రతన్ టాటా గొప్పోడు… అచ్చమైన భారత రత్నం… రత్నాన్ని మించి… ఐతే మరణించిన ఓ గొప్ప వితరణశీలి గురించి కొంత కల్పన కలగలిపిన నివాళి అక్కర్లేదు… నిజాల్ని చెబితే చాలు…
అలాగే తన జీవితంలోని ప్రేమ సంబంధాలు తదితర వ్యక్తిగత జీవిత వివరాలు స్మరించుకున్నా తప్పేమీ కాదు, అసందర్భమో, అప్రస్తుతమో అస్సలు కాదు… కించపరచనంతవరకూ..! తన జీవిత చరిత్రలో ప్రధానంగా ఓ అధ్యాయం… ముంబై తాజ్ హోటల్‌పై పాకిస్థానీ టెర్రరిస్టుల దాడి…
Ads
తను సమాచారం తెలిసిన వెంటనే అక్కడికి వెళ్లాడు, అతిథుల్ని రక్షించే పనిలో పోలీసుల బలగాలకు అన్నిరకాల సహాయాన్ని అందించాడు… గొప్పతనం ఏమిటంటే..? దాడి జరిగిన తరువాత ఏ ఒక్క హోటల్ సిబ్బంది తప్పించుకుని పారిపోలేదు, ప్రాణాలకు తెగించి మరీ కర్తవ్య నిర్వహణలో మునిగిపోయారు… ప్రతి అతిథినీ రక్షించే ప్రయత్నం చేశారు… ఆ ప్రయత్నంలో కొందరు ప్రాణాలూ కోల్పోయారు…
ఆ సిబ్బంది కమిట్మెంట్ ప్రపంచ స్థాయి పరిశోధకులనూ విస్తుపరిచింది… హార్వర్డ్ యూనివర్శిటీ ప్రత్యేకంగా ఓ పరిశోధనే చేసింది… తమ ప్రాణాలు కాపాడుకోవడానికి అన్ని రకాల ఎగ్జిట్ రూట్స్ తెలిసినా సరే ఏ ఒక్క సిబ్బంది అతిథులను వదిలేసి పారిపోలేదు… ఇంకా భారతీయ తత్వం బలంగా ఉన్న గ్రామాలు, చిన్న పట్టణాల నుంచి… మామూలు విద్యార్హతలున్నా సరే, ఎంపిక చేసి, శిక్షణ ఇచ్చి, వాళ్లలో ‘విలువలకు, ప్రమాణాలకు’ పదును పెట్టేది ఆ హోటల్…
ప్రాణాలు కోల్పోయిన తన సిబ్బంది, గాయపడిన సిబ్బంది, వాళ్ల కుటుంబాల బాగోగులు (పిల్లల చదువులు, ఉపాధి, పెళ్లిళ్లతో సహా) స్వయంగా చూసుకున్న టాటా ట్రస్టు… హోటల్ పరిసరాల్లో బాధిత కుటుంబాలను కూడా ఆదుకుంది… రతన్ టాటా మాటల మనిషి కాదు, మానవతాచేతల మనిషి… ఐతే, ఒక సోషల్ పోస్ట్ ఆశ్చర్యపరిచింది… అదిలా సాగింది…
‘‘ఆ దాడి సమయంలో దేవిక అనే చిన్న పాప హోటల్ కు వచ్చి వుంది , ఆమెను గది బయటపెట్టి ఆమె తండ్రి , మామయ్య toilet లోకి వెళ్ళి వున్నారు .., ఆ దాడిలో వాళ్ళిద్దరూ మరణించారు. ఆ పాప బ్రతికింది , ఆనాడు హోటల్లో వందల మందిని చంపిన నరరూప రాక్షసుడు అజ్మల్ కసబ్ ను గుర్తుపట్టింది ఆ చిన్న పాపే… ఆ చిన్న పాపను ఆసుపత్రిలో చేర్పించి , కోలుకొనేలా చేసి , ఆమె చదువుకు ఏర్పాట్లు చేసి , ఉద్యోగం కూడా తన కంపెనీలోనే ఇస్తానని చెప్పి , ఆమె పెళ్ళి బాధ్యతను కూడా కూడా రతన్ టాటా తీసుకొన్నారు…’’
