అందరూ గ్రాఫిక్స్ నాణ్యతను తిట్టిపోస్తున్నారు… అంతేకాదు, పలు ఇంగ్లిష్ సినిమాల క్రియేటివ్ అంశాల్ని ఎత్తుకొచ్చేశారంటూ, కాపీ సీన్లను కిచిడీ కొట్టారనీ విమర్శిస్తున్నారు… చిరంజీవి హీరోగా వచ్చే ఫాంటసీ చిత్రం విశ్వంభర టీజర్ మీద మొత్తానికి దుమ్మురేగుతోంది…
నో, నో, మా మెగాస్టార్ సినిమా మీద కావాలనే యాంటీ ఫ్యాన్స్ దుష్ప్రచారం చేస్తున్నారని కొందరు బాధపడుతున్నారు… (యాంటీ ఫ్యాన్స్ అంటే ద్వేషులు అట… అభిమానులకు వ్యతిరేక పదం…) సాహో, బాహుబలి వంటి సినిమాల మీద ఇలాంటి విమర్శలు వచ్చాయా, ఈ విశ్వంభరను కావాలనే టార్గెట్ చేస్తున్నారనేది వాళ్ల వాదన…
కొందరైతే ఏకంగా ఆదిపురుష్ బెటర్ అనీ, ఈ విశ్వంభర దర్శకుడు మల్లిడి వశిష్ట మరో ఓం రౌత్ అనీ వ్యాఖ్యలు చేస్తున్నారు… ఆ సినిమా టీజర్ మీద ఈ దుమ్ముదుమారం అంతా…! బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా ఇంప్రెసివ్ లేదని మరో విమర్శ… తెలంగాణ గీతాన్నే ఖూనీ చేసిన కీరవాణిలో ఒరిజినల్ క్రియేటర్ ఎప్పుడో మటాష్ అయిపోయినట్టున్నాడు… రాజమౌళి సినిమాలకు తప్ప వేరేవాళ్లకు తన అసిస్టెంట్లతో పని కానిచ్చేస్తున్నాడని మరో విమర్శ… ఈ సినిమా బీజీఎం కూడా కాపీయేనట…
Ads
ఫ్యాన్, యాంటీ ఫ్యాన్ అని గాకుండా… న్యూట్రల్‌గా ఈ టీజర్ చూస్తే… గ్రాఫిక్స్ వర్క్ మరీ నాసిరకంగా ఏమీ లేదు… వీఎఫ్ఎక్స్ వర్క్ గొప్పగా ఉందనలేం గానీ, వోకే, పర్లేదు… తీసిపారేసేది మాత్రం కాదు… కాకపోతే ఇంగ్లిషు సినిమాల్లోని అంశాలను వాడుకున్నారే తప్ప సొంతంగా, కొత్తగా ఏమీ ఆలోచించలేకపోయాడు దర్శకుడు అనేది కొంత నిజం… ఒకాయన ఇలా పోస్ట్ మార్టం రిపోర్టు పెట్టాడు ఆల్రెడీ…
అసలు చూడాల్సింది వేరేనేమో… లోకం పుట్టుక, అలుముకుంటున్న చీకట్టు, విశ్వానికే ప్రమాదం వంటి అత్యంత సీరియస్ ఫాంటసీ సబ్జెక్టు ఎత్తుకున్నా సరే… దుష్టశక్తులు గ్రహాంతరవాసుల్లా కనిపిస్తున్నా సరే… హీరో రెక్కల గుర్రం ఎక్కి వస్తాడు సరే, కానీ ఎదుర్కుని విశ్వాన్ని రక్షించే మన కథానాయకుడి గెటప్ మాత్రం మన సాదాసీదా యాక్షన్, కమర్షియల్, ఇమేజీ బిల్డప్పు సినిమాల్లో హీరోలాగానే ఉన్నాడు… సూపర్ సుప్రీం మెగా బ్లాస్టింగ్ హీరోకు ఇప్పుడిక మామూలు పాత్రలు సరిపోవు… అందుకే విశ్వరక్షకులు, విశ్వంభరలు కావాలి… కానీ..?
(mega mass beyond universe అట… టీజర్‌లోనే కనిపించింది… దర్శక మహాశయా, అంటే ఏమిటి..? అదే మెగాతనం, అదే మాస్‌తనం, కానీ విశ్వాన్ని దాటి… అదేనా..? అవును, విశ్వాన్ని దాటినా సరే… ట్రెండ్ కదా, హనుమంతుడు కూడా కనిపిస్తున్నాడు సినిమాలో…)
నో ఛేంజ్… అదే లుక్కు, అదే డ్రెస్సు, అవే తరహా ఫైట్లు… బహుశా స్టెప్పుల పాటలు కూడా ఉంటాయేమో… సబ్జెక్టు కొత్తగా ఏం తీసుకున్నా సరే, కథానాయకుడు జస్ట్, అలా చిరంజీవిలాగే కనిపించాలనే ధోరణి కొత్తేమీ కాదు కదా… మంజునాథలో శివుడు స్టెప్పులు వేస్తాడు, అంజిలో గానీ, మగధీరలో గానీ ఆ పాత్రలు కనిపించవు… చిరంజీవి కనిపిస్తాడు… ఏవో పాటలు, ఏవో ఫైట్లు… మూస… మూస… ఫ్యాన్స్ నన్ను ఇలాగే చూస్తారు అనే భావనల నుంచి బయటికి రాలేకపోవడం… నక్సలైట్ ఆచార్య కూడా అంతే కదా…
అంగారక గ్రహం మీద నడిచే కథయినా సరే… అక్కడా ఓ సగటు తెలుగు స్టార్ హీరో… ఓ హీరోయిన్, చేతిలో పెద్ద కత్తి లేదా గన్ను… మామూలు సినిమాల్లోలాగే బీభత్సమైన ఫైట్లు… అక్కడా స్టెప్పులు… ఇక దర్శకుడు వశిష్ట అయితేనేం, ఓం రౌత్‌ను తీసుకొస్తేనేం… భారీ ఖర్చు, అవతార్ పోలిన కథ, వందల కోట్ల బిజినెస్… ఐనా సరే, మన సగటు తెలుగు సినిమా హీరో తాలూకు వాసనల నుంచి మనం బయటపడం, పడలేం…
మొన్న ఎవరో రచయిత, దర్శకుడు చెప్పినట్టు… మనవాళ్లు దర్శకుడిని, ఇతర వృత్తి నిపుణులను వాళ్ల పని వాళ్లను చేసుకోనిస్తే కదా అంటారా..? కావచ్చు..!! తేడా కొడితే బకరాను చేయడానికి దర్శకుడంటూ ఒకడు ఉండాలి కదా…!!
Share this Article