.
లల్కార్, ది ఓపెన్ ఛాలెంజ్! సిచుయేషన్ ఆఫ్టర్_ శివ
శివ సినిమా ప్రభావం మా ఊరు కరీంనగర్ పై బలంగా పడిందనే చెప్పాలి! తస్సాదియ్యా, ఆ మూవీ రిలీజ్ ఐన తరవాత మంకమ్మతోటలో యూత్ ఏకంగా శివ గ్యాంగ్, భవానీ గ్యాంగ్ అంటూ రెండుగా చీలిపోయి కొట్టుకున్నారంటే, దానమ్మా ఎఫెక్టా మజాకా! తరవాత పోలీసోళ్లు ఆ పోరగాళ్లను టూ టౌన్ కు తీసుకుపోయి రోకలిబండలు ఎక్కిచ్చిన్రు, అది వేరే విషయం!
Ads
అంతకుముందు టౌన్లో గ్యాంగ్ వార్స్ లేవాంటే, లేవని చెప్పలేం! కానీ, అంత ఆర్గనైజ్డ్ గా తన్నుకోవడమైతే లేకుండె! కరీంనగర్ లో కార్ఖానగడ్డ, జంబాల్ గడ్డ [కాపువాడ], కశ్మీర్ గడ్డ, బోయవాడలు కొట్లాటలకు మషూర్! బడా సూర్మార్ ఖాన్లంత అక్కడనే ఉంటుండే! అప్పట్లో జనార్ధన్ రెడ్డి [జనన్న], ఆయన అనుచరుడు కుమార్, నక్కల నారాయణ లాంటి వాళ్లు తమ పైల్వాన్ గిరితో పట్టణంలో హల్ చల్ చేస్తుండే వాళ్లు!
బోయవాడ శంకర్, కాపువాడ బొమ్మ వెంకన్న దాదాగిరి కూడా మస్తు నడిచేది! ఎవరికి వాళ్లే తమ దార్కారీతో జనాలకు సుస్సు పోయించేవాళ్లు! కాలేజీల్లో స్టూడెంట్ వింగ్ నాయకుల మధ్య కూడా ఎటాక్ ల పర్వం కొనసాగేది! కానీ, సడెన్ గా బిఫోర్_శివ, ఆఫ్టర్_శివ అన్నంత సీరియస్ గా తయారైంది సిచుయేషన్!
యువత గ్యాంగులుగా విడిపోయి ఒకళ్లనొకళ్లు రెచ్చగొట్టుకొని, రారా చూసుకుందామనే లల్కార్లతో గ్రౌండ్లకు వెళ్లి మరీ తన్నుకునే పరిస్థితి వచ్చింది! అంతకు ముందు కొట్లాటలంటే ముష్టిఘాతాలకు మాత్రమే పరిమితం అయ్యేవి! దాడులు అంటే కత్తులు కటార్లు వాడేవాళ్లు! శివ తరవాత వేళ్లకు తొడుక్కునే నిఖిల్ పంచు, చేతి వేళ్లకు బిగుతుగా చుట్టుకునే సైకిల్ చైన్ లాంటి మొరటైన కొత్త ఆయుధాలు వాడుకలోకి వచ్చాయి!
ట్రెండ్ సెట్టర్, ఆల్ టైం హిట్, శివ సినిమా 1989 అక్టోబర్ 5 వ తేదీన రిలీజ్ ఐంది! అంటే, అవి నేను ఇంటర్ సెకండ్ ఇయర్ పూర్తిచేసి, బీఎస్సీ చదవడానికి అప్పుడే ఎస్ఆర్ఆర్ డిగ్రీ కాలేజీలో అడుగిడుతున్న రోజులు! నాగార్జున హీరోగా వచ్చిన శివ అప్పట్లో మా జనరేషన్ పై చెరగని ముద్ర వేసిందనే చెప్పాలి! సెల్యులాయిడ్ పైకి ఎక్కి 35 ఏళ్లు గడిచినా, ఆ ఎఫెక్ట్ మాలో ఇంకా సజీవంగా అలాగే ఉంది!
థియేటర్లలో పడటానికి సరిగ్గా కొద్దిరోజుల ముందు మా మేనమామలతో కలిసి నేను హైదరాబాద్ వచ్చాను! సైట్ సీయింగులో భాగంగా మేము బంజారాహిల్స్ లోని అన్నపూర్ణ స్టూడియోను విజిట్ చేశాం! అప్పుడే అక్కడ శివ మూవీ భారీ కటౌట్ ఒకటి మాకు కనిపించింది! అలా ఆ పిక్చర్ షూటింగ్ నడుస్తోందన్న విషయం తెలిసింది!
కానీ, తెలుగు సినిమా రంగాన్ని అది అంతలా షేక్ చేస్తుందని అప్పుడు మేం ఊహించలేదు! వైట్ బ్యాక్ గ్రౌండ్లో రెడ్ అండ్ బ్లాక్ కలర్ థీమ్ తో శివ టైటిల్లోనే ఇమిడి ఉన్న నాగార్జున ఫేస్, దాని మీద వన్ సైడ్ పడే లైటింగుతో, రౌద్రంగా కళ్లెర్ర చేసి చూస్తున్న స్టీల్ ఒకపక్క, అరచేతి వేళ్ల చుట్టూ చుట్టి, కొస భాగం మాత్రం కిందకు వేలాడుతున్న ఓ సైకిల్ చైన్ మరోపక్క ఉండేలా డిజైన్ చేసిన ఆ పోస్టర్ ఆరోజే మమ్మల్ని అమితంగా ఆకర్షించింది!
