ఇది నాకు తెలిసిన దసరా కాదు… ఇదీ నగరంలో బతికే ఓ మిత్రుడి వ్యాఖ్య… నిజమే… సరిగ్గా విశ్లేషించలేమేమో గానీ… తెలిసినవాళ్లెవరైనా చెప్పాలేమో గానీ… నిజంగానే ఇది మాకు తెలిసిన దసరా కాదు…
కుప్పలుతెప్పలుగా సోషల్ సందేశాలు… ప్రతి దాంట్లోనూ దుర్గ బొమ్మతో కూడిన శుభాకాంక్షలు… నిజానికి తెలంగాణ సంస్కృతిని చిన్నప్పటి నుంచి ఎరిగినవాళ్లకు ఇదంతా కొత్త, భిన్నం… కాస్త చిరాకు కూడా… ఒక జమ్మి చెట్టు, ఒక పాలపిట్టతో వచ్చే సందేశాలు ఒకటీరెండు శాతం కూడా లేవు… ఎందుకంటే..? ( పైగా duserrah అంటూ పొల్యూటెడ్ భాష )
తెలంగాణ పండుగల సంస్కృతిలో దుర్గ, గౌరి, శక్తి ఎవరైనా సరే… సద్దుల బతుకమ్మతోనే నవరాత్రులు సరి… బొడ్డెమ్మతో మొదలుపెట్టి సద్దుల బతుకమ్మ దాకా రోజుల తరబడీ బతుకమ్మను పూజించడమే తెలంగాణలో శక్తి పూజ, ప్రకృతి పూజ… అచ్చంగా మహిళల పండుగ… సద్దుల బతుకమ్మ రోజున మాత్రం ఇంటిల్లిపాదికీ పండుగ…
Ads
నవమితో అది సరి… దశమి నాడు దసరా… తెలంగాణలో దసరా అంటే కొత్త బట్టలు… ఉన్నోడైనా లేనోడైనా… ఉన్నంతలో కొత్త బట్టలు… వ్యాపారులు ఎంతో కొంత బంగారం కొంటారు… (అక్షయ తృతీయలు గట్రా ఉత్తరాది నుంచి వచ్చి పడిన, బంగారం వ్యాపారుల మార్కెటింగ్ ప్రచారాలు మాత్రమే…) ఇప్పటి ధరల్లో మధ్య తరగతికీ బంగారం కొనడం కష్టమే…
ఏ వాహనమున్నా సరే దసరా రోజున కడిగించి, బొట్లు పెట్టి, పూజ చేయిస్తారు… చేస్తారు… పెద్ద వాహనాలైతే గుమ్మడి కాయను, కొబ్బరికాయను కొడతారు… వాహనాలకు దండలు, ఇళ్ల గుమ్మాలకు దండలు… కుటుంబ స్థోమతను బట్టి మాంసాహారులైతే, ఏడాదంతా తినకపోయినా, తినలేకపోయినా సరే, దసరా రోజున మాత్రం ఎంతోకొంత మాంసం వండుకుంటారు… ఇంటికొచ్చేవాళ్లకు ఓ ముక్క తినిపిస్తారు… శాకాహారులైతే ప్రధానంగా నూనె వంటకాలు… ప్రత్యేకించి పాలతో చేసే పాయసం… ఎక్కువగా సేమ్యా, సాబుదానితో చేసే పాయసం…
పలు ఊళ్లల్లో ఈరోజుకూ పోగులు వేస్తారు, అంటే గొర్రెనో, మేకనో కోసి, మాంసం కుప్పలు వేస్తారు… అందరూ వాటినే కొంటారు… భారీగా మాంసం కొనుగోలు చేయలేని అశక్తత కాబట్టి…
అంటే… బజ్జీలు, పకోడీలు, వడప్పలు… ముఖ్యంగా మిర్చి బజ్జీలు… సాయంత్రం కాగానే కొత్త బట్టలేసుకుని, ఊరివాళ్లతో, కుటుంబసభ్యులతో, స్నేహితులతో ఊరవతల శమీ చెట్టు వద్దకు వెళ్లాలి… పూజించాలి, ప్రదక్షిణలు చేయాలి… పాలపిట్టను చూడాలి… నేరుగా గుడికెళ్లి దండం పెట్టుకుని, బంధుస్నేహితుల ఇళ్లకు వెళ్లడం… జమ్మి ఆకు, పచ్చిజొన్నలు కలిపి చేతుల్లో పెట్టి అలుముకోవడం పండుగ మర్యాద… పెద్దవాళ్లయితే కాళ్లు మొక్కి ఆశీస్సులు తీసుకోవడం…
