థాంక్ గాడ్… నమస్తే ప్రభ అలియాస్ ఆంధ్రా ప్రభ… పత్రిక ఒక పిలుపును ఇవ్వలేదు… బతికించింది… ఏమిటయ్యా అంటే..? ఓ విచిత్ర భజన కనిపించింది పత్రికలో… కవితక్కా గౌరమ్మ పిలుస్తోంది అనేది శీర్షిక… అసలు కవిత కనిపించక పూలసంబురమే కళతప్పిందట… ప్రపంచానికి బతుకమ్మను చాటిచెప్పిందే తనట…
ఉత్సవాన్ని ఉద్యమంలా మలిచిందట… ఇళ్ల మధ్య సాగే సంబురాన్ని ప్రపంచవ్యాప్తం చేసిందట… అలాంటిది కవిత ఈసారి ఉత్సవాల్లో ఎక్కడా కనిపించక గౌరమ్మ చిన్నబోయిందట… రారమ్మని కవితను పిలుస్తోందట… అవునూ, ఫాఫం, కవిత తన మానసపుత్రిక బతుకమ్మ మీద ఎందుకు అలిగిందో మాత్రం రాయలేదు…
కవిత గైర్హాజరుకు గౌరమ్మే తల్లడిల్లిపోతున్నంత ఘనంగా భజించిన ఆ పత్రిక… అసలు బతుకమ్మను పుట్టించిందే కల్వకుంట్ల బతుకమ్మ అన్నట్టుగా ఓ కాగితంపూల బతుకమ్మను పేర్చింది ఫస్ట్ పేజీలో… కవిత రాకపోవడం మీద కన్నీళ్లు పెట్టుకుంది పత్రిక… అసలు ఆ పత్రిక ప్రమాణాలు ఎప్పుడూ హాస్యాస్పదంగానే ఉంటూ వస్తున్నాయి… ఇక ఈ పత్రిక ఇంతకుమించి జారిపోలేదు అనుకున్న ప్రతిసారీ మరింత లోతుల్లోకి జర్నలిజాన్ని తీసుకుపోతుంది…
Ads
సదరు పత్రిక యాజమాన్యానిది ఆంధ్రా… పేరుకు జనసేన… వాళ్లకు బతుకమ్మ విశిష్టత తెలియదనడానికి సందేహించనక్కర్లేదు… హిందూ, తెలంగాణ సంస్కృతిని నిజాం పాలనలో ఎంతటి బలమైన ప్రయత్నాలు జరిగినా సగటు తెలంగాణ మహిళ తమ ప్రకృతి పండుగ బతుకమ్మను కాపాడుకుంది… అది ఈ పత్రిక రాసుకొచ్చినట్టు ఇళ్ల మధ్య సాగే సంబురం కాదు, అది సోషల్ ఫెస్టివల్… కూడళ్లలో, గుళ్లలో, చెరువు గట్ల దగ్గర మహిళలు గుమిగూడి ఆటపాటలతోనే, గౌరమ్మ పూజలతోనే… బతుకు కష్టాల్ని కూడా కలబోసుకునే సమ్మేళనం…
నిజాం పాలనను మించి తెలంగాణ ఆటను, పాటను, పండుగను వెక్కిరించి, పదే పదే అవమానిస్తూ తొక్కేయడానికి చూసిన ఆంధ్రా పాలనలోనూ బతుకమ్మ బతికే ఉంది… సగటు మహిళ బతుకు కష్టాల నడుమ సైతం బతుకమ్మను తన ఒడి నుంచి దూరం చేసుకోలేదు… ఆ పండుగ విశిష్టత అది… బతుకమ్మను కవిత ఎలా వాడుకుందనేది ఓ సబ్జెక్టు… ఇప్పటికీ ఆంధ్రా పాత్రికేయానికి బతుకమ్మ అంటే వెక్కిరింపే… అందుకే ఇలాంటి స్టోరీలు… బతుకమ్మను పుట్టించిందే కవిత అన్నట్టుగా… కవిత లేక గౌరమ్మ బాధపడుతున్నట్టుగా… పరోక్షంగా పదే పదే తెలంగాణ కల్చర్ మీద దాడి ఇలా కొనసాగుతూనే ఉంది… తెలంగాణ మహిళా సమాజాన్ని కూడా అవమానిస్తూనే ఉంది…
బతుకమ్మను నిర్లక్ష్యం చేశాయేమో గానీ… ఒక ఈనాడు, ఒక సాక్షి, ఒక ఆంధ్రాజ్యోతి బతుకమ్మను ఎప్పుడూ కించపరచలేదు… ఇలాంటి స్టోరీలతో అవమానపరచలేదు… ఎటొచ్చీ ఇదుగో ఇలాంటి పత్రకలతోనే సమస్య… చివరకు నమస్తే తెలంగాణ అనబడే కేసీయార్ సొంత వాయిస్ కూడా ఈ రేంజ్ కవిత భజన చేయలేదు…
అవునూ, కవిత ఎందుకు కనిపించడం లేదు..? ఆమధ్య ఆరోగ్యం బాగాలేదు, చికిత్స- రెస్ట్ తీసుకుంటోంది అన్నారు… బతుకమ్మే కాదు, తనకు వ్యతిరేకంగా కుట్రలు చేసిన ఒక్కొక్కరి సంగతీ తేలుస్తానని శపథం చేశాక ఇక తెరపైనే కనిపించడం లేదు… ఫాఫం, ఆమె ఆరోగ్యం బాగాలేకపోతే కూడా బతుకమ్మదే తప్పా..? గౌరమ్మే తప్పు చేసినట్టా..? ఇంకా నయం… కవిత బతుకమ్మ ఉత్సవాల్లో కనిపించడం లేదు కాబట్టి, ఆమెకు సంఘీభావంగా తెలంగాణ సమాజం ఈసారి బతుకమ్మ ఉత్సవాల్ని జరుపుకోవద్దు అని ఆంధ్రా ప్రభ పిలుపునివ్వలేదు… అక్కడికి బతుకమ్మనూ, తెలంగాణ సమాజాన్ని బతికించింది పత్రిక…
సర్, రేవంత్ రెడ్డి సార్, ఈసారి ఈ పత్రికకు మరింతగా యాడ్స్ సంఖ్య పెంచండి… ఉద్దరిస్తారు..!! పనిలోపనిగా తెలంగాణ విశిష్ట అవార్డులు ప్రకటించేటప్పుడు కూడా కాస్త గుర్తుంచుకొండి సర్..!!
Share this Article