Share this Article