కంగనా రనౌత్ మళ్లీ వార్తల్లోకొచ్చింది… ఎహె, నాకు కాస్త మెంటల్ టైపు కదా… అసలు వార్తల్లోకి రాని రోజు ఏముంది..? తాజాగా గాంధీ మంచి భర్త కాదు, మంచి తండ్రి కాదు, కానీ మంచి లీడర్ అయ్యాడు, మగాడు కాబట్టే కదా అని ఓ ట్వీట్ పారేసుకుంది… ఆయ్ఁ బుద్దుందా, సిగ్గుందా, శరముందా, గాంధీని అంత మాటంటావా అని బోలెడు మంది తిట్టిపోస్తున్నారు… నిజానికి గాంధీ ఓ రాత్రి పెళ్లాన్ని బయటికి గెంటేయడం నిజమే… మంచి భర్త, మంచి తండ్రి అయి ఉండాలనేముంది మంచి లీడర్ కావడానికి..? అదీ నిజమే… సరే, ఆ రచ్చలోకి మనమెందుకులే గానీ… ఇది మరో వార్త.,. ఇది కూడా ప్రజెంట్ ట్రెండింగ్ టాపిక్ సారంగదరియా పాట టైపే… సారంగదరియా వివాదం ఏం నేర్పింది..? తరాలుగా పాడుకునే జానపద గీతం అయినా సరే, ఎవరు టీవీలో ముందుపాడితే ఇక వాళ్లవే రైట్స్… అందులో నాలుగు పదాలు వాడుకున్నా సరే, మేమే పాడాలి, వేరేవాళ్లు పాడటానికి వీల్లేదు… సేమ్… తరతరాలుగా జనం నోళ్లలో నానే చరిత్ర అయినా సరే… ఎవరైనా ఓ పుస్తకం రాసిపడేస్తే చాలు, ఇక తనవేనట మొత్తం రైట్స్… అదెలా అనడక్కండి… అలా అడిగితేనే పోలీసులకు కంగనా మీద కేసు పెట్టిపడేశారు…
దిడ్డా… ఈమె కాశ్మీర్‌ను పాలించిన రాణి… మంచి ఫైటర్… ఆమెది జనం అనేక ఏళ్లుగా చెప్పుకునే ఓ వీర చరిత్ర… జానపద గీతాల్లో, కథల్లో ఆమె గురించి చెప్పుకుంటారు… అశిష్ కౌల్ అనే రచయిత ఓ పుస్తకం రాశాడు… అంతే… ఇక మొత్తం ఆమె జీవితచరిత్ర మీద తనకే రైట్స్ వచ్చాయట… దిడ్డా మీద ఎవరు సినిమా తీసినా, టీవీ సీరియల్ తీసినా తనకు డబ్బులివ్వాల్సిందేనట… అసలు ప్రజలందరి సొత్తు అయిన ఒక రాణి చరిత్ర మీద ఇష్టమొచ్చినట్టు రాయడానికి తనకున్న రైట్స్ ఏమిటి..? ఇప్పుడు విషయం ఏమిటంటే… కంగనా ఆ రాణి మీద సినిమా తీయాలని సంకల్పించింది… మణికర్ణిక, తలైవి సినిమాల హ్యాంగోవర్ కదా… ఆమధ్య ఓ ప్రకటన కూడా చేసింది… దాంతో ఈ అశిష్ కౌల్‌కు కోపమొచ్చింది… ఠాట్, ఆమె చరిత్ర నువ్వెలా తీస్తావ్ అని మోకాలడ్డం పెట్టాడు…
Ads
‘‘నేను ఇంతకుముందు రనౌత్‌ను అప్రోచయ్యాను… కథలోని కొన్ని భాగాల్ని మెయిల్ చేశాను… కానీ నాకు తెలియకుండానే ఆమె సినిమా నిర్మాణం ప్రకటన చేసేసింది… దుర్మార్గం, నా కాపీ రైట్ హక్కుల ఉల్లంఘన…’’ అంటూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు… ఎహెఫో, నేను తీసే కథ వేరు, నీ పుస్తకంలోని భాగాలు నాకెందుకు..? నువ్వేం రాశావో నాకెందుకు..? అని కంగనా తనకు రిప్లయ్ కూడా ఇచ్చిందట… ఓహో, ఉండు, నీ కథ చెబుతాను అనుకున్న సదరు రచయిత బాంద్రా మేజిస్ట్రేట్ కోర్టును ఆశ్రయించాడు… యువరానర్, ఈ కథాచోరిణి మీద 156(3) సీఆర్పీసీ కేసు పెట్టేయండి అనడిగాడు… సరే, వోకే అనేసింది కోర్టు… కోర్టు చెప్పాక ఆగేదేముంది..? ఖర్ పోలీసులు 406, 415, 418, 120(బి), 34, కాపీ రైట్ చట్టంలోని 63, 63ఏ, 51 ఎట్సెట్రా సెక్షన్లన్నీ పెట్టేశారు… ఒక్క కంగనా మీదే కాదు… తన సోదరి రంగోలి, సోదరుడు అక్షత్, కమల్ కుమార్ జైన్ అనబడే మరో వ్యక్తినీ కేసులో పేర్కొన్నారు… అసలు ఒక చరిత్ర మీద పుస్తక రచయితలకు ఉండే రైట్స్ ఏమిటి..? ఎవరూ అడగొద్దు… లేదంటే మరో నాలుగు సెక్షన్లు అదనంగా పెట్టేస్తారు…!! నిజానికి ఆ రాణి గురించి మొదట పుస్తకం రాసింది కల్హణుడు..! పుస్తకం పేరు రాజతరంగిణి..!!
Share this Article