Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

పసిపెదాలకు చనుబాలదాత… ఎందరో పిల్లలకు ఆరోగ్య‘రక్షా’ జైన్..!

October 22, 2024 by M S R

అమ్మలగన్నయమ్మ ముగురమ్మలమూలపుటమ్మ చాల బెద్దమ్మ, సురారులమ్మ కడుపారడి పుచ్చినయమ్మ దన్నులో నమ్మిన వేల్పుటమ్మల మనమ్ముల నుండెడి యమ్మ దుర్గ, మాయమ్మ, కృపాబ్ధి యిచ్చుత మహత్త్వ కవిత్వ పటుత్వ సంపదల్!

అమ్మలనుకన్న దేవతా స్త్రీలయిన వారి మనస్సులయందు ఏ అమ్మవారు ఉన్నదో అటువంటి అమ్మకు నమస్కరిస్తూ.. మహాకాళీ, సరస్వతీ, మహాలక్ష్మిని కన్న తల్లిని చాలా బెద్దమ్మగా, అండపిండ బ్రహ్మాండ మహాశక్తిగా కొల్చారు పోతానామాత్యుడు. అయితే, ప్రస్తుత నాగరిక సమాజంలో అలా కొలవాల్సిన ఓ తల్లి గురించి మనం చెప్పుకోబోతున్నాం.

పోషకాహార లోపంతో బాధపడుతూ.. చిన్ననాటే తల్లులకు దూరమైన ఎందరో పిల్లలకు తన చనుబాలిచ్చిన ఓ తల్లి కథ.. కృష్ణుణ్ని లాలించిన యశోద కన్నా గొప్పది. మధ్యయుగంలోని 16వ శతాబ్దానికి చెందిన రాజస్థాన్ లోని రాణా సింగ్ కుమారుడు ఉదయ్ సింగ్ ను లాలించిన పరిచారిక పన్నా దై కథను మించింది. అందుకే ఆ రాజస్థానీ రక్షాజైన్ ను అమ్మల గన్న అమ్మగా చెప్పుకుంటున్నాం.

Ads

టెక్స్ టైల్స్ ఆఫ్ ఇండియాగా, మాంచెస్టర్ ఆఫ్ రాజస్థాన్ గా పిల్చుకునే బిల్వారాకు చెందిన రక్షా జైన్ మానవీయకోణం మాటలకందేది కాదు. వివిధ కారణాల వల్ల తల్లి పాలందని నవజాత శిశువులెందరిపాలిటో ఆమే చనుబాలిచ్చిన అమ్మైంది. అమ్మలగన్న అమ్మగా.. ఆకలిగొన్న పసి పెదాలకు క్షీరధారైన తల్లిగా ఆమె పేరు ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ కెక్కింది.

అన్నదానం, నేత్రదానం, అవయవదానం, నీళ్లదానం, రక్తదానం ఇలా ఎన్నో గొప్ప గొప్ప దానాల గురించి విన్న మనకు… చనుబాల దానం గురించి విన్నప్పుడు అందుకు ఓ తల్లికెంత పెద్ద మనస్సుండాలి…? ఆమె అలా తన చనుబాలను నవజాత శిశువులకిస్తానంటే.. అందుకు ఒప్పుకున్న ఆ కుటుంబీకులది ఇంకెంత గొప్ప హృదయమై ఉండాలి..?

వృత్తిరీత్యా ఎలక్ట్రో థెరపిస్ట్ గా పనిచేసే రక్షా జైన్ ఇద్దరు పిల్లల తల్లి. 2018, జూన్ 17వ తేదీన తన కుమారుడికి జన్మనిచ్చిన తర్వాత ఆమెకు మూడురోజుల పాటు పాల ఉత్పత్తి కాకపోవడంతో ఆ తల్లి మనస్సు తల్లడిల్లింది. దాంతో మహాత్మాగాంధీ ఆసుపత్రిలో ఆంచల్ మదర్ మిల్క్ బ్యాంకు నుంచి సాయం కోరింది. తనకు ఆ సమయంలో తక్షణ సాయమైతే అందిందిగానీ… తన బిడ్డడిలాగా ఎందరు బిడ్డలు ఇలా ఇబ్బందులు పడుతున్నారోనన్న ఒకింత కలవరం, బాధ రక్షా జైన్ ను మథనంలో పడేశాయి.

