ఇదొక ఇంట్రస్టింగు కేసు… మన పితృస్వామిక వ్యవస్థ లక్షణాలు, మన సమాజంలో బలంగా పాతుకుపోయిన పాత భావనలతోపాటు కాలానికి అనుగుణంగా వస్తున్న కొత్త చట్టాలు, చిక్కులు, నైతిక విషయాలు ఇందులో చాలా ఉన్నాయి…
ఢిల్లీ హైకోర్టుకు ఒక కేసు వచ్చింది… కొన్నాళ్ల క్రితం కేన్సర్‌తో మరణించిన ఓ యువకుడి తల్లిదండ్రులు ఈ పిటిషన్ వేశారు… సారాంశం ఏమిటంటే..? వాళ్ల కొడుకు కేన్సర్ చికిత్స పొందుతున్నప్పుడు ఓ హాస్పిటల్ రూల్స్ ప్రకారం తన వీర్యాన్ని అతి శీతల స్తితిలో భద్రపరిచింది… కేన్సర్ చికిత్స కారణంగా వీర్యం నాణ్యత దెబ్బతింటుందనే భావనతో చాలా హాస్పిటల్స్ ఈ రూల్ పాటిస్తాయి…
దురదృష్టవశాత్తూ ఆ యువకుడు మరణించాడు… ఈ తల్లిదండ్రులు ఏమంటారంటే..? మాకున్నది ఒకే కొడుకు… మా వంశం కొనసాగాలంటే వాడి వారసత్వం అవసరం… వాడేమో చనిపోయాడు, సో, ఆ వీర్యాన్ని మాకు ఇప్పించండి… సరోగసీ ద్వారా మనవడిని కంటాం, అనుమతించండి, హాస్పిటల్ వాళ్లు అలా వీర్యం ఇవ్వడానికి అంగీకరించడం లేదు అంటున్నారు, మాకు న్యాయం చేయండి అనేది ఆ పిటిషన్ స్థూల సారాంశం…
Ads
ఒకవేళ భాగస్వామి గనుక బతికి ఉంటే, వాళ్లు ఆ వీర్యం తీసుకోవడానికి అనుమతిస్తాం, అంతేతప్ప వేరేవాళ్లకు వీర్యంపై హక్కు లేదు, అలా ఇస్తే మేం లీగల్‌గా చిక్కుల్లో పడతాం అనేది హాస్పిటల్ వాదన… కానీ మా కొడుక్కి అసలు పెళ్లే కాలేదు, భార్య లేనప్పుడు తన దేహంపై మేమే కదా వారసులం, కావాలంటే వారసత్వ చట్టాలు చదవండి అంటారు ఈ తల్లిదండ్రులు…
నో, నో… దైహిక సమస్యలతో పిల్లలు పుట్టే అవకాశాలు లేని జంటలకు మాత్రమే, అదీ నిర్దిష్ట ప్రమాణాలు, పరిమితులు, వైద్యపర్యవేక్షణలో మాత్రమే సరోగసీకి అనుమతి ఇస్తామని… కొత్త చట్టాలు స్పష్టంగా అవే నిర్వచిస్తున్నాయని ప్రభుత్వం ఈ కేసులో తన వాదనను కోర్టుకు సమర్పించింది… వాళ్లు తాతలు కావడానికి రూల్స్ బ్రేక్ చేయడం కరెక్టు కాదని ప్రభుత్వ వాదన…
ఇక్కడ మళ్లీ రెండుమూడు అంశాలు… 1) మనది పితృస్వామ్య వ్యవస్థ కాబట్టి, ఓ మనవడి ద్వారా వారసత్వం, వంశం కొనసాగింపును వాళ్లు కోరుకుంటున్నారు సరే, కానీ కొడుకే పుట్టాలని ఏముంది..? ఆడపిల్ల పుడితే..? 2) ఉన్న ఒక్క కొడుకు మరణించాడు సరే, బిడ్డలు ఉన్నారు కదా, వాళ్ల సంతానంలో ఒకరిని దత్తత తీసుకోవచ్చు కదా… 3) అసలు ఒక మనిషి దేహాన్ని ‘ప్రాపర్టీ’గా పరిగణించవచ్చా..? భద్రపరిచిన వీర్యం కూడా ఓ ప్రాపర్టీయేనా..? 4) పుట్టే పిల్లాడో పిల్లో పోషణ బాధ్యతలు ఎవరు తీసుకుంటారు..?
ఖచ్చితంగా తమ కొడుకు దేహం తమ ప్రాపర్టీయే అంటారు ఈ తల్లిదండ్రులు… ఎవరు పుట్టినా సరే పూర్తి పోషణ బాధ్యతలు తాము భరిస్తామని ఈ ముసలి జంటతోపాటు వాళ్ల బిడ్డలు కూడా కోర్టుకు రాసిచ్చారు… హైకోర్టు ప్రపంచవ్యాప్తంగా ఏయే దేశాల్లో ఏయే పద్ధతులు అనుసరిస్తున్నాయో పరిశీలించింది… ఇజ్రాయిల్‌లో ఓ కేసు… యుద్ధంలో మరణించిన తమ కొడుకు వీర్యాన్ని తల్లిదండ్రులు తీసుకుని, సరోగసీ పద్ధతిని అనుసరించారు… ఓ అమ్మాయి పుట్టింది… అక్కడి కోర్టులు దానికి అనుమతించాయి…
చివరకు ఢిల్లీ హైకోర్టు ఆ యువకుడి వీర్యాన్ని తన తల్లిదండ్రులు తీసుకోవడానికి అనుమతించింది… తను మరణించేనాటికి సరోగసీ కొత్త చట్టాలు అమల్లోకి రాలేదు కాబట్టి తనకు అవి వర్తించబోవనీ క్లారిటీ ఇచ్చింది… ఐతే ఇది అన్ని కేసులకూ వర్తించదనీ, ఇలాంటి కేసుల్లో రకరకాల అంశాలు పరిశీలించాకే నిర్ణయానికి రావల్సి ఉంటుందనీ సూచించింది… అవునూ… మగ సంతానమే వారసత్వమా..? ఇంకా ఈ రోజుల్లోనూ..!!
Share this Article