ఎవరు నేర్పేరమ్మ ఈ కొమ్మకు పూలిమ్మనీ రెమ్మరెమ్మకు . ఇంత భావుకత కలిగిన పాట దేవులపల్లి కాక మరెవరు వ్రాస్తారు ?! యస్ రాజేశ్వరరావు , దేవులపల్లి , సుశీలమ్మ అలా దిగిపోతారు ఈ పాటలో . తగ్గట్టుగానే జయప్రదా నటించింది . 1977 లో వచ్చిన ఈ ఈనాటి బంధం ఏనాటిదో సినిమా ఈ పాట వలన కూడా పాపులర్ అయింది .
ఈ సినిమా కధ , స్క్రీన్ ప్లే అంతా నిర్మాత బాలయ్యదే . కృష్ణ – జయప్రద జోడీ బాగుంటుంది . విజయనిర్మల తర్వాత కృష్ణ అత్యధికంగా 45 సినిమాల్లో నటించింది జయప్రదతోనే . బహుశా మనలో చాలామందికి ఈ విషయం తెలవక పోవచ్చు . వీరిద్దరితో పాటు బాలయ్య , సత్యేంద్రకుమార్ , అల్లు రామలింగయ్య , సాక్షి రంగారావు , నాగభూషణం , రావి కొండలరావు , ఫటాఫట్ జయలక్ష్మి , పండరీబాయి , ఝాన్సీ , రాధాకుమారి ప్రభృతులు నటించారు .
సినిమా ఏవరేజ్ గా ఆడింది . కమర్షియల్ గా కూడా సక్సెస్ అయింది . దర్శకుడు కె యస్ ఆర్ దాస్ అయినా స్క్రీన్ ప్లే బాలయ్యది కావటం వలన స్క్రీన్ ప్లేలోనే మెతక ఉంది . దాన్ని బిర్రు చేసుకుని ఉంటే ఇంకా బాగా ఆడేదేమో !
Ads
సినిమాలో పాటలన్నీ బాగుంటాయి . బాలయ్య కూడా ఓ పాటను వ్రాసారు . ఎవరికి చెప్పేది ఏమని చెప్పేది అనే పాట . జయప్రద మీద చిత్రీకరించబడింది . సి నారాయణరెడ్డి వ్రాసిన నేననుకున్నది కాదు ఇది పాట కూడా శ్రావ్యంగా ఉంటుంది .
కొసరాజు వ్రాసిన నారసింహుడొచ్చెను వీధి నాటకం చాలా బాగుంటుంది . కృష్ణ చాలా చలాకీగా నటించారు . ఆయన వ్రాసిందే మరొక పాట మారింది జాతకం మారింది అనే పాట అల్లు రామలింగయ్య మీద చిత్రీకరించబడింది .అల్లు బాగా నటించారు ఈ పాటలో .
చూడబుల్ సినిమాయే . జయప్రద , కృష్ణ అభిమానులు చూసి ఉండకపోతే తప్పక చూడండి . యూట్యూబులో ఉంది . ఎవరు నేర్పేరమ్మ ఈ కొమ్మకు వీడియో మాత్రం అస్సలు మిస్ కావద్దు . తప్పక ఆస్వాదించవలసిన పాట . #తెలుగుసినిమాలసింహావలోకనం #తెలుగుసినిమాలు ….. (దోగిపర్తి సుబ్రహ్మణ్యం)
Share this Article