ప్రపంచంలో బహుశా ఏ జాతీ ఇలా ఉండదేమో… తమ మతం, తమ సంస్కృతి, తమ మనోభావాలు, తమ దేవుళ్లు, తమ పండుగలకు అపచారం జరిగినప్పుడు, అదీ తమ జాతి మనుషులే ద్రోహులైనప్పుడు కూడా… ఇంత నిర్లిప్తంగా, ఇంత నిర్వేదంగా… అంతకుమించి అపచారాన్ని ‘అత్యంత భారీ అతి తెలివి మేధస్సు’లతో సమర్థించుకునే దురవస్థ, దరిద్రం నిజంగానే ప్రపంచంలో మరే జాతిలోనూ ఉండి ఉండదు…
తిరుమల లడ్డూలో జంతువుల కొవ్వు అనే వివాదం వంటిది నిజంగానే మరో మతంలో కనిపిస్తే ఎలా ఉండేదో ఆలోచించండి… కానీ మనం మాత్రం… నిన్న కొందరు సోషల్ మీడియాలో వ్యంగ్య పోస్టులు… జంతువుల కొవ్వు ఎలా ఆరోగ్యానికి మంచిది, పెరుగులో బ్యాక్టీరియా ఉండదా..? అది జీవం కాదా..? పంది కొవ్వు ఎంత మేలో తెలుసా..? అంటూ లడ్డూ నెయ్యిలో జంతువుల కొవ్వు కలపడాన్ని పరోక్షంగా సమర్థిస్తూ, ఆనందిస్తూ… ఎందరో ప్రకాష్‌రాజ్‌లు…
ఏ జాతి గోవుల్ని పూజిస్తుందో, అదే జాతి ఆవుకొవ్వు నుంచి తీసిన నెయ్యిని ప్రసాదంలాగా కళ్లకద్దుకుని స్వీకరించడం… ఇంతకు మించిన పారడాక్స్ ఏముంది..? హిందూ మత పరిరక్షకుడు, ప్రపంచస్థాయి నాయకుడు శ్రీమాన్ మోడీ గారికి ఇంకా ఈ మనోభావాలు తెలిసినట్టు లేవు… నంబర్ టూకు ప్రస్తుతం తీరిక లేనట్టుంది… మహా శ్రీమాన్ మోహన్ భగవత్ మోడీ లోపాన్వేషణలో బిజీగా ఉన్నట్టున్నాడు…
Ads
పత్రికల్లో వార్తలు, కేంద్రం సీరియస్, నివేదిక పంపాలని చంద్రబాబుకు ఆదేశాలట… ఆయన తన వెర్షన్‌కు తగిన నివేదికే పంపిస్తాడు… కేంద్రం ఏం చేయగలదు..? సీబీఐ విచారణ వేస్తుందా..? వేస్తే నాలుగు రోజుల్లో అటక మీద పారేస్తుంది అది… సీబీఐ విచారణలోని వేగం తెలియదా మనకు..? మరొకరు సిట్టింగ్ జడ్జితో విచారణకు డిమాండ్ చేశారు… ఇవన్నీ దేనికి..? దోషుల్ని తేల్చడానికి..? అదంత ఈజీ కాదు… ఈ తాత్కాలిక పరిష్కారాలూ కరెక్టు కాదు…
ఏపీ బీజేపీ ఉపాధ్యక్షుడు ఎస్.విష్ణువర్ధన్‌రెడ్డి డిమాండ్ సరైన దిశలో ఉంది… ‘‘ఈ అపచారానికి దోషుల్ని తేల్చి శిక్షించాలి, అంతేకాదు, రాజకీయ రాబందుల నుంచి గుళ్లను విముక్తం చేయాలి…’’ కరెక్టు… అసలు హిందూ గుళ్లపై రాజకీయాలు, ప్రభుత్వాల పెత్తనం ఏమిటి..? పవన్ కల్యాణ్ సూచన కూడా పర్లేదు… సనాతన పరిరక్షణ బోర్డు ఏర్పాటు చేయాలనేది… కానీ అలాంటివి ఇలాంటి ఇష్యూస్ మీద సీరియస్ వర్క్ చేయలేవు… రేప్పొద్దున నాన్ బీజేపీ ప్రభుత్వం వస్తే ఫస్ట్ రద్దు చేసేది కూడా ఇదే…
అవునూ… ప్రపంచంలోకెల్లా భీకరమైన అతి పెద్ద హిందువు స్పందించాడా..? ఇంకా యోగనిద్ర నుంచి బయటికి రాలేదా..? తమిళనాడు డీఎంకే ప్రభుత్వం అర్జెంటుగా కళ్లు తెరిచి, అక్కడి గుళ్లలో నెయ్యి పరీక్షలు చేయిస్తోందట… ప్లస్ తమ రాష్ట్రానికి ఏఆర్ కంపెనీ కదా తిరుమలకు నెయ్యి సప్లయ్ చేసేది, దాన్ని వెనకేసుకొస్తోంది… అసలే డీఎంకే మార్క్ సనాతన ధర్మవ్యతిరేక నాయకులు కదా, పర్లేదు, నెయ్యి ఏదైతేనేం అని కూడా అనగలరు… కర్నాటక ఓ మంచి పని చేసింది… మొత్తం గుళ్లకు నందిని నెయ్యిని మాత్రమే వాడాలని ఆదేశాలు ఇచ్చింది…
కర్నాటక మిల్క్ ఫెడరేషన్‌కు చెందిన నందిని నెయ్యే గతంలో తిరుమలకూ వచ్చేది… ఇప్పుడిక ప్రతి రాష్ట్రమూ ప్రసాదాల ఇంగ్రెడియెంట్స్ సీరియస్ ల్యాబ్ పరీక్షలకు సిద్ధమవుతున్నాయి… అయోధ్యకు లక్షల లడ్డూలు పంపించింది కదా తిరుమల… జాతి ఘనంగా సెలబ్రేట్ చేసుకున్న అయోధ్య రాముడి గుడికి వచ్చిన భక్తులకూ ఈ కొవ్వు లడ్డూలనే పంచారా..? హతవిధీ… రామా… కనవేమిరా…!!
Share this Article