అదిగో అప్పుడే అలాంటి పిల్లలకు ఏదైనా చేయాలన్న సంకల్పం ఆమెలో మొదలైంది. ఆంచల్ మదర్ మిల్క్ బ్యాంకు నుంచి వచ్చిన పాలే తన బిడ్డను రక్షించాయని తెలుసుకున్న రక్షా జైన్.. తన బిడ్డలాగా సవాళ్లనెదుర్కొంటున్న నవజాత శిశువులకు తానూ చనుబాలిచ్చేలా తనకు సహకరించాలని ఆ దేవుణ్ని వేడుకున్నానని చెప్పింది.

రక్ష ప్రార్థన ప్రశ్నగానే మిగిలిపోకుండా.. సమాధానం లభించింది. అయితే, చనుబాల వితరణకు పూనుకున్న రక్ష మనస్సు గొప్పదే కావచ్చు. క్షీరదానం మరింత గొప్పగానే కనిపించొచ్చు. కానీ, ఆ పెయిన్ వర్ణించలేనిది. శారీరకంగా వచ్చే బాధలనూ అధిగమించాల్సి ఉంటుందన్న హెచ్చరికలనూ బేఖాతరు చేసింది. ఎందుకంటే మరొక తల్లి పాలు తన బిడ్డను రక్షించి ప్రాణభిక్ష పెట్టినప్పుడు.. తన బిడ్డలాంటి ఎందరో అవసరార్థులకు తానెందుకివ్వకూడదన్న ఓ గొప్ప ఆలోచన, సంకల్పం రక్షా జైన్ ను ఎందరో నవజాత శిశువుల పాలిట మహాతల్లిగా మార్చేసింది. రాజస్థాన్ వంటి ఎడారి ప్రాంతంలో ఎందరో బిడ్డల ఆకలి తీర్చిన అమ్మై.. సాటి మనిషి పట్ల జీవకారుణ్యాన్ని ప్రదర్శించిన తీరే రక్షా జైన్ ను ఓ గొప్ప కథగా మార్చింది.

2018, జూన్ 20వ తేదీ నుంచి రక్ష క్రమం తప్పకుండా తన చనుబాలను దానం చేస్తూనే ఉంది. ఒక సిట్టింగ్‌లో లీటరు వరకు పాలను అందజేస్తూనే ఉంది. మదర్ మిల్క్ బ్యాంక్ వద్ద ఉన్న.. రక్షా జైన్ అనే ఒక తల్లి ఇచ్చిన పాల లెక్క మొత్తం చూస్తే ఆశ్చర్యపోతాం.

రక్షా జైన్ ఇప్పటివరకూ 5 వేల మంది పిల్లలకు అవసరమైన 160 లీటర్లకుపైగా పాలనిచ్చి… మహాతల్లిగా కీర్తికెక్కింది. తన మొదటి ప్రసవం తర్వాత 2018 జూన్ నుంచి 2019 వరకు ఆంచల్ మదర్ మిల్క్ బ్యాంకుకు 54 లీటర్ల పాలనందించింది. రెండవ డెలివరీ అనంతరం 2023, నవంబర్ 14 వరకూ మరో 106 లీటర్లకు పాలందించింది.

