Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

రఫెల్ నదాల్..! సిగ్గు మాత్రమే కాదు… టాలెంట్ కూడా చాలా ఎక్కువ…!

October 11, 2024 by M S R

.

ఏ రంగంలోనైనా దిగ్గజం అని పేరు తెచ్చుకోవడం చాలా కష్టం. కానీ చిన్న వయసులోనే ఆ పేరుకు అర్హత సాధించిన ఆటగాళ్లలో ఒకడు రఫెల్ నదాల్. ‘క్లే కోర్ట్ కింగ్’గా పేరు తెచ్చుకున్న రఫా చాలా సిగ్గరి. శారీరికంగా, మానసికంగా చాలా ధృఢమైన వ్యక్తి నదాల్, కానీ నలుగురిలో ఉండాలంటే సిగ్గు.. నలుగురితో కలసి మాట్లాడాలంటే సిగ్గు. చివరకు ఇంటర్వ్యూలు ఇవ్వడానికి కూడా చాలా సిగ్గుపడతాడంటా. ఆటలో ఎంత ఓపిక, దూకుడు, కచ్చితత్వం ప్రదర్శిస్తాడో చూసిన వాళ్లకు.. చాలా జోవియల్‌గా అందరితో కలిసిపోతాడేమో అని అనుకుంటారు. కానీ హయ్ రఫా.. అని చిన్న పిల్లోడు పిలిచినా సిగ్గుపడిపోతాడంటా. అయితే చిన్నప్పటి నుంచి రఫా తీరే అంతంటా. అసలు రఫా ఎక్కడి నుంచి ఎదిగాడో ఒక సారి చూద్దాం.

మన ఇండియాకు అండమాన్, లక్షద్వీప్ ఎలా దూరంగా విసిరేయబడినట్లు ఉంటాయో.. అలాగే స్పెయిన్ దేశానికి తూర్పున.. మధ్యధరా సముద్రంలో మయోకా (Mallorca) అనే దీవులు ఉంటాయి. ఆ దీవుల్లో మేనకోర్ (Manacor) అనే పట్టణంలో 1986 జూన్ 3న రఫెల్ నదాల్ జన్మించాడు. రఫెల్ ఫ్యామిలీ చాలా సంపన్నమైనదే. తండ్రి సెబాస్టియన్ నదాల్ హోమర్‌కు సొంతగా చాలా వ్యాపారలు ఉన్నాయి. తండ్రికి ఒక ఇన్స్యూరెన్స్ కంపెనీతో పాటు గ్లాస్, విండోస్ ఇండస్ట్రీ కూడా ఉంది. అంతే కాకుండా అదే దీవుల్లో ఒక ఖరీదైన రెస్టారెంట్ కూడా నడుపుతుంటాడు. తల్లి అనా మారియా పెరీరాకు సొంతగా ఒక పెర్‌ఫ్యూమ్ షాప్ ఉండేదట. కానీ రఫెల్ నదాల్, ఆయన సోదరి మారియా ఇసబెల్‌ను చూసుకోవడానికి ఆ షాప్ బంద్ చేసింది.

Ads

రఫెల్ నదాల్ ఫ్యామిలీలో క్రీడలకు మంచి ప్రాధాన్యత ఇచ్చేవారట. రఫెల్ బాబాయ్ మిగుయేల్ ఏంజెల్ నదాల్ హోమర్‌ స్పెయిన్‌ నేషనల్ ఫుట్‌బాల్ జట్టుకు ఆడాడు. ఆర్సీడీ మేనకోర్, ఎఫ్‌సీ బార్సిలోనా టీమ్స్‌లో స్ట్రైకర్, మిడ్ ఫీల్డర్‌గా ఆడాడు. రఫెల్ చిన్నప్పుడు రొనాల్డోకు మంచి ఫ్యాన్ అట. రోనాల్డో అంటే ఇప్పటి ఫేమస్ క్రిస్టియానో రొనాల్డో కాదు. బ్రెజీలియన్ స్ట్రైకర్ రొనాల్డో అన్నమాట. రఫాను చిన్నప్పుడు తన బాబాయ్ ఏంజెల్ నదాల్.. బార్సిలోనా టీమ్ డ్రెస్సింగ్ రూమ్‌లోకి రొనాల్డోను చూపించడానికి తీసుకెళ్లాడట. అప్పుడే.. తాను కూడా ఫుట్‌బాలర్ అవ్వాలని కలలు కన్నాడట.

