నా జీవితంలో చంద్రబాబు ఏడవడం మొదటిసారి చూశాను… తన సతీమణిని వైసీపీ నాయకులు కించపరిచారనీ, కుళ్లు రాజకీయాల్లోకి సంస్కారరహితంగా ఇంట్లోని ఆడవాళ్లను తీసుకొస్తున్నారనీ విలపించాడు… ఆరోజు తన విలాపం నాటకం కాదు, నిజంగానే నీచమైన వ్యాఖ్యల్ని ఎదుర్కున్నారు ఆ దంపతులు… ఖచ్చితంగా తప్పే… (నవ్వడమూ అరుదే, ఉద్వేగరహితుడు… యంత్రుడు)
తన పక్షం నుంచి చిల్లర కూతల్ని నివారించలేదు జగన్, అదీ తప్పే… అలాగని టీడీపీ క్యాంపు ఏమీ శుద్దపూస కాదు… జగన్ కుటుంబసభ్యుల మీద కూడా అవాకులు చెవాకులకు పాల్పడిందే… అఫ్‌కోర్స్, ఏపీ రాజకీయాలే బురద… లెఫ్ట్, కాంగ్రెస్, బీజేపీ క్యాంపులు మినహా మిగతా మూడు పక్షాలూ ఎంతకు దిగజారాలో అంతకూ దిగజారాయి… ఏపీ పాలిటిక్స్ అంటేనే డ్రైనేజీ కంపు…
ఇంటి మహిళల మీద కామెంట్లు చేయడంలో కనీసం చంద్రబాబైనా సంయమనం పాటించాలి కదా… ఎందుకంటే, తను ఆ బాధను అనుభవించినవాడు కాబట్టి… తనైనా ఇంటి మహిళల మీద కామెంట్లు చేయడంలో విచక్షణ పాటించాలి కదా… అది సంస్కారం… కానీ తిరుమల లడ్డూ వివాదంలోకి జగన్ కుటుంబసభ్యులనూ లాక్కొస్తున్నాడు, అది కరెక్టు కాదు, తను చెప్పేవీ కరెక్టు కాదు…
Ads
తిరుమల సెట్ ఇంట్లో వేయించుకున్నాడట… అందులో మరీ తప్పుపట్టాల్సిందేమీ లేదు… సెట్టింగ్ సెట్టింగే, గుడి కాదు, దానికా పవిత్రత రాదు, ఉందని నమ్మితే అది జగన్ మూఢత్వం… కానీ అదేదో మహాపరాధం కూడా కాదు… జగన్ సతీమణి గుడికి రాదు, ఇద్దరూ కలిసి శేషవస్త్రాలు సమర్పించడానికి రాలేదు అని విమర్శ… అది వాళ్లిష్టం… నిజంగానే భారతి ఎందుకు జగన్‌తో కలిసి తిరుమలకు ఎప్పుడూ ఎందుకు వెళ్లలేదో ఎవరికీ అంతుపట్టదు, తెలియదు… కానీ అలా జంటగా రాకపోవడం మాత్రం అపచారం మాత్రం కాదు…
(అంతకుముందు వైఎస్ కూడా బహుశా ఇలాగే అనుకుంటా… తను మరణించాక ఇక విజయలక్ష్మి ఎప్పుడూ చేతిలో బైబిల్ పట్టుకునే తిరుగుతూ ఉంటుంది… కానీ చంద్రబాబు చెబుతున్నట్టు వైవీ సుబ్బారెడ్డి భార్య ఎప్పుడూ బైబిల్ పట్టుకుని తిరుగుతుంది అనే వ్యాఖ్య తప్పు… ‘ఆయన వందసార్లు అయ్యప్ప మాల వేసుకుంటేనేం, భార్య బైబిల్ పట్టుకుని తిరుగుతూ ఉంటుంది’ అనేది చంద్రబాబు వ్యాఖ్య… బైబిల్ పట్టుకుని తిరగడం తప్పు కాదు, ఎవరి నమ్మకం వాళ్లది… దాన్ని తప్పుపట్టడం దేనికి..? పైగా సుబ్బారెడ్డి భార్య స్వర్ణలత హార్డ్‌కోర్ హిందూ దైవభక్తురాలు… పూజలు కూడా ఎక్కువే…
వైవీ సుబ్బారెడ్డి భార్య స్వర్ణలత మీద ముచ్చట మూడేళ్ల క్రితం రాసిన ఓ పోస్టు లింక్ ఇదుగో…
సుబ్బారెడ్డి అయ్యప్ప మాట ఎన్నేళ్లు వేసుకున్నారనేది ఇక్కడ ప్రస్తుతం కాదు… ఆయన సతీమణి గురించి ఏం తెలుసని చంద్రబాబు వ్యాఖ్యలు చేయాలి..? అసలు నాయకుల భార్యల్ని ఎందుకు రచ్చలోకి లాగడం..? నిజానికి కొన్ని ఫోటోలు కనిపిస్తాయి, తన సోదరి విజయలక్ష్మి చేతిలో బైబిల్‌ను ఏదో తాత్కాలికంగా స్వర్ణలత పట్టుకుని కనిపిస్తుంది అందులో, అంతేతప్ప ఆమె ఎప్పుడూ చేతిలో బైబిల్ పట్టుకుని తిరగదు…
హిందూ గుళ్లపై దాడులు వరుసగా జరుగుతున్నవేళ… ఆమె గుడికో గోమాత పథకం టీటీడీ ద్వారా ప్రారంభింపజేసింది… ప్రతి గుడికీ ఓ గోవు ఉండాలనేది ఆ స్కీమ్… హిందూ మతానికి జగన్ పాలన అరిష్టంగా మారింది అనే ప్రచారాలకు అది కొంతమేరకు విరుగుడుగా కూడా పనిచేసింది… ఆ స్కీమ్ మళ్లీ ఏమైందో తెలియదు, సుబ్బారెడ్డి జగన్ చెప్పినట్టు సూపర్ స్వామో కాదో తెలియదు, తన కక్కుర్తి యవ్వారాలూ ఇక్కడ అక్కర్లేదు… కానీ ఆయన భార్య మీద అవాకులు మాత్రం కరెక్టు కాదు చంద్రబాబూ…!!
Share this Article