హీరో సుధీర్ బాబు… కాదు, నటుడు సుధీర్ బాబు… ఎందుకంటే, తను టిపికల్ తెలుగు హీరో కాదు, ఒక నటుడిగా భిన్నమైన పాత్రల్ని ఎంచుకుంటూ, అంగీకరిస్తూ… ఆయా పాత్రలకు అతి గాకుండా, తగ్గకుండా సరైన నటనను అందిస్తూ… భిన్నమైన కెరీర్ నిర్మించుకునే సుధీర్ బాబుకు ఆ కోణంలో అభినందనలు…
అర్జెంటుగా తెలుగు స్టార్ హీరో తరహాలో తరమడాలు, తురమడాలు… తెగ నరకడాలు, నెత్తుటేర్లు… సోకాల్డ్ కమర్షియల్ వాసనలు, పాన్ ఇండియా ప్రయాసలు, ఎలివేషన్లు గట్రా గాకుండా వైవిధ్యమైన పాత్రలకు ప్రయత్నిస్తున్నాడు… గుడ్… అందరి దృష్టీ పెద్దగా నాణ్యత లేని సోది రజినీకాంత్ ఇమేజీ మార్క్ సినిమా వేట్టయన్ మీద ఉంది గానీ… సుధీర్ బాబు నటించిన మా నాన్న సూపర్ హీరో సినిమాకు అంతగా బజ్ రాలేదు…
నిజానికి మంచి కథ… ఇంట్రస్టింగు స్టోరీ లైన్… ఒక తండ్రి తన కొడుకును తాత్కాలికంగా అనాథాలయంలో ఉంచితే, తను కొన్నాళ్లపాటు తిరిగి రాలేకపోతే… ఆ కొడుకును మరో తండ్రి దత్తత తీసుకుంటాడు… కానీ ఆ వెంటనే తనకు అన్నీ నష్టాలే… కొడుకే అరిష్టమని ద్వేషం పెంచుకుంటాడు… పెంచిన తండ్రి మీద కొడుక్కి ప్రేమ, ఆ పెంపుడు తండ్రి కష్టాలు తీర్చడానికి తిప్పలు… ఆ తిప్పల్లోనే కన్నతండ్రి డబ్బే కాజేసే ప్రయత్నం… తన తండ్రే అని తెలియక…
Ads
ఇద్దరు తండ్రులు, ఒక కొడుకు నడుమ ప్రేమలు, ద్వేషాల కథ… సరే, తెలుగు సినిమా అన్నాక హీరోయిన్ ఒకతి ఉండి ఏడ్వాలి కాబట్టి ఓ హీరోయిన్… ఓ లవ్ ట్రాక్… ఏదో రాజు సుందరం అంటూ దర్శకుడు కథను మధ్యలో దారితప్పించాడు… (ఆమేరకు ఇప్పుడు నరికేసినా నష్టమేమీ లేదు, పైగా ప్రేక్షకుడికి రిలీఫ్…) ఆ కాస్త బోరింగ్ ఎపిసోడ్స్ తప్పితే మిగతా సినిమా అంతా బాగానే డీల్ చేశాడు… పెద్దగా హీరో హీరోయిన్ల లవ్ మీద కూడా కాన్సంట్రేషన్ లేదు…
కొడుకుగా సురేష్ బాబు సటిల్డ్ నటన… ఆ పాత్రకు సరిపోయింది… చెప్పాల్సింది గోపీచంద్ పాత్ర గురించి… పాత్ర బాగుంది, తన నటనా బాగుంది… ఈ ఇద్దరి నడుమ సీన్లు పండాయి కూడా..! సాయాజీ షిండే పర్లేదు… నిజానికి రొడ్డ కొట్టుడు సూపర్ హీరోయిక్ ఫార్ములా సినిమాల నడుమ మొన్న వచ్చిన సత్యం సుందరం సినిమా భిన్నమైంది… కొన్ని ఎమోషన్లను దర్శకుడు చక్కగా డీల్ చేసి ప్రేక్షకులు, విమర్శకులతో చప్పట్లు కొట్టించుకున్నాడు… కార్తి, అరవింద స్వామి పోటీలు పడి నటించారు…
ఇండియన్ సినిమా అంటేనే ప్రేమకథలు, పగలు, ప్రతీకారాలు, యాక్షన్ సీన్లు గట్రా రాజ్యమేలుతున్నవేళ… సున్నితమైన బంధాలను ఆసక్తికరంగా తెరకెక్కించడం ఓ సాహసం… ఓ పరీక్ష… ‘మా నాన్న సూపర్ హీరో’ సినిమా విషయంలో దర్శకుడు కంకర అభిలాష్ గొప్ప ప్రతిభ ప్రదర్శించాడు అనలేకపోయినా అన్యాయం మాత్రం చేయలేదు ఆ కథకు… మధ్యలో కథ దారితప్పకుండా ఉంటే సినిమా ఇంకా బాగుండేదేమో… ఐనాసరే, మంచి ప్రయత్నం… కీప్ దిస్ స్పిరిట్ అభిలాష్ అండ్ సుధీర్ బాబూ..! అబ్బే, థియేటర్ దాకా వెళ్లి చూసేంత సీన్ ఉందా అనిపిస్తే మాత్రం, ఓటీటీ వరకూ ఆగయినా సరే, తప్పకుండా ఓ లుక్కేయవచ్చు..!!
Share this Article