అక్కినేని నటించిన భక్తి రస చిత్రాలలో నాకు బాగా ఇష్టమైన సినిమా 1977 లో వచ్చిన ఈ చక్రధారి సినిమా . మహారాష్ట్రలోని ఓ చిన్న గ్రామంలో పాండురంగడికి అసలు సిసలయిన భక్తుడు గోరా కుంభార . ఆ భక్తుని కధ ఆధారంగా కన్నడంలో వచ్చిన భక్త కుంభార సినిమాకు రీమేక్ మన తెలుగు సినిమా . రాజకుమార్ నటించారు . చాలా భాషల్లో ఈ కధ సినిమాలుగా వచ్చాయి . 1948 లో తమిళంలో చిత్తూరు వి నాగయ్య , పుష్పవల్లిలతో ఒక సినిమా వచ్చింది . అలా మరాఠీ , హిందీ భాషల్లో కూడా వచ్చాయి .
మన తెలుగు సినిమాకు దర్శకుడు వి మధుసూధనరావు . పరమ భక్తుడు అయిన గోరా తన భార్యతో కుండలను చేసి , వాటిని అమ్ముకుని జీవనం సాగిస్తూ ఉంటాడు . ఒకరోజు మట్టిని తొక్కుతూ పారవశ్యంలో బిడ్డను చంపేసుకుంటాడు . తరువాత కోపంతో తనను తాకవద్దని ఇల్లాలి షరతు… కొన్ని పరిణామాల తరువాత చెల్లెల్ని ఇచ్చి పెళ్లి చేస్తుంది భార్య . పాండురంగడే వైకుంఠం నుండి దిగి వచ్చి ఆ కుటుంబానికి ఆసరా అయి , భక్తుడిని భగవంతుడు సేవిస్తాడు . ముగింపులో గోరాకు పోయిన చేతులు , చనిపోయిన బిడ్డ వస్తాయి . తన భార్యలతో సుఖ జీవనాన్ని సాగిస్తాడు గోరా . క్లుప్తంగా ఇదీ కధ .
గోరా భార్యలుగా వాణిశ్రీ , జయప్రద నటించారు . మహా విష్ణువుగా రామకృష్ణ అందంగా కనిపిస్తాడు . ఇతర పాత్రల్లో గుమ్మడి , సత్యనారాయణ , నాగరాజు , అల్లు రామలింగయ్య , రాజబాబు , రమాప్రభ , వెన్నిరాడై నిర్మల , జయమాలిని నటించారు .
Ads
భక్తి పారవశ్యంలో బిడ్డని పోగొట్టుకుని , చేతుల్ని నరుక్కొని , కుటుంబాన్ని అస్తవ్యస్తం చేసుకున్న పరమ భక్తుడికి సేవ చేయటానికి ఆ దేవదేవుడే రావటాన్ని చక్కగా చూపించారు దర్శకులు . రామకృష్ణ కూడా బాగా నటించాడు . ఈ సన్నివేశాలు నాకు బాగా నచ్చాయి .
ఈ సినిమాలో నాకు బాగా నచ్చిన మరొకటి రాధాకృష్ణుల నృత్యం . కన్నడ చిత్రానికి సంగీత దర్శకత్వం వహించిన జి కె వెంకటేషే తెలుగు సినిమాకు కూడా సంగీతాన్ని అందించారు . పాటలన్నీ వీర హిట్ . దేవాలయాల్లో కూడా వినిపిస్తూ ఉంటాయి . ఆత్రేయ వ్రాసిన కనుగొంటిని హరిని కనుగొంటిని పాటతో రాధాకృష్ణుల నృత్యం చాలా బాగా వచ్చింది . వెన్నిరాడై నిర్మల నృత్యాన్ని బాగా చేసింది . పాటలను రామకృష్ణ , ఆనంద్ , సుశీలమ్మ పి బి శ్రీనివాస్ పాడారు .
మిగిలిన భక్తి రస పాటలు కూడా చాలా శ్రావ్యంగా ఉంటాయి . విఠలా విఠలా పాండురంగ విఠలా , నువ్వెవరయ్యా నేనెవరయ్యా , ఎక్కడున్నావు ప్రభూ ఎక్కడున్నావు , హరి నామమే మధురం , మానవా ఏమున్నది ఈ దేహం ఇది రక్తమాంసముల అస్థిపంజరం భక్తి భావంతో చాలా బాగుంటాయి . నాలో ఏవేవో వింతలు గిలిగింతలు పాట జయప్రద , ఆమె స్నేహితురాళ్ళ మీద తీసారు . బాగుంటుంది .
వంద రోజులు ఆడిన ఈ సినిమా చాలా తరచుగా టివి చానళ్ళలో వస్తూనే ఉంటుంది . యూట్యూబులో కూడా ఉంది . పాటల వీడియోలు కూడా ఉన్నాయి . అక్కినేని అభిమానులు , ఆస్తికులు చూసి ఉండకపోతే తప్పక చూడండి . రాధాకృష్ణుల నృత్యం వీడియో మరీ తప్పక చూడండి . కన్నుల పండుగగా ఉంటుంది .
ఈ సినిమా పుణ్యమా అని , అలాగే భక్త తుకారాం సినిమా పుణ్యమా అని పండరీపురం వెళ్ళాలనే కోరిక చాలా గాఢంగా పడిపోయింది నాకు . అయిదేళ్ళ కింద వెళ్ళాం . దేవాలయం చాలా బాగుంది . దేశంలో ఉన్న పుణ్యక్షేత్రాలు వయసులో ఉన్నప్పుడే చూసేయండి . ఆ తర్వాత ఓపిక ఉండదు . #తెలుగుసినిమాలసింహావలోకనం #తెలుగుసినిమాలు (దోగిపర్తి సుబ్రహ్మణ్యం)
Share this Article