వేట్టయన్… అంటే వేటగాడు… ఆ తమిళ పేరే తెలుగులో, ఇతర భాషల్లోనూ… తెలుగు పేరే దొరకలేదా..? అనే ప్రశ్నకు పంపిణీదారుల నుంచి ఓ శుష్క సమర్థన వచ్చింది… ఎవరికీ నచ్చలేదు… ఆ సినిమాలాగే..!
అరె, అదేమిటి..? జైభీమ్ వంటి మంచి ఆలోచనాత్మక సినిమాను ప్రజెంట్ చేశాడు దర్శకుడు జ్ఞానవేల్… ఈ వేట్టయన్‌ను అదే రేంజులో ఎందుకు ప్రజెంట్ చేయలేకపోయాడు..? ఇదీ ప్రశ్న… పైగా ఒకరా ఇద్దరా..?
అసలే రజినీకాంతుడు… దానికితోడు అంతటి సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్… దగ్గుబాటి రానా… మంజు వారియర్… ఫహాద్ ఫాజిల్… అంటే పాన్ ఇండియా సినిమా కదా, ప్రజెంట్ ట్రెండ్ ఏమిటంటే..? కన్నడ, తెలుగు, తమిళ, హిందీ, మలయాళ నటీనటుల్ని పెట్టుకుంటే చాలు, అదిక పాన్ ఇండియా సినిమా… అదుగో ఆ భ్రమల్లో నుంచే ఈ స్టార్ల ఎంపిక… (బాహుబలితో ప్రభాస్‌కు సమానమైన ఇమేజీని పొందిన రానా చివరకు ఇలా అతిథి పాత్రలు, సహాయక పాత్రలకు జారిపోయాడు ఫాఫం..)
Ads
మరి ఇంత బలమైన స్టార్ ఆకర్షణలున్నాయి కదా, సినిమా ఎందుకు బాగోలేదు..? కథ బాగాలేదా..? కాదు, కథ బాగుంది… ఓ ఎన్‌కౌంటర్ నేపథ్యంలో కథ… కానీ కథనమే దెబ్బతింది… అంతటి జ్ఞానవేల్ కూడా తడబడ్డాడు… ఎందుకు..? రజినీకాంత్ మాస్ ఇమేజీ వేరు… జ్ఞానవేల్ స్కూల్ ఆఫ్ థాట్, అంటే తన పంథా వేరు… ఆ రెండింటికీ సరైన ఫ్యూజన్ లోపించింది…
అదేమిటి..? సూర్య కూడా స్టార్ హీరోయే కదా, మరి జైభీమ్ బాగా కుదిరింది కదా..? ఎస్, రజినీకాంత్ వేరు… తన మాస్ ఇమేజీ, మొన్నటి జైలర్ తాలూకు హ్యాంగోవర్‌లోనే ఉండి, సోకాల్డ్ కమర్షియల్ విలువలు, వాసనలకే రజినీకాంత్ గిరిగీసుకున్నాడు… కానీ సూర్య డైరెక్టర్ చెప్పినట్టు విన్నాడు… కథ ప్రకారం నటించాడు… రజినీకాంత్ ఆ పనిచేయలేదు… కాదు, తన ఇమేజీ ఆ పని చేయనివ్వలేదు… అవే బిల్డప్పులు, అవే ఎలివేషన్లు… ఇంకెన్నాళ్లు తాత గారూ..?
ఫలితంగా అటూఇటూ గాకుండా పోయింది… సరిపోయింది, ఇక రజినీకాంత్ మారడు, మారలేడు… ఒక మమ్ముట్టి కాలేడు, ఒక మోహన్‌లాల్ కాలేడు, చివరకు ఒక వెంకటేష్ కూడా కాలేడు… తను ఒక చిరంజీవి… అంతే… ఒక ఆచార్య, ఒక భోళాశంకర్… తను ఒక కమల్ హాసన్… ఒక భారతీయుడు… అమితాబ్ మారగలడు, మారాడు… అచ్చంగా భిన్నమైన పాత్రల్లోకి దూరిపోతున్నాడు… నిజానికి అమితాబ్ నుంచి మించిన మాస్ హీరోలా వీళ్లంతా..? కాదు, ఐనా అమితాబ్ మారాడు, మారుతూనే ఉంటాడు… అందుకే స్టిల్ యంగ్ తన కెరీర్‌లో…
ఎప్పుడైతే మాస్ ఇమేజీ బందిఖానాలో పరుగు సాగుతుందో ఇక జ్ఞానవేల్‌కు ప్రయోగాలు, తనదైన ఆలోచనల్ని ఆవిష్కరించడం కష్టమైపోయింది… అందుకే సినిమా చతికిలపడిపోయింది… ఈ సినిమా కథ గురించో, కథనం గురించో పెద్దగా లోతుగా విశ్లేషణలు కూడా అక్కర్లేదు… స్టిల్, ఈ వయస్సులోనూ రజినీకాంత్ పాత్రల చుట్టూ రకరకాల కమర్షియల్ లెక్కలు తప్ప… భిన్నమైన పాత్రల గురించి చర్చ లేదు… ఏముంది..? ఇదిలాగే కొనసాగితే..? ఏమో… కాలగతిలో చాలా హాట్ ఇమేజిస్ట్ సూపర్ స్టార్లు చల్లబడి, చప్పబడిపోయారు… రజినీకాంత్ కాలగతికి అతీతుడేమీ కాదు కదా… ఎటొచ్చీ జ్ఞానవేల్ వంటి ఆలోచనాత్మక దర్శకులకే ఈ సినిమా ఓ పాఠం…
అవునూ, వేట్టయాన్ అనే పేరలాగే ఉంచారు సరే… మనకు ఆ తమిళ వాతావరణం, పేర్లు, సంగీతం, నటీనటులు గట్రా భరించడం, కళ్లకద్దుకోవడం అలవాటే… కానీ ట్యాగ్ లైన్ ఏమిటలా..? గురిపెడితే ఎర పడాల్సిందే… ఎర పడటమేంటి..? ఎరను వేసే కదా అసలు సరుకును వేటాడేది..? రజినీ సినిమా అంటే చాలు… ఎవ్వరికీ ఏ సోయీ ఉండదు… ఎంత డబ్బు పెడుతున్నాం, ఎంత వస్తుంది..? ఇవే లెక్కలు… ఆ లెక్క కూడా తప్పింది..!!
Share this Article