తన ఫస్ట్ డెలివరీ సమయంలో రక్ష అత్తమామల ఇంట్లో ఉంటూనే ప్రతీరోజూ బిల్వారా పట్టణానికి 700 రూపాయల రానుపోను ఖర్చులు భరిస్తూ వెళ్లివచ్చేంది. రోజూవారీ ట్యాక్సీ ఖర్చులు పెరగడంతో చాలాసార్లు తన స్కూటీపై వెళ్లి మదర్ మిల్క్ బ్యాంకులో పాలిచ్చి వచ్చేది. అలా వెళ్లే సమయంలో తన నెలన్నర చిన్న కుమారుణ్ని తన ఛాతీకి భద్రంగా కట్టుకుని ప్రయాణించేది.

ప్రసవ సమయంలో ఓ ఆసుపత్రిలో ఓ తల్లి చనిపోయి.. బిడ్డ బతికిన ఘటనలో… రక్షా జైన్ పాలతోనే ఆ బిడ్డ బతికి పెరిగి పెద్దదైన కథను ఆసుపత్రి వర్గాలు తనకు చెబుతుంటే తన కళ్లు చెమర్చాయంటుంది రక్షా జైన్. ఆ అమ్మాయిని తన చేతుల్లోకి తీసుకుని లాలిస్తూ.. అమ్మ లేకపోతేనేం నేనున్నానుగా అన్న ఆమె హృదయస్పందన విన్నవాళ్లకు, ప్రత్యక్షంగా చూసినవాళ్లకు.. పోతానామాత్యుడు చెప్పినట్టుగా ముగ్గురమ్మల మూలపుటమ్మలా ఆ అమ్మ కనిపించదూ!

ఆకలి తీర్చేందు తన స్తన్యాన్నిచ్చిన ఆ అమ్మకు ఇప్పుడెందరో బిడ్డలు రుణపడి ఉన్నారు. అందుకే, రక్షా జైన్ ఓ వార్తకొక శీర్షిక కాదు… నేటి మెకానికల్ లైఫ్ లో పిల్లలకు డబ్బా పాలిచ్చి పెంచే ఎందరో తల్లులు తెలుసుకోవాల్సిన ఓ కథ! అక్షరాల్లో, మాటల్లో వర్ణించలేని నిస్వార్థతకు, అమృతతుల్యమైన ప్రేమకు ఓ ప్రతీక!

తన రెండో బిడ్డ జన్మించాక మళ్లీ మూడు రోజుల తర్వాతే వెంటనే తన పాల వితరణను ప్రారంభించిందే తప్ప.. ఇక చాలనుకోలేదు. ఎందుకంటే ఆమె సంకల్పంలో అంకితభావముంది. అలాంటి మహాసంకల్పం కల్గి ఉండటమే రక్షా జైన్ ను మహాతల్లిని చేసింది.

ఇప్పుడ రక్షా జైన్ కథ రాజస్థాన్ ఎడారికో, కేవలం మన దేశానికో మాత్రమే పరిమితమైంది కాదు. ఎల్లలు లేని కీర్తికి ఆమె హృదయస్పందన సాధించిన కచ్చితమైన అర్హత. భిల్వారా చుట్టుపక్కలే కాకుండా.. అజ్మీర్ వంటి పొరుగు జిల్లాల్లోనూ ఆమె పాల వితరణ ఎందరో పిల్లలకు పౌష్ఠికాహారమైంది.

తన పాల వితరణలో భర్త సునీల్, తల్లి శారదాదేవీ, సోదరుడు రాహుల్ సోనీ పాత్రల్లేకుండా.. తన సాయం పూర్తి అయ్యేది కాదనీ వారికీ తన కీర్తిలో స్థానాన్నిస్తోంది రక్షా జైన్. సోదరుడు ఆసుపత్రికి తీసుకువెళ్లేందుకు, మదర్ మిల్క్ బ్యాంకుకు తీసుకెళ్లేందుకు సాయపడితే, తల్లి ఇంటి పనులు చూసుకుంటూ తనకు బాసటగా నిల్చేదని చెబుతుందామె.