తాజ్ హోటల్ పరిసరాల్లో చిరువ్యాపారుల కుటుంబాల్ని టాటా ఆదుకున్నది నిజమే… కానీ ఈ అమ్మాయి కథ వేరు… ఆమె పేరు దేవిక రొతవాన్… దాడి జరిగినప్పుడు ఆమె వయస్సు తొమ్మిదేళ్లు… ఆ సమయంలో వాళ్లు హోటల్‌లో లేరు… ఆ హోటల్‌లో ఉండే స్థోమత ఉన్న కుటుంబం కాదు అది… తండ్రి నట్వర్‌లాల్, డ్రైఫ్రూట్స్ చిరువ్యాపారి… సోదరుడు జయేష్… వీళ్లు పూణెకు వెళ్లడానికి ఓ రైలు కోసం స్టేషన్‌లో నిరీక్షిస్తూ ఉన్నప్పుడు కసబ్ టీం కాల్పులు జరిపింది విచక్షణ రహితంగా…
అమ్మాయి కాలిలోకి కూడా ఓ బుల్లెట్ దూరింది… ఆరు సర్జరీలు జరిగి 65 రోజులపాటు హాస్పిటల్‌లో ఉంది ఆ అమ్మాయి… ఆమె కథను ఏదో న్యూస్ స్టోరీలో చూశాక టాటా ట్రస్టు ఆమెను పిలిపించుకుని గ్రాడ్యుయేషన్ దాకా చదువు చెప్పించింది… స్కూల్ మొదట ఆమెకు అడ్మిషన్ ఇవ్వడానికి మొరాయించింది… పిల్లలు ఏడ్పించేవారు… కుటుంబం నానా అవస్థలూ పడింది…
సోదరుడికి ఏదో ఎముకల వ్యాధి… తండ్రి వ్యాపారం మూలపడింది… ట్రస్టు కొంత సాయం చేసింది… దాడి తరువాత రాజస్థాన్ వెళ్లిపోయింది ఆ కుటుంబం, కానీ ఈ కేసు విచారణ కోసమే ముంబైకి వచ్చింది…
మహారాష్ట్ర ప్రభుత్వం ముష్టి పరిహారాన్ని ఇవ్వడానికి కూడా నానారకాలుగా సతాయించింది… ఒక ఇల్లు కట్టిస్తానని చెప్పిన సర్కారు మొహం చాటేస్తే మొన్నమొన్నటివరకూ హైకోర్టులో కొట్లాడింది ఆమె ఆ ఇంటి కోసం… హైకోర్టు ప్రభుత్వానికి అక్షింతలు వేసింది… ఆమెను పెంచి పెళ్లి చేయడం దాకా అని కాదు గానీ… ఆ కుటుంబానికి టాటా ట్రస్టు చాలారకాలుగా అండగా నిలబడిన మాట నిజం… తాజా టీవీ స్టోరీలో ఆమె రతన్ టాటా దేవుడని చెబుతోంది… లింక్ చూడండి…
https://x.com/TimesNow/status/1844439026096336994
ఆమె పలు టీవీ షోలలో పాల్గొంది… సభల్లోనూ ఉపన్యసించేది… కౌన్ బనేగా కరోడ్‌పతిలో కనిపించింది… ఇండియన్ ఐడల్ కోసమూ వెళ్లింది… ఆమధ్య రాహుల్ గాంధీ పాదయాత్రలో కూడా తనతోపాటు కనిపించింది… యాక్టివ్… ఇదీ ఆమె కథ…
Share this Article