దసరా పండుగ అంటేనే వీలైనంత మందిని కలవడం, జమ్మి పెట్టడం… చాలా ఊళ్లల్లో ఈరోజుకూ ఓ ఆనవాయితీ ఉంది… బొడ్రాయి దగ్గరో, గుడి దగ్గరో శమీ కొమ్మను నాటి, పూజ చేయించడం, పూజ అయిపోగానే ఆ ఆకును తెంపుకుని జేబుల్లో పోసుకుని ఇక బయల్దేరడం… ఓ రాత్రి దాకా బంధుమిత్రుల ఇళ్లకు వెళ్లడం నడుస్తూనే ఉంటుంది… ఇదే దసరా…
మరీ ఓమోస్తరు పట్టణాల్లో అయితే రావణదహనం జరిపించేవారు… తెల్లారాక పిల్ల దసరా అంటారు… అంటే దసరా రోజు నాటి మత్తును హ్యాంగోవర్‌ను దింపే పండుగ… దసరా అంటే ఛడావ్, పిల్ల దసరా అంటే ఉతార్… ఇదే తెలంగాణ దసరా… కానీ ఇప్పుడు దుర్గ వచ్చి చేరింది… గుజరాత్ నుంచి ఏపీ దాకా దసరా అంటే దేవీ నవరాత్రులు… ఉత్సవాలు… బహుశా తెలంగాణ మీద బలంగా పడిన ఆంధ్రా సంస్కృతి ప్రభావం ఏమో… ఏళ్లుగా తెలంగాణలో సెటిలైన ఆంధ్రులు బతుకమ్మను పట్టించుకోలేదు గానీ దేవి నవరాత్రుల్ని అలవాటు చేశారు… అసలు దసరా ఏమిటో మరిచిపోయేట్టు చేశారు.,.
నార్త్ నవరాత్రుల కల్చర్ వేరు… ఆ పూజలు, ఆ ఉపవాసాలు, నాట్యాలు గట్రా వేరు… ఎటొచ్చీ అన్నీ మిక్సయిపోయిన దసరా హైదరాబాదు వంటి నగరాల్లో కొత్త దసరాలా కనిపిస్తోంది…. టీవీల్లో వచ్చే దిక్కుమాలిన పిచ్చి స్పెషల్ రియాలిటీ షోలు… వాటిల్లోనూ బూతు జోకులు, తిక్క స్టెప్పులు… టీవీల్లోనే పండుగ… బుట్టల్లో బంధించుకొచ్చిన పాలపిట్టను చూసి, దండం పెట్టుకోవడమే… జమ్మి కొనుక్కోవడమే… ఎవరింట్లో వాళ్లు…
తెలిసిన అన్ని ఇళ్లకూ వెళ్లి ఆశీస్సులు, శుభాకాంక్షలు, ఆత్మీయ కౌగిలింతలు పొందే పండుగ కాస్తా… జస్ట్, ఎవరింట్లో వాళ్లే అత్యంత పరిమితంగా చేసుకునే పండుగ అయిపోయింది… సరే, ఊరు వేరు… నగరం వేరు… ఆంధ్రాలో సంక్రాంతి పెద్ద పండుగ, కానీ తెలంగాణలో దసరాయే పెద్ద పండుగ… అల్లుళ్లను పిలిచి మర్యాద చేసి, కట్నాలు పెట్టే పండుగ కూడా… అందుకే సద్దుల బతుకమ్మకు బిడ్డలొస్తారు, దసరా రోజున అల్లుళ్లొస్తారు… అదీ పండుగ…
తెలంగాణలో ఉన్నోడైనా లేనోడైనా… తమ ఆర్థిక స్థోమతను బట్టి… తప్పకుండా జరుపుకునేది దసరా పండుగే… మళ్లీ యాదికొస్తున్నయ్… దసరా అంటే జమ్మి, దసరా అంటే పాలపిట్ట… దసరా అంటే మిఠాయిలు, పిండి వంటలు… దసరా అంటే మందూ మాంసం… దసరా అంటే ఓ ఏడాదికి సరిపడా సెలబ్రేషన్… దసరా అంటే అలయ్ బలయ్… దసరా అంటే కొత్త బట్టలు… దసరా అంటే వాహనపూజ… దసరా అంటే ఆయుధపూజ… ప్చ్… నగరం దసరాకు దూరమైపోయింది..!!
Share this Article