పశ్చిమాసియా గగనతలంలో ప్రస్తుతం అతి తక్కువగా పౌర విమానాలు ఎగురుతున్నాయి. కొన్ని కథనాల ప్రకారం ఇప్పటికే ఇజ్రాయిల్ ఇరాన్ మీద భారీ ఎత్తున మిస్సైల్ దాడులకు రంగం సిద్ధం చేసింది. బహుశా ఈరోజు రాత్రే ఈ దాడి జరిగే అవకాశాలు ఉన్నాయి.
ఒకవేళ ఇజ్రాయిల్ ఇరాన్ అణు స్థావరాల మీద దాడులకు దిగితే అత్యంత తీవ్రంగా స్పందిస్తామని ఇప్పటికే హెచ్చరించింది. బహుశా ఇరాన్ వద్ద ఇప్పటికే అణుబాంబు ఉండవచ్చునని యుద్దరంగ నిపుణులు అనుమానిస్తున్నారు. దీనికి తోడు ఇరాన్ భూభాగం మీదకు దూసుకు వచ్చే క్షిపణులను 300 కిలోమీటర్ల దూరం నుండే గుర్తించి ఏకకాలంలో ఆనేక గగనతలంలో నాశనం చేయగలవి, రష్యా నుండి సమకూర్చుకున్న S300 గగనతల రక్షణ వ్యవస్థను ఇరాన్ పలు ముఖ్యమైన ప్రాంతాల్లో మొహరించింది.
ఇజ్రాయిల్ బాలిస్టిక్ క్షిపణులు S300 రక్షణ వ్యవస్థను దాటుకుని దాడి చేయడం కష్టమే. ఇక ఇజ్రాయిల్ వద్దనున్న అత్యాధునిక స్టెల్త్ ఫైటర్ జెట్స్ ఆయిన F35 లు కూడా S300 పరిధిలోకి వస్తే తప్పించుకోవడం కష్టమే. ఎందుకంటే S300 గగనతలంలో 40 వేల అడుగుల ఎత్తున ఎగిరే ఫైటర్ విమానాలను కూడా కూల్చే సామర్థ్యం కలిగి ఉన్నాయి. దీనిని ఇజ్రాయిల్ ఎలా చేదిస్తుందో చూడాలి.
Ads
మరోవైపు ఇజ్రాయిల్ దాడి అనంతరం ఇరాన్ కూడా అదే విధంగా క్షిపణి దాడులతో ప్రతిస్పందిస్తే ఎదుర్కోవడానికి ఇప్పటికే ఇజ్రాయిల్ వద్దనున్న ఐరన్ డోమ్, డేవిడ్ స్లింగ్ వంటి మూడంచెల గగనతల రక్షణ వ్యవస్థలకు తోడు అమెరికా నుండి దిగుమతి చేసుకున్న అత్యాధునిక థాడ్ రక్షణ వ్యవస్థను ఏర్పాటు చేసింది. అమెరికా వెలుపల థాడ్ రక్షణ వ్యవస్థను ఏర్పాటు చేయడం ఇదే మొదటిసారి.
పశ్చిమ ఆసియాలో ఇలా ఉద్రిక్తతలు కొనసాగుతుండగా మరోవైపు తూర్పు ఆసియాలో చైనా తైవాన్ చుట్టూ సముద్ర జలాల్లో భారీ ఎత్తున నౌకా మరియు వాయు విన్యాసాలు చేపట్టింది. దాదాపు 120కి పైగా యుద్ధ విమానాలు తైవాన్ గగనతలంలో యుద్ధ విన్యాసాలు చేపట్టడం గమనార్హం.
పల్లెల్లో గట్టు పంచాయితీలు జరుగుతుంటాయి. మనకున్న భూమి సరిపోదని పక్కోడి భూమి కూడా దున్నుకుంటారు. ఆ గొడవ కాస్తా పెద్దదై పంచాయితీ పెద్దల వరకు చేరుతుంది. ఉన్న అతిపెద్ద భూభాగం సరిపోక తైవాన్ కూడా నాకే కావాలని చైనా, సువిశాల అరబ్ భూభాగంలో పిడికెడంత ఇజ్రాయిల్ భూభాగం కావాలని ఇస్లామిక్ దేశాలు, దేశ ప్రజలకు తినడానికి గోధుమ పిండి ఇవ్వడానికి దిక్కులేక పోయినా కాశ్మీర్ కావాలనే పాకిస్థాన్… ఇలా ఏ ఉదాహరణ చూసినా గట్టు పంచాయితీలే గుర్తుకు వస్తున్నాయి.
ఎవరో ఒకరు తగ్గితే లేదా సామరస్యంగా వివాదాలను పరిష్కరించుకుంటే తప్ప ఈ యుద్దాలు ఆగవు. బతుకు బతకనివ్వు అని అనుకోకపోతే కట్టకట్టుకుని అందరూ చావడమే. చూద్దాం ఏమీ జరుగుతుందో! – నాగరాజు మున్నూరు
Share this Article