ప్రపంచ సముద్ర వాణిజ్య, రక్షణ వ్యవహారాల్లో ఇండియాకు మాల్దీవులు వ్యూహాత్మక ప్రాంతమే కావచ్చుగాక… కానీ ఆ దేశ అధ్యక్షుడు మొయిజ్జుకు కేంద్ర ప్రభుత్వం చెప్పిన స్వాగతం, ఇచ్చిన ప్రాధాన్యం ఎక్కడో కలుక్కుమనిపిస్తూనే ఉంది… మాల్దీవులను మన మిత్రదేశంగా కాపాడుకోవాలనే ఎన్ని సమర్థనలు వినిపించినా సరే…
మొయిజ్జు ఓ విషసర్పం… ఇండియా పర్యటనకు వస్తే ఏ దేశ అధినేతకూ ఇవ్వని గౌరవం లభించింది… ఓచోట సాక్షాత్తూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోడీ సంయుక్తంగా తన రాకకోసం నిలిచి, వేచి చూస్తున్న వీడియో, ఫోటో విభ్రమనూ కలిగించింది… దేశ అధినేతలిద్దరూ సంయుక్తంగా ఇలా స్వాగతం పలకడం అసాధారణంగా అనిపించింది… మాల్దీవులు వంటి ఓ చిన్న, మన డిపెండెంట్ దేశ అధ్యక్షుడికి, అదీ మన కంట్లో నలుసులా మారిన అధ్యక్షుడికి…
Ads
ఆ దేశ మంత్రులు ఇద్దరు మోడీ మీద, ఇండియా మీద అవాకులు చవాకులు పేలారు… మొయిజ్జు కూడా తక్కువేమీ కాదు.,. మన పర్యాటకులు వెళ్లకపోతే వాళ్లకు బతుకు లేదు… మనం ఆర్థికంగా ఆదుకోకపోతే ఆ దేశమే లేదు… గతంలోనూ రాజీవ్ గాంధీ హయాంలో ఆ దేశ ప్రభుత్వం మీద కుట్ర జరిగితే అప్పటికప్పుడు ఇండియన్ రక్షణదళాలు ఆదుకున్న సందర్భాలనూ చూశాం… అలాంటిది అక్కడున్న కొద్దిమంది భారత బలగాలను వాపస్ పంపించేశాడు ఇదే మొయిజ్జు…
ఇండియా మీద తెల్లార్లూ విషం కక్కే చైనా, తుర్కియేలతో బంధం పెంచుకోవాలని తాపత్రయపడ్డాడు… ఇండియా నుంచి పర్యాటకులు రాకపోతేనేం, చైనా ఉంది కదానే పిచ్చి భ్రమల్లో మునిగాడు… చైనాను నమ్మి ఒక శ్రీలంక, ఒక బంగ్లాదేశ్ తదితర దేశాలు ఎలా మునిగిపోయాయో అర్థమైనట్టు లేదు… ఎప్పుడైతే ఇండియాను దూరం చేసుకుంటే ‘మునిగిపోతామనే’ రియాలిటీ కళ్లెదుట కనిపిస్తుండేసరికి మాట మార్చాడు… ప్లేటు తిప్పాడు…
ఇండియా మా మిత్రదేశం, పర్యాటకులకు స్వాగతం, ప్లీజ్ రండి అనే కొత్త పల్లవిని అందుకున్నాడు… ఇండియా కూడా టైమ్ బీయింగ్‌గా మాల్దీవులతో మళ్లీ సంబంధాల్ని పునరుద్ధరించే ప్రయత్నాల్లో పడింది… తెగేదాకా లాగొద్దనే భావనతో విదేశాంగ మంత్రి జైశంకర్ ఆ దేశానికి వెళ్లాడు, ఆ దేశ విదేశాంగ మంత్రి ఇక్కడికి వచ్చాడు… సంబంధాలు మళ్లీ గాడిన పడ్డాయి… మోడీ మీద, ఇండియా మీద పిచ్చికూతలు కూసిన ఆ ఇద్దరు మంత్రులకూ ఉద్వాసన పలికారు… రాజీనామాలు చేశారు…
వైశాల్యంలో అది ఇండియాలోని ఓ జిల్లాకు సమానం… అంతెందుకు..? మన మల్కాజిగిరి లోకసభ స్థానంతో సమానం… అడిగిందే తడవుగా నిన్న 3000 కోట్ల మేరకు సాయం… ఎవరో ఓ ప్రపంచాధినేతకు స్వాగతం పలికినట్టుగా రాష్ట్రపతి, ప్రధాని సత్కారాలు… మన విదేశాంగ అవసరాల రీత్యా మాల్దీవులకు ప్రాధాన్యం అవసరమే కావచ్చుగాక… కానీ మొయిజ్జు మారతాడా..? నెవ్వర్, విషనాగు వానపాము అవుతుందా..? స్నేహం నటిస్తున్న తనకు స్వాభిమానం చంపుకుని మరీ ఇంత ‘విలువ ఇవ్వడం’ అవసరమా..? మళ్లీ చేతులు కాల్చుకోవడానికి సిద్ధం అవుతున్నామా..?
Share this Article