Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

జస్ట్, ఇదొక ఆట కాదు, పాట కాదు… బతుకమ్మను ఇలా అర్థం చేసుకోవాలి…

October 10, 2024 by M S R

.

#సామాన్యశాస్త్రం… *బతుకమ్మ మన చేతనం

బతుకమ్మ ఒక అవతరణ. ఒక పెద్ద బాలశిక్ష. జానపదుల అవధానం. ఇదే మన అచ్చమైన సంగీత సాహిత్య అకాడమీ. నాటికీ, నేటికీ అది పదిలం. మారుతున్న కాలానికి బతుకమ్మ ఒక శరణు.

Ads

రాజ్యాలు మారవచ్చు. కానీ బతుకు పండగ సదా నూతనం. చేతనం. మిత్రులందరికీ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు.

***
తెలంగాణ అంటే ఏమిటో చెప్పే ఏకైక ప్రతీక బతుకమ్మ. అది ఆటగా ఉన్నది. పాటగా ఉన్నది. అది తీరుబాటుతో కూడినది. సకల జనులను సామూహికంగా కూడగట్టేడిది. ఇంటి నుంచి వాకిట్లోకి, అక్కడి నుంచి కూడలిలోకి; ఆడ నుంచి చెరువుకు చేరేటిది. చెరువులను శుభ్ర పరిచినట్టే అది మన హృదయ నాళాలను పరిశుభ్రం చేసేడిది.

అది మొత్తం తెలంగాణ జీవావరణం గురించి, ఇక్కడి జానపద చిత్తాన్ని, ప్రకృతిని గురించి చాటుతది. ముడుచుకుని విప్పే పువ్వులా అడబిడ్డ లందరిని ప్రకృతిలో లీనం చేస్తది. మగవాళ్ళను అందులో సమయోచిత భాగస్వాములుగా మారుస్తది. ఇవన్నీటితో పాటు పోరాట భూమికగా కూడా బతుకమ్మ ఎటువంటి పాత్ర పోషించినదో స్వరాష్ట్ర ఏర్పాటే మనకు మంచి ఉదాహరణ.

ఇంతటి ప్రశస్తి మరే పండుగకూ లేదు. జీవితాన్ని బతుకమ్మగా కొలిచే ప్రకృతి బిడ్డలా వరం ఇది. మలిదశ ఉద్యమంలో అది ఆధిపత్య పాలనను సుతారంగా పక్కకు నెట్టి, అవశ్యమైన చరమగీతం మనకు అందించడమూ మరచిపోరాదు.

మారుతున్న కాలానికి బతుకమ్మ ఒక శరణు. స్థిరమైన వేడుక. అది తల్లిగారిల్లు, కన్న ఊరితో మమకారానికి చేర్పు. మల్లెసార నుంచి చేను చెనుకా… చెరువు దాకా బతుకమ్మ రెండు చేతుల్లో విరిసే నిండు సౌభాగ్యం. అదే దసరా నాడు కనిపించే పాలపిట్ట వలే జీవితానికి శుభప్రద స్వాంతన.

ఇది పరంపరా గతం. తల్లులు బిడ్డలకు తరతరాలుగా ఒకరి నుంచి ఒకరికి అందిస్తున్న ఆశీర్వాదం. అందరూ ఒక్క ఒక చెంతకూడి పూలు పెర్చిడం, ఆడటం, పాడటం, నిమజ్జనం, అన్నీ కూడా ఒక పెద్ద బాలశిక్ష. జానపదుల అవధానం. ఇదే మన అచ్చమైన సంగీత సాహిత్య అకాడమీ. నాటికీ, నేటికీ అది పదిలం.

తెలియంది ఎవరికి. తెలంగాణలో ఆడబిడ్డలు తమ కష్ట సుఖాలను కలబోసుకునేందుకు బతుకమ్మ నవరాత్రులూ గొప్ప బలిమి. ఒకనాడు మనుషుల మధ్య దూరం, రాకపోకలకు ఎన్నోఅడ్డంకులు. దాంతో బతుకమ్మ పండుగే ఆసరా అయ్యేడిది. ఆడబిడ్డకు తమ తల్లిగారింటితో వారధిగా ఈ పండుగే నిలిచేది.

ఉన్నన్ని రోజులు ఒక శోభ. ఈ తొమ్మిది దినాల్లో తమ బిడ్డ ఎట్లున్నదో తల్లిదండ్రులకు తెలిసేది. అన్నదమ్ములకు సోదరి మంచి చెడ్డా విశదం అయ్యేది. అన్నొద్దులు తల్లిగారింట ఉండే తీరికా వీలూ కారణాన అందరిలో ఆత్మీయతలు విరిసేవి. అనురాగం ఒలికేది. మనసులో గూడు కట్టుకున్న రందులన్నీ తొలగిపోయేటివి.

