పాతాళభైరవి సినిమా టైటిల్స్ లో ప్లేబ్యాక్ అంటూ ఘంటసాల లీల జిక్కిల పేర్లు మాత్రమే పడతాయి.
మరి అందులో ప్రేమ కోసమై వలలో పడెనే పాపం పసివాడు పాట పాడిన వి.జె.వర్మ పేరుగానీ … ఇతిహాసం విన్నారా అన్న టిజి కమల పేరుగానీ వినవే బాలా అన్న రేలంగి పేరు గానీ కనిపించదు. ఎపి కోమల పేరు కూడా లేదు.
ఆరో తరగతిలో ఉండగా బెజవాడ రామ్ గోపాల్ లో రెండోసారి పాతాళభైరవి చూసినప్పుడు ఈ ప్రేమ కోసమై పాట ఎవరు పాడారో అనుకున్నా …
అప్పుడు తట్టిన సమాధానం ఎమ్మెస్ రామారావేమో అని …
అదే అడిగితే మా తెలుగు మాస్టారు శ్రీధర్ గారు కాదురా … వి.జె.వర్మ పాడారు అన్జెప్పారు.
ఈ వీజె వర్మ గారు ఎవరు అనే వివరాల కోసం ప్రయత్నించగా పెద్దగా ఏవీ దొరకలేదు …
Ads
అయితే ఎమ్మెస్ రామారావు గారి సంగీత దర్శకత్వంలో వి.జె.వర్మ పల్లెపడుచు సినిమాలో ఓ పాట పాడారని మాత్రం తర్వాత తెలిసింది. ఓ దీనులారా అంటూ మొదలవుతుందా పాట.
ప్రేమ కోసమై వలలో పడెనే పాపం పసివాడు పాటలో మధ్యలో ఘంటసాల ఆలాపనలు ఉంటాయిగానీ … వర్మ పాడడం వల్లే ఓ ప్రత్యేకత సంతరించుకుందా పాట.
అలాగే ఘంటసాల సంగీతం అందించిన పెళ్లి చేసిచూడులోనూ ఓ పాట అందుకున్నారు వి.జె.వర్మ.
ఈయన అసలు పేరు విజయవర్మ.
అయితే విజె వర్మగానే ఇండస్ట్రీ ఆయన్ను గుర్తించింది.
ఎవరూ పెద్దగా పట్టించుకోని ఆయన్ని సాక్షి పేపర్ వారు పట్టించుకుని ఓ రైటప్ ఇచ్చారు.
2013లో వచ్చింది ఆ ఆర్టికల్.
అయితే క్లుప్తంగా పరిచయం చేశారు తప్ప ఆయన గురించిన పూర్తి వివరాలు లేవు.
అయితే ఆయన పిల్లలెవరి దగ్గరనుంచో వివరాలు తీసుకుని ప్రచురించినట్టుగానే ఆ రైటప్ ఉందిగానీ ఆ వివరాలు ఇవ్వలేదు.
అసలు ఆ మాత్రం ఆచూకీ ఇవ్వడమే గొప్ప కనుక .. సాక్షి ని ఈ విషయంలో అభినందించాలి.
ఓ దశలో అశ్వత్ధామ , అద్దేపల్లి రామారావులతో పాటు ఘంటసాల నాగయ్య లాంటి వాళ్లు కూడా ప్రోత్సహించిన ఈ గాయకుడు పాడిన పాటలు పట్టుమని పది మాత్రమే.
అద్దేపల్లి వారి ఆర్కెస్ట్రాలో ఫ్లూట్ వాయించేవారట ఈయన. అలాగే ఆకాశవాణిలో కూడా …
ఈ కార్యక్రమాలతో పాటు కచ్చేరీలు కూడా విస్తృతంగా చేసేవారట వర్మగారు.
వయోభారంతో పాటు కచ్చేరీలు తగ్గడం .. సినిమాల్లో కూడా అవకాశాలు పెద్దగా రాకపోవడంతో … ఇంట్లోనే రోజూ కాసేపు త్యాగరాయ కృతులు పాడుకోవడం ఫ్లూటు వాయించడం చేస్తూ ఉండేవారట.
అలా ఒక రకంగా ఒంటరితనం అనుభవిస్తూనే విష జ్వరంతో కన్నుమూశారు అనేది సాక్షి కథనంలో తెల్సిన విషయం.
ఇంకో విశేషం ఏమిటంటే …
ఆయన పుట్టుగుడ్డి అట. వేణువు వాయించేవారట. ఫ్లూట్ ప్లేయర్ గా అనేక కచ్చేరీలు చేసిన ఆయన నలభై ఐదు ప్రాంతాల్లో పెళ్లి చేసుకున్నారట. ఆయన భార్యపేరు నాగరత్నమ్మ.
గుమ్మడి గారి తొలి చిత్రం అదృష్టదీపుడు లో తాళము తీసి నిను తప్పించి అనే పాట పాడారాయన.
శివాజీ గణేశన్ నటించిన రాజగురువు సినిమాలో కూడా దేవులపల్లి వారు రాసిన ఏ పాపమెరుగని చిన్నారి అనే పాట పాడారు.
వర్మగారు పాడిన పాటలను బట్టి చూస్తే దాదాపు అన్నీ కెమేరా సాంగ్స్ గానే తోస్తాయి.
పెద్దమనుషులు సినిమాలో అద్దేపల్లి వారి సంగీత దర్శకత్వంలో … నీడ లేదమ్మా నీకిచ్చట తోడు లేదమ్మా అనే పాటపాడారు.
ఊటుకూరు సత్యనారాయణ రాశారాపాట.
ఇలా వేళ్లమీద లెక్క పెట్టుకోదగ్గ సంఖ్యలో పాటలు పాడినా …
తనదైన ముద్ర వేసిన గాత్రం అది.
అద్భుతమైన బేస్ వాయిస్ …
నాగయ్యగారు వర్మని చూసినప్పుడల్లా .. పాట పాడడంలో నేను అనుసరించే పద్దతినే అనుసరిస్తున్నావయ్యా అనేవారట …
వీరి గురించి మరిన్ని వివరాలు మిత్రులు రాస్తారు కదా అని నాకు తెల్సినవన్నీ రాశాను ..
ఆయన ఫొటో కూడా సాక్షి వారి కర్టెసీతోనే … (రంగావఝల భరధ్వాజ)
Share this Article