ఉద్యోగులు రాజకీయ ప్రచారం చేయవచ్చా…!?
ఉద్యోగ, ఉపాధ్యాయుల్లో కొందరు ఇటీవల కాలంలో అవగాహనా రాహిత్యంతోనో లేక అత్యుత్సాహంతోనో రాజకీయ పార్టీలకు బహిరంగంగా మద్ధతు ప్రకటనలు చేస్తూ… మితి మీరి వ్యవహరిస్తున్నట్టు అనిపిస్తోంది. తాము ప్రభుత్వ ఉద్యోగులమని… నిబంధనల ప్రకారమే వ్యవహరించాలన్న సోయే వారిలో లేకుండా పోయింది. ప్రస్తుతం జరుగుతున్న జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బాహాటంగా రాజకీయ పార్టీలకు మద్ధతు పలుకుతూ లేదా విమర్శిస్తూ పేస్ బుక్, వాట్సాప్, ట్విట్టర్ వంటి సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెడుతున్నారు.
మనకేం అవుతుంది? మనం మద్ధతు ఇచ్చేది అధికారంలో ఉన్న వారికే కదా అని భావిస్తూ కొందరు అడ్డగోలు పోస్టులు పెడుతున్నారు. ఇంకొందరు అధికారంలో లేని వారికి సైతం వంతపాడుతూ వస్తున్నారు. రెండూ తప్పే! ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయులు రాజకీయ ప్రకటనలు చేయడం, ఎన్నికల్లో ప్రచారం చేయడం, మద్ధతు ప్రకటించడం సీసీఏ రూల్స్-1991 ప్రకారం క్రమశిక్షణ ఉల్లంఘనే అవుతుంది.
Ads
ఈ రోజు అధికారంలో ఉన్న పార్టే శాశ్వతంగా అధికారంలో ఉండదు కదా! ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్న రాజకీయ పక్షం భవిష్యత్తులో అధికారంలోకి రావొచ్చు. బళ్ళు ఓడలు కావచ్చు, ఓడలు బళ్ళు కావచ్చు. అధికారంలో లేని పార్టీకి మద్ధతు ఇస్తే వెంటనే వేటు పడుతుంది. అధికారంలో ఉన్న రాజకీయ పార్టీకి మద్ధతు ఇచ్చే వారు తమ పబ్బం గడుపుకోవడానికి….. సొంత పనులు చక్కబెట్టుకోవడానికి తాత్కాలికంగా పనికి వస్తుందేమో కానీ, ఎప్పుడో ఒకప్పుడు వారికి ఇబ్బందులు తప్పవ్! ఇది గ్యారంటీ. రాసి పెట్టుకోండి! ఎందుకంటే అన్ని రోజులు ఒక్క తీరుగా ఉండవ్ కదా! తాము ఇప్పుడు భుజాలకెత్తుకొని ప్రచారం చేస్తున్న రాజకీయ పార్టీ తమకు ఇబ్బంది కలిగినప్పుడు పట్టించుకుటుందన్న పూచీ కూడా లేదు. ఈ విషయాన్ని ఉద్యోగులు గుర్తు పెట్టుకుంటే వారికే మంచిది.
గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో జరిగిన ఒక దురదృష్టకరమైన సంఘటనను ఉద్యోగ, ఉపాధ్యాయులు గుర్తుకు తెచ్చుకుంటే మంచిది. సరిగ్గా ముప్పై ఐదేళ్ల క్రితం…. అప్పుడు రాష్ట్రంలో అధికారంలో ఉన్న ప్రభుత్వం ఉద్యోగ, ఉపాధ్యాయుల రిటైర్మెంట్ వయస్సుని 58 నుంచి 55 ఏళ్లకు తగ్గించింది. రాత్రికి రాత్రే ఉత్తర్వులు జారీ చేసింది. ఈ విపత్తుని ఏమాత్రం ఊహించని పలువురు ఉద్యోగులు గుండె ఆగి చనిపోయారు. వయస్సు తగ్గింపుతో ఉద్యోగులు చనిపోవడాన్ని చూసి తట్టుకోలేక కడుపుమండిన ఒక ఉద్యోగ నాయకుడు ఆవేశంలో ప్రభుత్వాన్ని ఒక్క మాట అన్నాడు. ఆ మాటను సీరియస్ గా తీసుకున్న ప్రభుత్వ పెద్దలు సదరు ఉద్యోగనేతపై కత్తి కట్టి వేటు వేశారు. ఆ వేటు సస్పెన్షన్ కాదు, రిమూవల్ ఫ్రొం సర్వీస్ కూడా కాదు. సర్వీస్ నుంచి ఏకంగా డిస్మిస్ చేసింది. నాలుగేళ్ల తర్వాత…. 1989లో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత సదరు ఉద్యోగ నేతను తిరిగి ఉద్యోగంలోకి తీసుకున్నారనుకోండి. అది వేరే విషయం.
ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్లకు సమస్యలున్నది నిజం. ఈ ప్రభుత్వం ఆ సమస్యల్ని పట్టించుకోవడం లేదన్నదీ వాస్తవమే! 18 సమస్యలను పరిష్కారం చేస్తానని స్వయంగా సీఎం రెండున్నర ఏళ్ళ క్రితం విలేఖరుల సమావేశంలో ఇచ్చిన హామీలే నేటి వరకూ అమలుకు నోచుకోలేదు. సీఎం సచివాలయానికి రారు. ఉద్యోగ, ఉపాధ్యాయ ప్రతినిధులకు ప్రగతిభవన్లోకి ఎంట్రీ లేదు. భవిష్యత్తులో సీఎం అవుతారని ప్రచారంలో ఉన్న మంత్రి కేటీ రామారావు గారైనా జోక్యం చేసుకొని పరిస్థితి చక్కదిద్దుతారని ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్లు పెట్టుకున్న ఆశలు కూడా అడియాసలయ్యాయ్.
దాంతో రాష్ట్రంలోని ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్లలో ఈ ప్రభుత్వంపై… ప్రభుత్వ పెద్దలు తమ పట్ల వ్యవహరిస్తున్న తీరుపై ఆవేదన, అసంతృప్తి, ఆగ్రహం ఉందన్నది నూటికి నూరు శాతం నిజం. అయితే, కోపాన్ని ప్రదర్శించడం కోసం సామాజిక మాధ్యమాల్లో పాలక పార్టీకి వ్యతిరేకంగా పోస్టులు పెట్టడం తగదు. దానికి రూల్స్ ఒప్పుకోవు. వాటిని ప్రభుత్వం, అధికారులు సీరియస్ గా తీసుకుంటే రాజకీయ ప్రచారం చేసిన ఉద్యోగ, ఉపాధ్యాయులకు తీవ్ర ఇబ్బందులు ఎదురవ్వడం ఖాయం.
రాజకీయ పోస్టింగులు, మద్ధతు ప్రచారం, లేఖలపై ఫిర్యాదులు వెళ్లి విచారణ జరిగితే సదరు ఉద్యోగ, ఉపాధ్యాయులపై సస్పెన్షన్ సహా తీవ్ర చర్యలు తీసుకునే ప్రమాదముంది. దాంతో సర్వీస్ పరమైన సమస్యలూ ఉత్పన్నమవుతాయి. అందుకే రాజకీయ ప్రచారం వంటి దుస్సాహసానికి ఉద్యోగ, ఉపాధ్యాయులెవరూ పాల్పడకూడదు.
కింకర్తవ్యం….!?
కలిసి వచ్చే సంఘాలను కలుపుకొని ఏళ్ళ తరబడి సమస్యలను పెండింగులో పెట్టి ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల పట్ల రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న నిర్లక్ష్య వైఖరికి నిరసనగా దశల వారీగా ఉద్యమాలు నిర్మించడమే ఏకైక మార్గం. ప్రస్తుత పరిస్థితుల్లో ఉద్యమాలే సమస్యల పరిష్కారానికి ఏకైక మార్గం. దీనికి రాష్ట్రంలోని అన్ని రాజకీయ పక్షాలు, ప్రజల మద్ధతు సైతం కోరాలి. కూడగట్టాలి. ఒంటెద్దు పోకడలతో పోతున్న ప్రభుత్వానికి ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్లు తమ నిరసనను ఆ విధంగానే తెలియజేయాల్సి ఉంది. అంతే కానీ, రాజకీయ ప్రచారానికి దిగి ఇబ్బందులు కొని తెచ్చుకోవద్దు!
– మానేటి ప్రతాపరెడ్డి!
Share this Article