ఐయామ్ ఎ డిస్కో డ్యాన్సర్
ఐయామ్ ఎ డిస్కో డ్యాన్సర్
జిందగీ మేరా గాన
ఈ పాట రాగానే ధియేటర్లో పూనకాలు లోడింగ్
ఆ పూనకాలు తెచ్చుకున్నవాడిలో నేనూ ఒకడ్ని
డిస్కో డ్యాన్సర్
విజయవాడ శాంతి ధియేటర్లో వచ్చింది
మామూలుగా మనకూ హిందీకి ఆమడ దూరం
అప్పట్లో హిందీ ట్రై చేద్దామని సెకండ్ లాంగ్వేజ్ హిందీ తీసుకుని అదృష్టవశాత్తూ స్టాంపు మార్కులతో బయటపడ్డా
హిందీకి పాస్ మార్కులు ఇరవై మాత్రమే అవడం నా అదృష్టం కాక ఇంకేవిటి?
నాకు హిందీ నేర్పాలని ప్రయత్నించి మా హిందీ మాస్టారు నాగేశ్వర రావు గారు హిందీతో పాటు తెలుగు కూడా పూర్తిగా మర్చిపోయారు
అలా ఉండేది మన హిందీ పాండిత్యం
సరే ఇప్పుడు విషయానికి వస్తే ,
శాంతి ధియేటర్లో డిస్కో డ్యాన్సర్ రిలీజ్ అయ్యింది
ఆ కుర్రాడెవరో మిథున్ చక్రవర్తి అంట
అసలు మైకేల్ జాక్సన్ ఎందుకు పనికొస్తాడు
Ads
సినిమా మొత్తం ఒక్కడే ఊపేశాడు
అనే టాకు ఆ నోటా ఈ నోటా నా చెవిన పడింది
ఎలాగైనా సినిమా చూడాలని బలంగా పడిపోయింది
మరి హిందీ సంగతెలా అని సంశయం లో ఉండగా
ఈ సినిమాకి అసలు భాషతో సంబంధం లేదు
ఆ పాటలు
ఆ మ్యూజిక్కు
అవే మ్యాజిక్కు
అని తోటి పిల్లగాళ్ళు రెచ్చగొట్టటంతో అందరం కలిసి సినిమాకి వెళ్లాం
థియేటర్లలోకి వెళ్ళామా
అంతే ,
ఏదో ట్రాన్స్లోకి వెళ్ళిపోయాం
ప్రతి ఫ్రేమ్ లోనూ మిథున్ చక్రవర్తిని కళ్ళార్పకుండా చూస్తూ ఉండిపోయాం
ఎంతలా అంటే
ఒక్క క్షణం మిథున్ అలా పక్కకెళ్తే మళ్ళీ సీన్ లోకి ఎప్పుడొస్తుస్తాడా అని కళ్ళల్లో పెట్రో మాక్స్ లైట్లు వేసుకుని చూసేంత
ఐ యాం ఎ డిస్కో డ్యాన్సర్ అని గిటార్ పట్టుకుని మిథున్ పాట అందుకోగానే ఇక్కడ ధియేటర్లో వందలాది గొంతుకలు కోరస్ కలిపాయ్
ఈలలు గోలలూ
ఒక్కడూ కుర్చీల్లో లేరు
నిలబడి పూనకాలు తెచ్చుకుని ఊగిపోతున్నారు
సడెన్ గా
యాద్ ఆ రహా హే అని టోన్ మార్చగానే అందరిలో ఉత్కంఠత
ఇక పాడలేను అని మిథున్ చక్రవర్తి నిస్సహాయంగా చూస్తుంటే
జిమీ జిమీ ఆజ ఆజా అని హీరోయిన్ అందుకుని పాడుతుంది చూశారూ
కర్చీఫులు తడిసిపోయాయ్
ఎంతలా అంటే ధియేటర్లో అందరం నిల్చుకుని కమాన్ మిథున్ కమాన్ అంటూ డాన్స్ చెయ్యమని కన్నీళ్ళతో వేడుకునేంత
అసలా పాటలేంటి
ఆ డ్యాన్స్ లేంటి
అదరహో
బప్పీ లహరి మ్యూజిక్ తో చింపేసాడు
దానికి తోడు మిథున్ మ్యాజిక్ సినిమాని మా విజయవాడ లాంటి నాన్ హిందీస్ ఎక్కువగా ఉన్న చోట కూడా వంద రోజులు దాటించేసి సూపర్ డూపర్ హిట్ చేసేసింది
ఆనాడు యావత్తు ప్రపంచాన్ని తన పాటలతో ఉర్రుతలూగించిన ఆ కుర్రాడు మిథున్ చక్రవర్తి కి తన 74 వ ఏట దాదా సాహెబ్ ఫాల్కే అవార్డ్ వచ్చిన సందర్భంగా అభినందనలు
పరేష్ తుర్లపాటి
హైదరాబాద్, కాచిగూడలో మహేశ్వరి, పరమేశ్వరి జంట థియేటర్లు… ఒక దాంట్లో అమితాబ్ ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్ నమక్ హాలాల్… మరో దాంట్లో ఈ డిస్కో డాన్సర్… పాటలకు తగినట్టుగా ఆరుతూ వెలుగుతూ లైట్లు డిస్కో పాటలకు… అప్పట్లో మామూలు సందడి కాదు కాచిగూడ చౌరస్తాలో…
Share this Article