రఫా వాళ్ల ఇంకో బాబాయ్ టోనీ నదాల్ అదే ద్వీపాల్లో ఉన్న మేనకోర్ టెన్నిస్ క్లబ్‌లో కోచ్‌గా పని చేస్తుండేవాడట. దీంతో రఫాను అదే క్లబ్‌లో టోనీ చేర్చాడు. అలా తన చిన్నప్పుడే రఫెల్ నదాల్ టెన్నిస్ రాకెట్ పట్టుకున్నాడు. అయితే మొదట్లో టెన్నిస్ అంటే బోర్ అని ఇంట్లో చెప్పేవాడట. టెన్నిస్ క్లబ్ నుంచి ఇంటికి వచ్చాక.. ఫ్రెండ్స్‌తో కలిసి ఫుట్‌బాల్ ఆడేవాడట. కానీ క్లబ్‌లో కోచింగ్ తీసుకునే సమయంలో రఫా నాచురల్ టాలెంట్ ఉందని గమనించిన టోనీ.. టెన్నిస్‌లో ఉండే మెలకువలు అన్నీ నేర్పించాడట. నెమ్మదగా టెన్నిస్ అంటే ఇష్టం పెంచుకున్న నదాల్.. ఆటలో అద్భుతంగా రాణించడం మొదలు పెట్టాడట. అలా స్పెయిన్‌కు దూరంగా ఉండే ద్వీపాల నుంచి టెన్నిస్ జర్నీ మొదలు పెట్టిన రఫా.. ఆ తర్వాత ప్రపంచమే ఆశ్చర్యపోయేలా ఎదిగాడు.

చిన్నప్పుడు నదాల్‌ను టెన్నిస్ విషయంలో అంకుల్ టోనీ విపరీతంగా కష్టపెట్టేవాడట. తన కంటే పెద్ద వాళ్లతో గంటల తరబడి టెన్నిస్ ఆడిస్తే.. ఒళ్లంతా నొప్పులతో ఇంటికొచ్చి ఏడ్చేవాడట. నదాల్ తండ్రి కూడా ఈ విషయంలో చాలా కంగారు పడ్డాడట. కానీ నదాల్ టాలెంట్ మరింత షైన్ కావాలంటే ఇలాంటి కోచింగ్ అవసరమని టోనీ చెప్పడంతో ఆయన కూడా సైలెంట్ అయ్యాడట. నదాల్ తన 8వ ఏటనే అండర్ 12 రీజనల్ టెన్నిస్ చాంపియన్‌షిప్ గెలిచాడంటే.. అతడు ఎంత కష్టపడి ఉంటాడో అర్థం చేసుకోవచ్చు.

ఫోర్ హ్యాండ్ షాట్ అంటే నదాల్ గుర్తుకొస్తాడు. మొదట్లో రెండు చేతులు ఉపయోగించి ఈ షాట్ ఆడేవాడట. అయితే లెఫ్ట్ హ్యాండ్‌తో ఈ షాట్ ఆడితే మరింత అడ్వాంటేజ్‌గా మారుతుందని టోనీ చెప్పడంతో తన ఆటతీరు మార్చకున్నాడట. ఇక నదాల్ 2004లో అప్పటి వరల్డ్ నెంబర్ వన్ ఆండీ రాడిక్‌ను డేవీస్ కప్ ఫైనల్స్‌లో ఓడించడంతో ప్రపంచ మంతా తెలిసిపోయాడు. డేవీస్ కప్ సింగిల్స్‌ను గెలిచిన అతి చిన్న వయస్కుడిగా నదాల్ రికార్డు సృష్టించాడు.