అది ఒక్క కుటుంబం విషయం కాదు. తెలంగాణ రాష్ట్రం సాకారం కావడానికి, స్వరాష్ట్రంలో మన బతుకు – పరిపాలన కూడా తల్లిగారింట బతుకమ్మ పండుగ వంటిదే. పరాయి నుంచి మనింట్ల మనం నిచ్చింతగా బతుకే తీరుకు భరోసాయే ఈ పండుగ. దశాబ్దాల అనంతరం మన స్వీయ అస్తిత్వం తిరిగి పౌరుషంగా ఆడి పాడిన దశకు ఆధార మార్గం ఈ పండుగ మహాత్యమే.

కరువు కాటకాలు, అపసవ్య పాలన, అన్నీ కలిసి తెలంగాణను కాగితం బతుకమ్మలు ఆడుకునే స్థితికి నెట్టగా మలిదశ ఉద్యమం తిరిగి ఇక్కడి బతుకులను ఒక పోరాట భూమికగా మార్చింది. ఒక్క మాటలో స్వరాష్ట్రం అన్నది బతుకమ్మ పండుగే. అది మనలో మనం కలబోసుకునే సమస్యలను సవరించుకునే పండుగే.

అది మరింత అందంగా మరింత విస్తృతంగా సకల జనులతో పెనవేసుకుని, ఒకరు పాడుతుంటే మరొకరు అందుకునే పాటగా రాణించేందుకు, కాళోజీ వంటి పెద్దలు దీవించినట్లు “‘బతుకమ్మా బతుకు’ అన్న దీవనార్తికి మూలంగా భాసించేందుకు వీలైందీ అంటే మనందరి ఆటా పాటా ఒకటి కావడం వల్లే.

ఒక్కలా ఇద్దరా….మితవాదులు, అతివాదులు. నక్సలైట్లు, పోలీసులు. కవులు, గాయకులు. విద్యార్థులు, పాత్రికేయులు, అడ్వకేట్లు, ఉద్యోగులు. అందరిదీ ఒక బాట. ఒకే మాట. పేర్చిన బతుకమ్మ నిమజ్జనం చేయక తప్పనట్లు, అమరుల త్యాగాలూ వేనవేలు. తల్లుల గర్భశోకమూ ఒక గొడగొడ దుఖపు పాట. అన్నీ కలిస్తేనే బతుకమ్మ. తెలంగాణ సాధన. అన్నీ నేడు యాది చేసుకోవాలె.

బతుకమ్మ మన అమ్మ. మన తెలంగాణ తల్లి. నేడు- రేపు- బతుకమ్మే మన ఆదర్శం. తీరిక్క పూవోలె ఒక పళ్ళెంలో కలిసి ఉందాం. కలిసి మెలిసి ఆడుదాం. పాడుదాం.

రాజ్యాలు మారవచ్చు. కానీ బతుకు పండగ సదా నూతనం. చేతనం. ఎన్ని విపత్తులు, మహామ్మారులు ఎదురైనా సమిష్టి తత్వం, సామూహిక లాక్షాణికత వీగిపోకుండా చూసుకుందాం. “నీ ఆటలే ఆడుతాం. నీ పాటలే పాడుతాం” అని ఆ తల్లిని కొలుస్తూ నిండు ఆశీర్వాదం తీసుకుందాం. చల్లగా బతుకుదాం…. కందుకూరి రమేష్ బాబు ….  Samanyashastram Gallery

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • కేసీయార్ లేదా బాబు అయిఉంటే… ఈ ఈవెంట్ దద్దరిల్లిపోయేది…
  • భారత్ చేతిలో భార్గవాస్త్రం… విదేశీ డ్రోన్లకు పర్‌ఫెక్ట్ విరుగుడు మంత్రం…
  • టర్కీ, అజర్‌బైజాన్… శత్రువుకు మిత్రులు… కాళ్లబేరానికి వస్తున్నారు…
  • పాకిస్థాన్ భారీ సంఖ్యలో యుద్ధ విమానాలను కోల్పోయింది..!!
  • భారీగా బోరాన్ తరలింపు దేనికి..? ఆ అమెరికా విమానం ఏమిటి..?
  • ఆపరేషన్ సిందూర్…! కాల్పుల విరమణ అసలు కహానీ ఇదీ..!
  • ఎట్టెట్టా… ఎన్టీయార్ ఘాట్ వెళ్తే సమస్యలకు పరిష్కారాలు దొరుకుతాయా..?
  • ‘ఆ పాట’ మధురాలు… ఉన్నదే రెండు లైన్లు… సో సో ట్యూన్… ఐతేనేం..!!
  • … మరి ఇప్పుడు తెలుగు చచ్చిపోదా మాస్టారూ… మాట్లాడరు..!!
  • నూటికో కోటికో ఒక్కరు… అది మీరే మీరే మాస్టారూ… ధన్యజీవి…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions