తిరుపతి లడ్డు వివాదం .. సమాధానం చెప్పవలసింది ఎవరు?
సీఎం చంద్రబాబు గారు ఆరోపణలు చేశారు. వారి మిత్రపక్షం బీజేపీ నేషనల్ మీడియాలో బాగా కవరేజి వచ్చేలా చూసింది. బీజేపీ యువజన విభాగం తాడేపల్లిలోని జగన్ ఇంటి మీద కాషాయ రంగు ద్రవం ఉన్న ప్యాకెట్లు విసిరింది. భోపాల్ లాంటి చోట్ల జగన్ దిష్టిబొమ్మలు తగలపెట్టారు…. ఇంక విచారణతో కానీ నిర్ధారణతో కానీ సంబంధం లేకుండానే రెండు వైపులా ఒక అభిప్రాయానికి వచ్చేసారు..
అయితే ఈ గొడవ మొత్తంలో ఐదేళ్లపాటు టీటీడీ EO గా పనిచేసిన ధర్మారెడ్డి గారు ఎక్కడా కనిపించలేదు. అసలు ఆయన ఇప్పుడు ఎక్కడ ఉన్నాడో ?
Ads
జగన్ మోహన్ రెడ్డికి ప్రజలు పట్టం కడితే జగన్ ప్రజలకు జవాబుదారీతనం లేని , రాజకీయ బాధ్యత లేని అధికారులకు పాలనా పగ్గాలు ఇచ్చారు. ఆ అధికారులకు ఒకటే తెలుసు సీఎం గారికి నొప్పి కలగ కూడదు. సీఎంకు ఇష్టం లేని, నచ్చని విషయాన్ని చెప్పకూడదు, రూల్ బుక్ గురించి ప్రస్తావించకూడదు … ఇదే ఐదేళ్ల పాలనలో జరిగింది. మంత్రులు ఎమ్మెల్యేలు ఎంత పోరాడినా నియోజకవర్గానికి కావలసిన ఒక్క ప్రాజెక్ట్ కానీ అభివృద్ధి పనులు కానీ , తాగునీరు పథకాలు కానీ సాధించుకోవడంలో విఫలం అయ్యారు. అంతిమంగా ఎన్నికల్లో ఓడిపోయి రాజకీయంగా నష్టపోయారు..
ఎన్నికల ఫలితాల తరువాత ఓడిపోయిన ఎమ్మెల్యేలు ఏ అధికారి మీద అయితే ఆరోపణలు చేశారో ఆయన 30-May-2024 అంటే ఫలితాలకు నాలుగు రోజుల ముందు రిటైర్ అయ్యారు. గత ఐదేళ్ళలో ఆ స్థాయిలో విమర్శలు ఎదుర్కున్న మరో అధికారి టీటీడీ ఈవో ధర్మారెడ్డి గారు.
దర్శనాల కోసమో లేక తిరుమలలో మరో అవసరంతోనో పలు మార్లు ఫోన్ చేసినా ఆయన ఎత్తరు , మళ్ళీ కాల్ బ్యాక్ చేయరు అని పలువురు ఎమ్మెల్యేలు అప్పట్లోనే ఆరోపించారు. సీఎం దగ్గర ఎన్నిసార్లు పంచాయితీ జరిగినా ఆయన వైఖరిలో మార్పు లేదు, EO గా ఉండటానికి అసలు ధర్మారెడ్డి అర్హత ఏంటి అని కూడా కొందరు ప్రశ్నించారు.
టీటీడీ ఈవోగా సహజంగా ఐఏఎస్ అధికారిని నియమిస్తారు. కానీ Indian Defence Estates Service (IDES) కు చెందిన ధర్మారెడ్డికి జగన్ ఈవో గా ఐదేళ్లు అవకాశం ఇవ్వటం మీద వైసీపీలోనే వ్యతిరేకత వచ్చింది. టీటీడీ అంటే ధర్మారెడ్డి జాగీర్ అన్నట్లు నడిచింది..
సరే ,ఇప్పుడు టీటీడీ లడ్డుకు వాడే నెయ్యి మీద ప్రస్తుత సీఎం ఆరోపణలు చేశారు. ఆరోపణల మీద మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి సమాధానం చెప్పి కొన్ని సవాళ్లు విసిరారు.. కానీ టీటీడీలో తప్పు జరిగితే మొదటి ముద్దాయి ఈవో అవుతారు చైర్మన్ రెండో బాధ్యుడు అవుతారు , ఆరోపణల మీద సమాధానం చెప్పవలసింది నాటి ఈవో ధర్మారెడ్డి , కానీ ఆయన ఎక్కడా కనిపించలేదు.
ఐదేళ్లుగా డెప్యుటేషన్ మీద ఆంధ్రా సర్వీస్ లో ఉన్న ధర్మారెడ్డిని జూన్ 30 వరకు ఎక్సటెన్షన్ ఇవ్వమని ఏప్రిల్ లో కేంద్రాన్ని కోరగా దానికి కేంద్రం అంగీకరించింది. బాబుగారు సీఎం అయిన తరువాత తొలిసారి తిరుమలకు వెళ్లే ముందు ధర్మారెడ్డిని శెలవు మీద వెళ్ళమని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదేశించారు, ధర్మారెడ్డి సెలవు మీద వెళ్లారు. జూన్ 30తో ఎక్సటెన్షన్ ముగియటంతో సొంత క్యాడర్ అంటే Indian Defence Estates Serviceలో చేరి ఉండాలి, కానీ ఆ సమాచారం దొరకలేదు.
ధర్మారెడ్డి ఇప్పుడు ఏ పోస్టులో ఉన్నా తను నిన్నటి వరకు నిర్వహించిన పోస్ట్ తాలూకు నిర్ణయాల మీద ముఖ్యమంత్రే ఆరోపణలు చేసినప్పుడు బయటకొచ్చి స్పందించాలి. జగన్ కన్నా మాకు ఏది ఎక్కువ కాదు అని ఐదేళ్లు మాట్లాడిన అధికారులు ఇప్పుడు ఉద్యోగ నియమావళి పేరుతో తెర వెనుక ఉండిపోవటం మీద జగన్ ఊరుకున్నా కోర్టు ఊరుకోదు.. ఆరోపణలకు సమాధానం ఎవరు చెప్పాలన్న విషయం వద్దనే విచారణ మొదలవుతుంది .
ప్రజలకు ప్రత్యక్ష జవాబుదారులైన మంత్రులు ఎమ్మెల్యేలను కాదని అధికారులకు అపరిమితమైన అధికారాలు ఇవ్వటం ఎలాంటి నష్టం చేకురుస్తుందో ఇలాంటివి చూస్తే అర్ధం అవుతుంది……… (శివ రాచర్ల)
Share this Article