శ్రీశైలం నీటినిల్వ సామర్థ్యం 100 టీఎంసీల మేరకు పడిపోయిదని ఓ వార్త… ఆందోళనకరమే… దాన్ని మించి తెలంగాణవాదులకు ఆగ్రహాన్ని కలిగించే వార్త ఒకటి నిన్న కనిపించింది… శ్రీశైలం డెడ్ స్టోరేజీ నుంచి సైతం నీటిని రాయలసీమకు తరలించుకుపోయే రాయలసీమ ఎత్తిపోతల పనుల్ని రహస్యంగా చురుకుగా కొనసాగిస్తున్నారనీ, ఏపీ దొంగ దెబ్బ అనీ నమస్తే తెలంగాణ రాసుకొచ్చింది…
ఫోటోల్ని వేసింది… ఎక్స్‌క్లూజివ్ స్టోరీ… జర్నలిజం కోణంలో గుడ్… జగన్ తలపెట్టిన ప్రాజెక్టు అది… అప్పట్లో వెలుగు పత్రిక అనుకుంటా, దీనిపై వరుస కథనాలు రాసినట్టు గుర్తు… ఇదే నమస్తే తెలంగాణ అప్పట్లో కిక్కుమనలేదు… పోతిరెడ్డిపాడు పొక్క పెంచుతున్నారని ఉద్యమ సమయంలో గగ్గోలు పెట్టిన కేసీయార్ ఈ రాయలసీమ లిఫ్టు మీద ముక్క కూడా మాట్లాడింది లేదు…
ఇక్కడ రెండు అంశాలు… కేసీయార్ అధికారంలోకి వచ్చాక ‘తెలంగాణ ప్రయోజనాలు’ అనే అంశాన్ని అటకెక్కించి, ఫక్తు రాజకీయ పార్టీగా మార్చేసి, తెలంగాణవాదుల నమ్మకాల్ని తీవ్రంగా దెబ్బతీశాడు… పైగా వీరసమైక్యవాది, తెలంగాణ వ్యతిరేకి జగన్‌తో ఆర్థికంగా అంటకాగుతూ యవ్వారాల యావ… దాంతో శ్రీశైలం మీద సోయి లేకుండా పోయింది…
Ads
ఆ లిఫ్టు మీద సాక్షి ఎలాగూ రాయలేదు… కారణం, అది జగన్ చేపట్టిన ప్రాజెక్టు, ఇప్పుడూ రాయదు, ఎందుకంటే అది ఆంధ్రా సాక్షి… ఆంధ్రజ్యోతి ఎప్పుడూ ఆంధ్రాజ్యోతియే… టార్గెటెడ్ లీడర్ మీద అవాకులు, చవాకుల స్టోరీలకు మాత్రమే పరిమితమైన ఆంధ్రా ఈనాడు నుంచి ఆశించేదేమీ లేదు… రాస్తే గీస్తే ఒక వెలుగు, ఒక నమస్తే రాయాలి… కానీ నమస్తేకు జగన్‌తో అక్రమ సంబంధాలు… వెలుగులో చాన్నాళ్లుగా పాత్రికేయ వెలుతురు ఆరిపోయింది…
సో, ఓయ్, రేవంత్ రెడ్డీ, అక్కడ తెలంగాణకు అంత ద్రోహం జరుగుతూ ఉంటే మాట్లాడవేం..? అనడగడానికి హఠాత్తుగా నమస్తేకు తెలంగాణ ప్రయోజనాలు గుర్తొచ్చాయి… అక్కడికి కేసీయార్ దాని మీద ఏదో పోరాడినట్టు..? పైగా న్యాయపోరాటం చేసినట్టు తనకు తానే ఓ సర్టిఫికెట్…
అప్పుడు జగన్ చేపట్టినా సరే, చంద్రబాబు కూడా అదే స్పీడ్ మెయిటెయిన్ చేస్తున్నాడు ఆ లిఫ్టు మీద… ఎందుకు..? వాళ్ల ఆంధ్రా ప్రయోజనాల విషయలో వాళ్లు ఎప్పుడూ ఒక్కటే… రాజకీయంగా ఎంత తన్నుకున్నా సరే, ప్రాంత ప్రయోజనాల కోసం ఒకే ఒరవడితో వెళ్తుంటాయి అక్కడి పార్టీలు… మరి తెలంగాణ సోయి..? అదే ఓ భ్రమపదార్థం…
జగన్, కేసీయార్ బంధంతో అప్పుడు పట్టించుకోలేదు… ఇప్పుడు నమస్తే రాజకీయ కోణంలో ఈ వార్త ప్రచురించినా సరే, నిన్న ఎవరూ ఖండించలేదు… ఖండించడానికి అదేమీ అబద్ధం కూడా కాదు… పోనీ, మేం ఈ కోణంలో పోరాటం చేస్తాం, ఆ లిఫ్టును వ్యతిరేకిస్తున్నాం అనే విధాన ప్రకటన ఏమైనా కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి వచ్చిందా..? అదీ లేదు… దిక్కుమాలిన నాగార్జున, సమంత, సురేఖల వివాదంలో పడి, ఇదుగో ఇలాంటి అంశాల నుంచి జనాన్ని డైవర్ట్ చేసిపారేస్తున్నారు…
అప్పుడు జగన్, కేసీయార్ బంధం సరే… ఇప్పుడు రేవంత్, చంద్రబాబు బంధం… తెలంగాణలో తనదే అధికారం అన్నట్టుగా ఉంది చంద్రబాబు మాట్లాడే ధోరణి… ఇదే లిఫ్టు మీద కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి వివరణో, ఖండనో ఏదో వస్తుందని ఎదురుచూసిన తెలంగాణవాదులకు ఎప్పటిలాగే భంగపాటు… అప్పుడూ ఇప్పుడూ ఆంధ్రా నాయకుల మాటలు, చేష్టలే చెల్లుబాటు…
అసలే శ్రీశైలం పూడిక, ఎగువన కర్నాటకలో అడ్డగోలు నీటివాడకం, భయపెడుతున్న ఆలమట్టి ఎత్తు పెంపు, తెలుగు రాష్ట్రాలకు నష్టదాయకంగా బ్రజేష్ ట్రిబ్యునల్ తీర్పులు… మరోవైపు పోతిరెడ్డిపాడులు, రాయలసీమ లిఫ్టులు… మరి తెలంగాణ ప్రయోజనాలకు కేసీయార్ చేసిందేముంది..? ఏవేవో కొత్త ప్రాజెక్టులు గట్రా మాటల్లో ఊదరగొట్టి చేసిందేమీ లేదు… కుంగిన మేడిగడ్డలు, మునిగిన పంపుహౌజుల కాళేశ్వరం తప్ప సారు కళ్లకు తొమ్మిదిన్నరేళ్లూ ఇంకేమీ కనిపించాలేదాయె… మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి..? పెద్ద ప్రశ్నార్థకం..!!
Share this Article