సీతక్క ఇక్కడ!
—————-
బాంబేలో పొద్దున ఇంట్లో టిఫిన్ చేసి మధ్యాహ్నం దుబాయ్ లో మీటింగ్ లోనే భోంచేసి, రాత్రి భోజనం మళ్లీ బాంబే ఇంటి బాల్కనీలో ఎగసిపడే అరేబియా అలలను చూస్తూ తినగలిగే సంపన్నులున్న దేశంలోనే- ఇల్లు కాలితే కష్టం చెప్పుకోవడానికి అయిదు కిలోమీటర్లు నడిచినా నరమానవుడు కనపడని నిరుపేద నివాసాలూ ఉంటాయి. అడవుల్లో, కొండ ప్రాంతాల్లో బతుకు ప్రతి క్షణం పోరాటమే. ఆధునిక రవాణా సౌకర్యాలు, సమాచార సాంకేతికతకు దూరంగా ఉన్న గిరిజన తండాలు ఇప్పటికీ లెక్కలేనన్ని. అనాదిగా కొండల్లో, కోనల్లో, అడవుల్లో అలవాటుపడ్డ ఆ జీవితాలకు మైదాన ప్రాంతాల్లో ఏదో తెలియని గజిబిజి కనిపిస్తుంది. సంవత్సరంలో రెండ్రోజుల రిసార్ట్ ఆటవిడుపు, ఎకో టూరిజం చుట్టపు చూపు సందర్శనలకు వెళ్లేవారికి కొండా కోనలో గుడారాలు వేసుకుని గుడ్డి దీపం వెలుగులో ఆరుబయట బార్బిక్యూర్ నిప్పుల్లో చికెన్ తినడం మజాగానే ఉంటుంది. జీవితమంతా ఆ కొండా కోనల్లోనే ఉంటే- అప్పుడు తెలుస్తుంది బతుకు అడవిపాలు, అరణ్యరోదన, ఆటవిక న్యాయం…అంటే ఏమిటో.
Ads
ములుగు ఎమ్మెల్యే సీతక్క నేపథ్యమంతా ఆ కొండా కొనలే. పెరిగింది, తిరిగింది ఆ అడవుల్లోనే. గిరిజన నియోజకవర్గ ప్రతినిధిగా ఆమె వ్యవహార శైలి కూడా ప్రత్యేకం. పల్లెలో ఇంటిపక్కన సగటు మహిళలా ఆత్మీయంగా మాట్లాడుతుంది. వామపక్ష భావజాలం నుండి నాయకురాలిగా ఎదిగింది కాబట్టి- ఇప్పటికీ ఆడంబరాలకు దూరంగా తన ప్రజలకు చేయగలిగింది చేస్తోంది. కరోనా సమయంలో నెత్తిన నిత్యావసరాల మూటలు మోస్తూ రోజుకు పదిహేను కిలో మీటర్లు కాలినడకన వెళ్లి అవసరమయినవారికి అందజేసింది. తాజాగా ఒక గిరిజన గూడెంలో మూడిళ్లు అగ్నికి ఆహుతి అయి కట్టుబట్టలు కూడా మిగల్లేదు. విషయం తెలుసుకున్న సీతక్క బట్టలు, దుప్పట్లు, కొంత నిత్యావసరాలు సేకరించి మూటలుకట్టి నెత్తిన పెట్టుకుని తన అనుచరులతో వెళ్లి వారికి అందజేసింది. ధైర్యం చెప్పి వచ్చింది. బస్సులు, కార్లు, చివరికి బైకులు కూడా వెళ్లలేని వారిదగ్గరికి ఆమె నడిచి వెళ్లిన వార్త చూడటానికి చిన్నదే కావచ్చు. కానీ నిజానికి చాలా పెద్ద భావం… ఆదర్శాలు చెప్పే పెదవులకన్నా, సాయం చేసే చేతులు ఎప్పుడూ గొప్పవే. అక్కడక్కడా ఇంకా సీతక్కలు ఉన్నారు. ఉండాలి…. అబ్బే, అంతా పబ్లిసిటీ స్టంట్ అని కొట్టిపారేసే నోళ్లూ ఉంటయ్… కానీ వాళ్లు ఒక్క ఎమ్మెల్యే ఇలా జనంలోకి, జనం కోసం వెళ్లే ఫోటో ఒక్కటి చూపించరు… పోనీ, ఆ పబ్లిసిటీ కోసమైనా ఓసారి ఆ గుట్టల్లో, తుప్పల్లో, వాగుల్లో నడుస్తున్న ఒక్క ఫోటో ప్లీజ్….... By… -పమిడికాల్వ మధుసూదన్
Share this Article