కొత్త దర్శకులు, కొత్త హీరోలు కొందరు మెల్లిమెల్లిగానైనా సరే… తెలుగు సినిమాను కొత్తదనం వైపు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు… సోకాల్డ్ స్టార్ హీరోలు, స్టార్ దర్శకులు ఇంకా మూస ప్రపంచంలోనే బతుకుతుంటే… చిన్న హీరోలు, చిన్న దర్శకులు మాత్రమే ప్రయోగాలు, భిన్నమైన కథల వైపు వెళ్తున్నారు…
సుహాస్ వారిల్లో ఒకడు… తను భిన్నమైన కథల్ని ఎంచుకుంటున్నాడు.., అభినందనీయం… పాత్రకు తగినట్టుగా… అతి చేయడు, తక్కువ చేయడు… ఈమధ్య వచ్చిన ‘జనక అయితే గనక’ మూవీలో కథ ట్రీట్‌మెంట్ సరిగ్గా లేదు గానీ… కథ భిన్నమైంది… పైగా సున్నితంగా, జాగ్రత్తగా డీల్ చేయాల్సిన సబ్జెక్టు… ఫ్యామిలీలతో చూడటానికి కూడా ఇబ్బంది లేకుండా దర్శకుడు బండ్ల సందీప్ రెడ్డి బాగానే డీల్ చేశాడు… కానీ..?
సరోగసీ, వీర్యదానం, పురుషాంగ పరిమాణం వంటి సబ్జెక్టులు కూడా మన దర్శకులు గతంలో బాగానే చెప్పగలిగారు… అశ్లీలం జోలికి పోకుండానే..! ఈ జనక అయితే గనక మూవీ కండోమ్, అవాంఛిత గర్భం, ఆ కంపెనీపై కేసు తదితరాంశాలతో సాగుతుంది… ఇప్పుడప్పుడే సంతానం వద్దని, తన సంపాదనకు పిల్లల్ని మంచిగా పోషించే స్థోమత లేదని భావించే ఓ భర్త… భార్య గర్భవతి కావడంతో షాక్ తిని, కండోమ్ కంపెనీపై కేసు పెడతాడు…
Ads
ఆ కేసు, కోర్టులో వాదప్రతివాదనలు మరీ సాగతీత యవ్వారం అయిపోయి… కథాగమనంలో గ్రిప్, బిగి లేకుండా పోయింది… బట్, ఈ కథ ఎంపిక బాగానే ఉంది… ఓటీటీలో వచ్చినప్పుడు ఓ లుక్కేయవచ్చు… హీరోయిన్ సంగీర్తన (సంకీర్తన..? మలయాళీ) కూడా పర్లేదు… కాకపోతే జడ్జి కేరక్టరైజేషన్ బాగాలేదు… ఇలాంటి సబ్జెక్టు ట్రీట్‌మెంట్ సమయంలో జడ్జిని హుందాగా చూపిస్తేనే బాగుండేది…
హీరో బెడ్రూంలో రొమాన్స్ గురించి ప్రస్తావించగానే జడ్జి లొట్టలు వేస్తూ వినడం.. హీరో ఏదో ఊహించుకోమన్నాడని తన భార్యతో శృంగార జీవితం గురించి ఊహల్లోకి వెళ్లిపోవడం.. వాళ్ల బెడ్రూంలోకి హీరో వచ్చి నానా బీభత్సం చేయడం.. ఇలా సన్నివేశాలను నడిపించడం బాగాలేదు… హీరో మంచి పాయింట్ చెప్పగానే జడ్జి ముఖానికి ఫైల్ అడ్డం పెట్టుకుని ‘ఎస్’ అంటూ సంబరపడిపోతాడు…
పోనీ, వాదనల్లో సరైన, బలమైన పాయింట్లు ఉన్నాయా అంటే అదీ పెద్దగా కనిపించదు… మామూలు పాయింట్ల మీద కోర్టులో వాదనల్ని మరీ గంటసేపు చూడటం బోరింగ్… కండోమ్ నాణ్యత మీద కేసు వేస్తారు సరే, కానీ కంపెనీకి కూడా తగ్గదు, పెద్ద లాయర్లతో వాదనల్ని తప్పుదోవలోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తుంది… కండోమ్ కంపెనీలు కొన్ని కోట్ల కండోమ్స్ అమ్ముతాయి… ఫెయిల్యూర్ పర్సంటేజ్ ఎంత..? దానికి కారణం క్వాలిటీ లేకపోవడం కాదని వాదిస్తూ, సంబంధత మహిళ కేరక్టర్ వైపు మళ్లించే ప్రయత్నం కూడా చేస్తాయి…
కథ ఎంపిక సరే… నెరేషన్ మీద దర్శకుడు ఇంకాస్త శ్రద్ధ చూపిస్తే సినిమా ఇంకాస్త రక్తికట్టేదేమో… అలాగే సీరియస్ సబ్జెక్టు నుంచి రిలీఫ్ కోసం కామెడీకి కూడా ప్రయారిటీ ఇచ్చారు సరే, కానీ పెద్దగా ఆకట్టుకోలేదు… జనక అయితే గనక అనే టైటిల్ కూడా బాలేదు… బట్ ఓవరాల్‌గా భిన్నమైన కథ సంకల్పాన్ని స్వాగతించవచ్చు..!!
Share this Article