ఒకాయన… ఓ శాటిలైట్ టీవీ ఎండీ… ప్రఖ్యాత జర్నలిస్టు… పాడివిప్లవ పితామహుడు వర్గీస్ కురియన్ రేంజులో ఓ లెక్క చెబుతున్నాడు… చెప్పేవాడికి వినేవాడు లోకువ…
‘ఒక లీటర్ నెయ్యి తయారు చేయాలంటే 20 లీటర్ల పాలు అవసరమండీ… అవీ ఆవు పాలు కావాలండీ… బర్రె పాలు కాదు, ఆవు పాలు కావాలి… ఇప్పుడు పాలు లీటర్ ధర 75 రూపాయలుంది… సరే, నేరుగా రైతుల నుంచి 50 చొప్పున తీసుకున్నా 1000 రూపాయలు… తయారీకి 200 అవుతుంది.., ట్రాన్స్‌పోర్టుకు మరో 200 అవుతుంది.., లోడింగ్, అన్‌లోడింగ్‌కు, ఇతరత్రా ఖర్చులు మరో 100… అంటే 1500 మొత్తం…
మరి వీళ్లు అంత తక్కువ ధరకు నెయ్యి ఇలా ఇచ్చారండీ, వీళ్లకేమైనా రూపాయికి లీటర్ పాలు దొరుకుతున్నాయా..? మరి ఏం కలిపి అపవిత్రం చేస్తున్నారండీ… జంతువుల కొవ్వు నూనె 100, 150 ఉంటుంది, అది కలుపుతున్నారు…’’ ఇలా సాగిపోయింది సదరు టాల్కమ్ పౌడర్ జర్నలిజం…
Ads
అఫ్‌కోర్స్, పెద్ద చానెళ్లన్నీ అలాగే ఏడ్చాయి… కనీస జ్ఞానం లేకుండా,, జనం నవ్వుతారనే సోయి కూడా ఉండదు… నిజానికి టీటీడీ ఈవో శ్యామలరావు వాదనా అదే… ఏఆర్ కంపెనీ వాడు అంత ధర తక్కువకు ఎలా సప్లయ్ చేయగలడనే అనుమానం వచ్చాకే ఎన్‌డీడీబీ ల్యాబ్‌కు శాంపిళ్లు పంపించారట… వీళ్లు తిరుమలను ఉద్దరిస్తారుట… (ఒకవైపు కొవ్వు నూనెలు వాడలేదు అంటూనే శాంతి హోమాలు, సంప్రోక్షణలు… తప్పే జరగనప్పుడు ప్రాయశ్చిత్తం ఏమిటయ్యా మహానుభావా..? పైగా భక్తులు క్షమ మంత్రం పఠిస్తే ఆ అపచారం ప్రక్షాళన అవుతుందట…)
మరోవైపు లోకేష్ అంటున్నాడు… టీటీడీకి స్వయంప్రతిపత్తి ఉంది… సీఎం జస్ట్, ఈవోను అపాయింట్ చేస్తాడు, అంతే, ఇక మొత్తం ఈవో చూసుకుంటాడు అని… అవునా..? నిజమేనా..? మరి జగన్ ఏం తప్పు చేసినట్టు..? ఈవో ధర్మారెడ్డి కూడా శిక్షార్హుడు అయ్యేది… సో, ఇలా మొత్తం వ్యవహారాన్ని కంపు పట్టించారు… యానిమల్ ఫ్యాట్ కలిపిన నెయ్యి వాసనలాగే..!
సరే, సదరు నెయ్యి ధరకు వద్దాం… మన ఇంట్లో కేజి నెయ్యి తయారు చేయాలంటే పాలన్నీ తోడేసి… పెరుగును మజ్జిగ చేసి… దాన్ని చిలికి… వెన్న తీసి… అప్పుడు నెయ్యి చేసుకుంటాం. కానీ భారీ స్థాయిలో నెయ్యి ఉత్పత్తి చేసే మిల్క్ ప్రాసెసింగ్ ప్లాంట్లు నెయ్యి ఉత్పత్తిని అలా చేయవు కదా… పాడి రైతుల నుంచి అస్సలు నీళ్లు కలపని, ఫుల్ ఫ్యాట్ (క్రీమ్) మిల్క్ సేకరిస్తారు. నెయ్యి కోసం ముందుగానే క్రీమ్‌ను పాల నుంచి వేరు చేస్తారు…
ఇక మిగిలిన పాలను పారబోస్తారా? లేదు కదా… క్రీమ్ తీసేసిన మిల్క్‌నే ‘లోఫ్యాట్ మిల్క్’ పేరుతో డైలీ లీటర్ రూ.70 ధరకు మనకు అమ్మేయడం లేదా. ? క్రీమ్ తీసినా.. పాల ధర మాత్రం తగ్గలేదు… అందుకే భారీ స్థాయిలో నెయ్యి ఉత్పత్తి, హోల్ సేల్ అమ్మకంలో ధర రూ.400 అయినా వారికి వచ్చే నష్టమేమీ లేదు. కాబట్టి… ఇంట్లో తయారు చేసే నెయ్యి ధరను… ఆ నందినినో… ఏఆర్ డెయిరీనో తయారు చేసే నెయ్యి ధరతో పోల్చాల్సిన అవసరం లేదు…
పాలను ఒక్క చుక్క కూడా వృథా చేయవు కంపెనీలు… అందుకే హెరిటేజ్ నెయ్యి ధర కూడా చవుకే… అలాగని అందులో కొవ్వు నూనెలు కలుపుతున్నారని అనలేం కదా… (చివరకు యెల్లో చానెళ్లు తాము చేసేది హెరిటేజ్ బాస్ భజనే అనే విషయాన్ని కూడా మరిచిపోతున్నాయి అప్పుడప్పుడూ…) ఇదుగో హెరిటేజ్ రేట్… (మార్కెట్‌లో హెరిటేజ్ నెయ్యికి మంచి పేరే ఉంది…)
అలాగని ఏఆర్ కంపెనీ శుద్దపూస అని, ధర్మారెడ్డి పాలనలో అంత సజావుగానే జరిగిందీ అని ఇక్కడ సర్టిఫికెట్ ఇవ్వడం లేదు… పెద్ద తలకాయల ‘కైంకర్యాల’ విలువ పెరిగే కొద్దీ నెయ్యి ఇలాగే కొవ్వులతో కంపు కొడుతుందని సగటు భక్తుడి సందేహం… నెయ్యి ధరలపై పిచ్చి వాదనల్ని చెప్పడమే ఈ కథన ఉద్దేశం… అంతే తప్ప తప్పు జరిగిందనో, జరగలేదనో తేల్చడం లేదని గమనించ మనవి… అది నిష్పాక్షిక విచారణ మాత్రమే తేల్చగలదు… ఆ విచారణ జరుగుతుందనే విశ్వాసమే లేదు..!!
Share this Article