ఇక నదాల్‌ అంటే గుర్తొచ్చేది ఫ్రెంచ్ ఓపెన్. ఏకంగా 14 సార్లు ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్స్ గెలిచాడు. నదాల్ ఖాతాలో మొత్తం 22 గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ ఉన్నాయి. ఇక 92 ఏటీపీ టైటిల్స్ కూడా రఫెల్ ఖాతాలో చేరాయి. ఓపెన్ ఎరాలో లాంగెస్ట్ విన్నింగ్ స్ట్రీక్ కలిగి ఉన్న టెన్నిస్ ప్లేయర్ నదాల్ మాత్రమే. 2005 ఏప్రిల్ నుంచి 2007 మే మధ్యలో ఏకంగా 81 మ్యాచ్‌‌లను క్లే కోర్టులో ఓడిపోకుండా గెలుచుకుంటూ వచ్చాడు. వరుసగా 50 సెట్లు గెలిచిన రికార్డు కూడా నదాల్ పేరుతోనే ఉంది.

నదాల్ 14వ ఏట ప్రొఫెషనల్ టెన్నిస్ సర్క్యూట్‌లోకి అడుగు పెట్టాడు. 20 ఏళ్లు నిండక ముందే 16 టైటిల్స్ గెలిచాడు. ఇందులో ఒక ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్ కూడా ఉంది. నదాల్ టీనేజ్‌లో ఉన్నప్పుడే వరల్డ్ నంబర్ 1గా మారాడు.దీంతో పాటు పదేళ్ల పాటు ఏదో ఒక గ్రాండ్ స్లామ్ టైటిల్ గెలుస్తూనే వచ్చాడు. తన కెరీర్‌లో 14 ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్స్ కాకుండా.. రెండుసార్లు ఆస్ట్రేలియన్ ఓపెన్, రెండుసార్లు వింబుల్డన్, నాలుగు సార్లు యూఎస్ ఓపెన్ టైటిల్స్ గెలిచాడు. 2008లో నదాల్ ఒలింపిక్ విజేతగా కూడా నిలిచాడు. 2016లో ఒలింపిక్స్ డబుల్స్‌లో గోల్డ్ సాధించాడు.

గత కొన్నాళ్లుగా గాయాలతో సతమతం అవుతున్న నదాల్.. తాజాగా రిటైర్మెంట్ ప్రకటించాడు. టెన్నిస్‌లో దిగ్గజ ప్లేయర్స్ అనబడే రోజర్ ఫెదరర్, నోవాక్ జకోవిచ్, రఫెల్ నదాల్‌లు ఒకే ఎరాలో ఉండటం.. వాళ్లందరినీ ఒకేసారి చూడగలగడం ఒక టెన్నిస్ అభిమానిగా అదృష్టమనే భావిస్తాను. బై బై రఫా.. టెన్నిస్ విల్ మిస్ యూ…… (జాన్ కోరా)

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • సింగరేణి మట్టి కూడా బంగారమే… అత్యంత విలువైన ‘రేర్ ఎర్త్ మినరల్స్’…
  • ఎందుకు కట్టాలి టోల్..? భలే బాగా చెప్పారు యువరానర్…
  • వేరే గ్రహాల దాకా దేనికి..? ఈ భూమి లోపలే తెలియని ఏవో ప్రపంచాలు…!
  • భలే మ్యాషప్ చేశారబ్బా..! అరుదైన స్వరవిన్యాసాలు, స్వరప్రయోగాలు..!!
  • సింగరేణి అంటే నల్లబంగారమే కాదు… ఇప్పుడిక అసలు బంగారం కూడా..!!
  • అవునూ.., హిందూ ఉత్సవాల వేళ భారత్ మాతాకీ జై అనకూడదా..?!
  • తెలుగు అభ్యర్థి..! ఇండియా కూటమిలో రేవంత్ రెడ్డి మాట చెల్లుబాటు..!!
  • మార్వాడీ గో బ్యాక్…! అశాంతి రేపే అసాంఘిక శక్తులకు చుక్కెదురు…!!
  • ఎక్కడో న్యూజిలాండ్‌లో కనిపించేవి… ఇప్పుడివి ఖమ్మం అడవుల్లో ప్రత్యక్షం…
  • సింహాసనం , నిరీక్షణ , స్వాతిముత్యం… నడుమ పుణ్యస్త్రీ స్లో సక్సెస్…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions