శ్రీ వెంకటేశ్వర స్వామి లడ్డు తయారీలో వాడే నెయ్యిలో కల్తీ జరిగిందన్న వార్త దేశవ్యాప్తంగా, ఇంకా చెప్పాలంటే ప్రపంచ వ్యాప్తంగా ఉన్న హిందువులను దిగ్బ్రాంతికి గురిచేసింది. అన్ని పత్రికలు, టీవీ చానళ్లు ప్రత్యేక కథనాలు ప్రసారం చేస్తూనే వున్నాయి. అయితే శ్రీవారి ప్రసాదాలు, ముఖ్యంగా లడ్డు తయారు చేసే పోటులో (వంటశాల) కొన్ని ఘోరాలు జరుగుతున్నాయన్న విషయం ఇప్పుడు బయటకు పొక్కుతోంది.
ప్రసాదాల తయారీకి వాడే నెయ్యిలో జంతువుల నుంచి తీసిన నూనె కలుపుతున్నారన్న విషయం ల్యాబ్ పరీక్షలలో నిర్ధారణ కాగా, ఇదే విషయాన్ని ధృవీకరించే అంశాలు వెలుగు చూస్తున్నాయి. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రసాదాల తయారీకి దేవస్థానం ప్రధాన పోటు ఒకటి, దానికి అనుబంధంగా మరో పోటు రోజంతా అంటే 24 గంటలు పనిచేస్తుంటాయి.
వీటిలో ప్రతిరోజూ 3 నుంచి 4 లక్షల లడ్డూలు 40 పెద్ద పొయ్యిల మీద తయారు చేస్తారు. వీటికోసం ప్రతిరోజూ 400 నుండి 600 లీటర్ల నెయ్యి, 10 టన్నుల శెనగ పిండి, 10 టన్నుల చక్కెర, 700 కేజీల జీడిపప్పు, కిస్మిస్ 500 కేజీలు వాడుతారు.
2 ఏళ్లుగా నెయ్యి కల్తీ, నాసిరకం శెనగ పిండి:
—
గత రెండేళ్లుగా శ్రీవారి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడుతున్నట్లు పోటులో శెనగ పిండిని బూందీగా నెయ్యిలో వేయించి లడ్డూ తయారు చేసే వంటవారిలో ఒకరు తెలిపారు. “నెయ్యి కల్తీ అయ్యిందని మాకు తెలియడానికి ప్రధాన కారణం.. నెయ్యి గట్టి పడటం లేదు… అందులో పూస లేదు. బూందీ వేయించే టైంలో సాధారణంగా నెయ్యి నుంచి రావాల్సిన మంచి సువాసన గత రెండేళ్లుగా వాడుతున్న కల్తీ నెయ్యిలో రావడం లేదు.
Ads
ఈ విషయాన్ని మా పోటు పర్యవేక్షించే వ్యక్తికి, ఆ పైన వుండే షరాఫ్ కి ఎన్నోసార్లు చెప్పినా- అది అంతే.. మీ పని మీరు చేయండి అనేవారు”.
మరో అంశం- నెయ్యి ఒక్కటే కాదు శెనగ పిండి కూడా గత రెండేళ్లుగా కల్తీది వాడుతున్నారని బయటపడింది. “శెనగ పిండిలో మొక్కజొన్న (sweet corn), బఠాణి పిండి కలుపుతున్నట్లు అనుమానం వచ్చింది.
ఎందుకంటే, పిండి కల్తీ అవుతోంది అంటే లడ్డూకు పిండి కలిపేటప్పుడు మా అరచేతులలో మంటలు పుడతాయి. అలానే జరుగుతోంది”- అని తన పేరు వెల్లడించడాని ఇష్టం లేని పోటులో పనిచేసే ఒక ఉద్యోగి తెలిపారు. కల్తీ నెయ్యి తరువాత శెనగ పిండి కల్తీ గురించి, నాసిరకం జీడిపప్పు, కిస్మిస్ (ద్రాక్ష) పోటుకు పంపుతున్నారన్న విషయం పోటు పర్యవేక్షకుడి నుంచి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ వరకు అందరికి గత రెండేళ్లుగా పోటులో పనిచేసే వంటవారు, చిన్న స్థాయి ఉద్యోగులు చెబుతున్నా పట్టించుకోక పోగా, అలా విషయం బయటకు చెప్పిన వారిపై తీవ్రమైన చర్యలు తీసుకునే వారు.
“అన్నింటికంటే ఘోరం ఏమిటంటే, కరోనా సమయంలో 15 రోజులు పోటు మూసివేసి మళ్ళీ తెరిచిన తరువాత లడ్డూ తయారీకి పాత శెనగ పిండి వాడాల్సి వచ్చింది. అందులో పురుగులు ఉంటే వాటిని జల్లెడ పట్టి పిండి వాడాము. ఇంతకన్నా పాపం ఉంటుందా?” అని పోటులో పనిచేసే ఆ వంట ఉద్యోగి తీవ్రమైన తన బాధను వ్యక్తం చేసారు.
రామజన్మ భూమికి పంపిన లడ్డూల మాట:
—
“రామజన్మ భూమికి పంపిన లడ్డూల విషయంలో మాత్రం జాగ్రత్త పడ్డారు. హైదరాబాద్ నుంచి 15 కిలోల డబ్బాలు ఒక్కొక్కటి 38 వేలు పెట్టి మంచి క్వాలిటీ నెయ్యి తెచ్చారు. శెనగ పిండి కూడా స్పెషల్ గా తెచ్చారు. దాదాపు 3 లక్షల లడ్డూలు స్వచ్ఛమైన నెయ్యితో చేసి పంపాము. అందులో సందేహం లేదు”
అయితే ఈరోజున వెలుగు చూసిన కల్తీ బాగోతం వెనుక గత ప్రభుత్వంలో టీటీడీ బోర్డు చైర్మన్ గా పనిచేసిన ఒక తిరుపతి వాసి, అయన కుమారుడు, చంద్రగిరి మాజీ శాసనసభ్యుడిగా పని చేసిన మరో వ్యక్తి, ఆయన కుమారుడు, ఇంకా ప్రధానంగా మొన్న మొన్నటి వరకు ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గా పనిచేసిన అధికారికి ప్లస్ ఈ కల్తీ నెయ్యి, నాసిరకం శెనగ పిండి, జీడిపప్పు, కిస్మిస్ (ద్రాక్ష) సరఫరా చేసిన కాంట్రాక్టర్లు, వారి మధ్యవర్తులకి మధ్యన జరిగిన అనేక చీకటి ఒప్పందాలు తద్వారా చేతులు మారిన కోట్లాది రూపాయల భక్తుల సొమ్ము గురించి ఇప్పుడు తెలుసుకున్న హిందూ భక్తులకి తీరని వేదన, బాధ, మనస్తాపం కలిగిస్తున్నాయి…. – BVS భాస్కర్, సీనియర్ జర్నలిస్ట్
Share this Article