రెండు జేబులు గీకితే గీకితే 120 వరకూ కనిపించాయి… పది రూపాయల కాయిన్ ఒకటి… ఫోన్‌పేలు, గూగుల్‌పేలు పనిచేయవు కదా… బ్యాంకు ఖాతాలు ఏనాడో అడుగంటాయి… నాలుక పీకుతోంది… ఓ థర్డ్ క్లాస్ బార్… కాదు, వైన్స్‌కు అనుబంధంగా ఉండే పర్మిట్ రూమ్… నిజానికి అది ఒకప్పుడు కల్తీ కల్లు దుకాణం… లోనికి వెళ్లాను…
పేరుకే పర్మిట్ రూమ్… 400, 500 వరకూ కూర్చోవచ్చు… ఇక సమీపంలో బార్లు ఎలా నడుస్తాయి… పైన షెడ్డు, ఆరేడు స్నాక్స్ దుకాణాలు… మన బడ్జెట్‌కు ఏదో చీప్ లిక్కర్… ఓ మూలకు వెళ్లి కూర్చున్నా… ఓ గ్లాసు, ఓ వాటర్ బాటిల్, ఓ క్వార్టర్ బాటిల్, నేను… మందిలో ఒంటరితనం నాకు అలవాటే…
మళ్లీ ఎప్పుడు క్వార్టర్ కొట్టగలనో తెలియదు… ఒక్కో గుక్క, కాదు, ఒక్కో సిప్పు ఆస్వాదిస్తున్నా… ఒకాయన వచ్చాడు… ఖరీదైన టీ షర్ట్… ఆశ్చర్యంగా చూస్తున్నా… ఎదురుగా కూర్చున్నాడు… వేరే చోట ఖాళీ లేదు… ఓ గ్లాస్, ఓ చిన్న సోడా సీసా… తెల్లగా ఓ సీసా… ఓ పెగ్గు పోసుకున్నాడు, మందు తాగేదగ్గర మొహమాటాలేముంటాయ్..? ఆ బ్రాండ్ ఏమిటి బ్రదర్ అనడిగా…
Ads
ఇచ్చాడు… బ్లాక్ అండ్ వైట్ క్వార్టర్… మంచి ఖరీదైన స్కాచే… ఈ కల్లు కంపౌండులో ఈ బ్లాక్ అండ్ వైట్ ఆసామీ ఎవరన్నట్టు ఆశ్చర్యంగా చూశాను అతని వైపు… ఈలోపు డబుల్ ఎగ్ హాఫ్ బాయిల్డ్ ఆమ్లెట్ తెచ్చిపెట్టాడు ఒకాయన… స్కానర్‌తో సహా… స్మార్ట్ ఫోన్‌తో పే చేశాడు… కాస్త కట్ చేసి తీసుకో అన్నాడు…
వద్దు, నా 10 రూపాయల బాయిల్డ్ పల్లీ ఉంది అన్నాను… పర్లేదు అన్నాడు… చూడబోతే రిచ్చులా ఉన్నారు, ఇదేమిటి..? ఈ అన్ హైజినిక్, రద్దీ, గోల… నడుమ ఈ బ్లాక్ అండ్ వైట్ ఏమిటీ అన్నాను… కూడదీసుకుని… అసలే డబ్బు చేసిన ఆసామీ కదా… నవ్వాడు…
నాకు నచ్చిన బ్రాండ్ విస్కీ… బ్రాండెడ్ వాటర్ బాటిల్… ప్లాస్టిక్ గ్లాస్… నాకు ఇష్టమైన హాఫ్ బాయిల్డ్… పెద్ద బార్‌కు వెళ్లినా, ఇవే ఆర్డర్ ఇచ్చినా… ఆ సీసాల్లో నుంచే కదా సోడా పోసేది, మందు పోసేది… ఫైవ్ స్టార్ బార్ అయినా అంతే, ఈ పర్మిట్ రూమ్ అయినా అంతే… తేడా ఏముంది..? హైజినిక్ అనేది ఓ భ్రమ… ఏం… వీళ్లంతా చచ్చిపోతున్నారా ఏం..? అన్నాడు… నా ముందున్న గ్లాస్ క్లీన్, సీసా నాదే… వాటర్ బాటిల్ నాదే… ఇక గలీజుతనం ఏముంది అన్నాడు… ఆమ్లెట్ కూడా పేపర్ ప్లేటులో అని చూపించాడు…
బ్లాక్ అండ్ వైట్‌తో ఏం మాట్లాడగలమ్… మనదసలే ఆఫీసర్స్ చాయిస్… కానీ ఈ విస్కీ ఇక్కడ దొరకదు కదా… మహా అయితే సిగ్నేచర్ బ్లూ దొరికితే ఎక్కువ కదా అన్నాను… హహహ… నవ్వాడు… కాస్త దూరంలో కారు ఆపేసి వచ్చా… అందులో ఐదారు స్కాచ్ క్వార్టర్లు ఉంటాయి అన్నాడు…
మరి ఈ కారులోనే కూర్చుని, ఏసీ వేసుకుని, ఎఫ్ఎం వింటూ… స్మార్ట్ ఫోన్‌లో రీల్స్ చూస్తూ సిప్ చేయొచ్చు కదా అన్నాను ధైర్యంగా… నిజంగా అదొక ప్రపంచంలోకి వెళ్లొచ్చుకదా గంటసేపు అన్నాను… అలా ఒంటరిగా మందు కొడితే ఏం థ్రిల్..? ఇదుగో ఇక్కడ చూడు… చుట్టూ ఎంత హడావుడి, అల్లరి, గోల, స్పీడ్, లైఫ్… ఏవో కష్టాలు, బెదిరింపులు, బూతులు, మనస్సులు పెటేల్‌మని భళ్లుమని బద్ధలయ్యే అనుభవాలు… ఎన్ని వింటున్నా…
ఒక్కడినే నాలుగు కాజు ముక్కలు నములుతూ నామానాన మందు సిప్ చేస్తే… ఏముంది మజా..? నలుగురు దోస్తులు పిలిచి ఇంట్లోనే పార్టీ పెట్టుకుంటే… అంతా ఆర్టిఫిషియల్ కదా… అర్థమైందా అన్నాడు… నిజం చెప్పొద్దూ… ముక్క కూడా అర్థం కాలేదు… సర్, నేనిక వెళ్లొస్తా అన్నాను… జిహ్వకో రుచి… కాదు, బుర్రకో రుచి…!!
ఆశ్చర్యంగా చూస్తూ ఓ మాటన్నాను… మరి ఇలా తాగకపోతే ఏమైంది అని…? ఈసారి కాస్త బిగ్గరగానే నవ్వుతూ… అదే నేనూ అడుగుతున్నాను నిన్ను… మరి తాగకపోతే నీకూ ఏమైంది అని…! ఆఫీసర్స్ చాయిస్ అర్థం కానివ్వలేదు… ఆ స్కాచ్ వైపే చూస్తూ బయటికి నడిచాను… తను చిరునవ్వుతో నావైపు చూస్తూనే ఉన్నాడు…!! ( అజ్ఞాతి)
Share this Article