సరదాగా ఓ విషయం… నిన్న దివంగత ఏచూరి (దివంగత అనే పదం వాడటానికి మార్క్సిస్టులు ఒప్పుకుంటారో లేదో) పోనీ, కీర్తిశేషుడు అందామా…? అది ఫ్యూడల్ భాష అంటారేమో… సరే, వాళ్ల భాషలో అమరుడు సీతారాం ఏచూరి సంస్మరణ కార్యక్రమం ఒకటి నిర్వహించారు కదా…
ఆ వార్త చదువుతుంటే రెండు వాక్యాల దగ్గర పఠనం ఆగిపోయింది… కేటీయార్ తదితరులు వచ్చి నివాళ్లు అర్పించి వెళ్లారు, తరువాత రేవంత్ రెడ్డి వచ్చి ఓ పుస్తకం ఆవిష్కరించి ప్రసంగించాడు… ఇవీ ఆ వాక్యాలు… ఎందుకలా..? ముందుగానే అలా ప్లాన్ చేశారా మార్క్సిస్టులు..? అసలే రాజకీయాలు చాలా వేడిగా ఉన్నాయి… ఒకేసారి వాళ్లిద్దరూ ఒకేచోట కలిస్తే ఇంకేమైనా ఉందా అని అనుకున్నారా..?
లేక యాదృచ్ఛికమా..? కేటీయార్ వచ్చి పోయాక వెళ్దాంలే అని రేవంత్ రెడ్డి అనుకున్నాడా..? ముందే వెళ్లొస్తే రేవంత్ రెడ్డితో కలయికను అవాయిడ్ చేయొచ్చు అని కేటీయార్ అనుకున్నాడా..? అవునూ, ఇద్దరూ వేదికను కలిసి షేర్ చేసుకుంటే తప్పేముంది..? ఇంకా హుందాగా ఉండేది కదా… ఏం, అక్కడ కలిస్తే ఇలా ఒకరి చేయి ఒకరు మెలిపెట్టుకుని తగవులాడతారా ఏం..?
Ads
(ఏయ్, ఏదో 8888 కోట్ల స్కాం అంటున్నవ్, కమాన్, ఇక్కడే ఆధారాలు చూపించు అని రేవంత్ రెడ్డి నిలదీయడు కదా… ఎహె, ముందుగా నీ హైడ్రా కూల్చివేతల కథేమిటో చెప్పు అని కేటీయార్ అడగడు కదా…)
రాజకీయాలు వేరు, వ్యక్తిగత మర్యాదలు, పరస్పర గౌరవాలు వేరు… దాన్ని చూపించే పరిణతి ఇద్దరిలోనూ ఉందనే అనుకుంటున్నాను… అధికారపక్షం, ప్రతిపక్షం కలిసి మరణించిన ఓ అగ్రనేతకు నివాళ్లు అర్పిస్తే ఇంకా బాగుండేదని చెప్పడానికి ఈ ప్రస్తావన… సరే, దీన్నలా వదిలేస్తే…
ఏచూరి సంస్మరణకు మళ్లీ రాజకీయాల ప్రస్తావనకు, విమర్శలకు వేదిక చేసుకున్నారు… అక్కర్లేదు… పైగా జమిలి ముసుగులో దేశాన్ని కబళించే కుట్ర అట… జమిలి ప్రయత్నం మోడీ చేస్తున్నాడు కాబట్టి ఆ ఆలోచనను వ్యతిరేకించాలా..? ఇదెక్కడి దౌర్భాగ్యం..?
జమిలి ఎన్నికలు ఫెడరల్ స్పిరిట్‌కే వ్యతిరేకం అంటాడు ఒకాయన నిన్న… తప్పేముంది..? ఒకేసారి ఎన్నికలు నిర్వహించడం వల్ల లాభమే తప్ప నష్టమేముంది..? ఉంటే ఉండవచ్చు… లోకసభతోపాటు అసెంబ్లీలకు జమిలిగా ఎన్నికలు నిర్వహిస్తే ‘దేశం తాలూకు సమస్యలే’ ప్రచారంలోకి వచ్చి తమకు ఫాయిదా ఉంటుందనేది బీజేపీ భావన కావచ్చు… ఐనాసరే, ప్రతిపక్షాలు ఎందుకు ఉలిక్కిపడాలి, దేశాన్ని కబళించడం ఏముంది..?
యాంటీ బీజేపీ వోట్లన్నీ మొన్నటిలాగే ఇంకా ఏకం చేసి, వచ్చే ఎన్నికల్లో బీజేపీని పాతరేస్తాం అంటున్నారు కదా… అదే భావన, అదే నమ్మకంతో పనిచేస్తే, జనమూ నమ్మితే అసెంబ్లీలలోనూ ఇండి కూటమికే ఫాయిదా కదా…? మరెందుకు ఈ వ్యతిరేకత..? మోడీ చేస్తున్నాడు కాబట్టి వ్యతిరేకించాలి, అంతే… అదేనా కారణం..?
మరిచిపోయాను… కేటీయార్ అంటున్నాడు, మా బంధం ఉద్యమాల రక్తసంబంధం అట… ఎందుకయ్యా అంటే..? ఇద్దరమూ ఉద్యమాల నుంచి వచ్చిన బిడ్డలం కాబట్టి రక్తసంబంధమట… ఓహ్, ఉద్యమాలు ఎవరు చేసినా, వారితో ఇదే రక్తసంబంధం ఉంటుందా మాస్టారూ… ఊరికే తెలియక అడిగిన ప్రశ్న… అక్కడ ఏచూరి కథ వేరు… బీఆర్ఎస్‌లో ఎవరితోనూ పోల్చలేనంత ఎత్తు… అలాంటిది ఈ రక్తచుట్టరికాలు దేనికి..? ఏచూరిపై నాలుగు మంచి మాటలు మాట్లాడి వస్తే సరిపోదా..? తనతో పోలికలు, రక్త బంధుత్వాలు, నెత్తుటి బందాలు దేనికి..?!
Share this Article