శ్రీనివాస ధియేటర్లో రిలీజైన మొదటి రోజే ఫ్రెండ్స్ తో కలిసి నేను శివ సినిమా చూశాను! బాప్రే, కిరాకుండె! రోమాలు నిక్కపొడిచే సీన్లు! షో ఐపోయిన తరవాత మదిలో సంచలనం కలిగించే ఒక ఫీలింగ్! అప్పటికప్పుడు ఎవరినైనా కొట్టేయాలి అన్నంత కసి! ఆ తరవాత రిపీటెడ్ గా అనేకసార్లు ఆ ఫిలిం చూశాను! అప్పటిదాక కొనసాగుతున్న బ్రేక్ డ్యాన్సులు, రొటీన్ ఫైట్ల ఒరవడికి చరమగీతం పాడుతూ కమర్షియల్ చిత్రాలకు శివ కొత్త నిర్వచనం ఇచ్చిందని చెప్పాలి!
ఔట్ డోర్ లొకేషన్లతో పని లేకుండా కేవలం హైదరాబాదు పరిసరాల్లో మాత్రమే ఆ మూవీ షూటింగ్ జరగడం గొప్ప విషయం! బెజవాడ రౌడీలు అని వినడమే కానీ, అలా గ్యాంగులుగా విడిపోయి తెగబడి నడి బజార్లలో కొట్టుకుంటారని, ఆ సినిమా ద్వారానే తెలిసింది! అలాంటి ఆ రౌడీయిజాన్ని కాలేజీ పాలిటిక్స్ కు ముడిపెడుతూ, అత్యంత సహజమైన టేకింగ్ తో ఆద్యంతం ఇన్నర్ ఇన్స్టింక్ట్స్ ను, ఎమోషన్స్ ను రెయిజ్ చేస్తూ సాగిన సినిమా కథనం, ఆనాటి యువతను ఉర్రూతలూగించింది!
ఒకరకంగా వాళ్లలో హింసా ప్రవృత్తిని సైతం ప్రేరేపించిందని చెప్పాలి! సరిగ్గా ఇవే ఎలిమెంట్స్ ను క్యాష్ చేసుకొంటూ డైరెక్టర్ రాంగోపాల్ వర్మ ఓవర్ నైట్ పాపులర్ ఐపోయాడు! శివ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఆల్ టైం రికార్డులతో అంతకు ముందు కలెక్షన్లను బద్దలు కొట్టింది! ఓ భారీ హిట్ గా టాలీవుడ్ చరిత్రలో నిలిచిపోయింది!
అసలు అరుపులు, కేకలు లేకుండా, ఒక విలన్ క్రూరత్వాన్ని ఎలా ప్రదర్శించాలో రఘువరన్ చేసి చూపించాడు! హిజ్ రోల్ వాజ్ ఎక్సలెంట్ అండ్ మార్వలస్! కోటా శ్రీనివాస్ రావు, తనికెళ్ళ భరణి నటన చించి పడేశారు! జగన్ ఫ్రెండ్లీ నేచర్, చిన్నా ఆవేశం, కాలేజీ క్యాంటీన్లో ఉత్తేజ్ తెలంగాణా యాసలో భారత ఇతిహాస కథలు చెప్పడం ఆనాటి ప్రేక్షకులను విశేషంగా అలరించాయి! ఉడుకు రక్తం పారే ఈ యువకులు అత్యధిక ప్రేక్షకులను రంజింపజేసి రాత్రికిరాత్రి ఫేమసైపోయారు!
గ్లామర్_గర్ల్ అమల అమాంతంగా ఆకాశానికి ఎదిగిపోయింది! యువసామ్రాట్ నాగార్జున ఇమేజ్ ఐతే చెప్పనే అక్కర్లేదు! ఆయనకు కూడా ఒక్కసారిగా బిగ్ స్టార్_డం వచ్చేసింది! ఆ తరవాత కొద్ది రోజుల పాటు శివ సినిమా ఫేంల పరంపర కొనసాగింది! ఆ యూనిట్లో పని చేసిన వాళ్లు, వేరే ఏ సినిమాలో నటించినా, వాళ్ల పేర్లకు ముందు శివ ఫేం అంటూ ట్యాగ్ లైన్ తగిలించి ప్రేక్షకులను ఆకట్టుకోవడం ద్వారా ఫిలిం ప్రొడ్యూసర్లు వాళ్ల చిత్రాలను అమ్ముకున్నారు!
ఇక, ఇళయరాజా మ్యూజిక్ ఇక్కడ హైలైట్! బాటనీ పాఠముంది, మ్యాటనీ ఆట ఉంది సోదరా ఏది బెస్టురా సాంగ్ సూపర్ డూపర్ హిట్! ఈ పాటలో నాగార్జున చేతులు పైకెత్తి చప్పట్లు కొడుతూ వేసిన సోలోస్టెప్ ఇచ్చిన కిక్ అంతా ఇంతా కాదు! ఆ తరవాత డ్యాన్స్ చేయాలంటే ప్రతి ఒక్కళ్లూ ఆ స్టెప్పునే అనుకరించారు!
ఇక, సరసాలుచాలు శ్రీవారు వేళ కాదు., అన్న పాట సైతం అప్పట్లో యూత్ కు కిర్రెక్కించింది! ఈ రెండు పాటలు ఎప్పుడు విన్నా బోర్ కొట్టవు! ప్రేక్షకుడు మూవీని మళ్లీ మళ్లీ చూడాలని అనిపించేలా చేసింది ఈ రెండు పాటలే! బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఒక అసెట్ గా నిలిచి శివ సినిమా క్రేజ్ ను విపరీతంగా పెంచింది! ……. సూరజ్ వి. భరద్వాజ్.
Share this Article