అయితే, తనను చాలామంది భయపెట్టినట్టు తనకేమీ ఇబ్బంది లేదని.. తాను ఆరోగ్యంగా ఉన్నానంటోంది రక్ష. తన పాలు తాగి పెరిగి పెద్దైన ఎందరో పిల్లలకు తల్లైన ఘనత తనకు దక్కడం మాటల్లో చెప్పలేని అనుభూతిని, జీవన సంతృప్తినిచ్చిందంటోందామె. తన స్ఫూర్తిని మరింత మందిలో పెంచే ఒక మిషన్ నూ రక్షా జైన్ చేపట్టింది.

తనలాంటి సామాజిక స్పృహ ఉన్న మహిళలెందరినో కలుపుకుని.. లైఫ్ వెల్ఫేర్ పింక్ స్క్వాడ్ అనే సొసైటీని ఏర్పాటు చేసింది. ప్రారంభంలో చాలా మంది మహిళలు రక్షలాగా పాలివ్వడానికి నిరాకరించారు. కానీ, రక్ష స్ఫూర్తి రగిలించడంలో మెల్లిమెల్లిగా సక్సెస్ అవ్వడంతో ఇప్పుడు 20 మంది మహిళలతో పోషకాహార లోపంతో బాధపడే శిశువుల సంరక్షణ కోసం తల్లిపాల బ్యాంకునే ఏర్పాటు చేసింది రక్ష.

బిల్వారాలోని మహాత్మాగాంధీ హాస్పిటల్ కు అనుసంధానంగా ఉన్న ఆంచల్ మదర్ మిల్క్ బ్యాంక్ అప్పుడే ప్రసవించిన మహిళల నుంచి మిగులుపాలను సేకరించి ఓ తల్లిపాల బ్యాంకునేర్పాటు చేసింది. ఒకసారి ఒక మహిళ నుంచి 150 మిల్లీలీటర్ల పాలను సేకరిస్తారు. ఆ పాలను పాశ్చరైజ్ చేసి ఆరునెలల వరకు ఫ్రీజర్ లో సురక్షితంగా నిల్వ చేస్తారు. అనాథ శిశువులు, తల్లిపాలు సరిగ్గా అందని పిల్లలకు వైద్యుల ప్రిస్క్రిప్షన్ ప్రకారం అందజేస్తారు.

అమ్మతనం తనకుందని అవని పొంగిపోతుంది.. అమ్మను కాలేనే అని ఆకాశం కుములుతుంది అన్నారు ఓ పాటలో సినారె. అదిగో అలాంటి పొంగిపోయే అమ్మతనాన్ని రక్షా జైన్ లో దర్శించొచ్చు. మొత్తంగా.. నిస్వార్థం, దాతృత్వం, తల్లి ప్రేమ, సమాజసేవ, అంకితభావం, సంకల్పం, రక్షణ, కరుణరసం ఇలా ఇన్ని పదాల పర్యాయపదం.. ఎడారిదారుల్లో పసిబిడ్డలకు జీవనరక్షైన రక్షా జైన్!   (రమణ కొంటికర్ల)

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • సింగిల్..! శ్రీవిష్ణు షో… అక్కడక్కడా నవ్వులు భలే పండాయి…!!
  • శుభం..! ఇంతకీ ఈ సినిమా ద్వారా సమంత ఏం చెప్పాలనుకుంది..?!
  • జంధ్యాల నెలవంక… చూసింది నేల వంక… ఐననూ ఆదర్శ ప్రయోగమే…
  • బోలెడు క్షుద్ర రాజకీయ వివాదాలు… ఈ మూడే రియల్ గేమ్ చేంజర్స్…
  • గంజాయ్..! ఇదొక వరమూలిక..!! ఇన్నేళ్లూ మనమే కాలదన్నుకున్నాం..!!
  • మహిళకు ఒకరికన్నా ఎక్కువ మొగుళ్లు..! చట్టబద్ధం చేస్తే ఎలా ఉంటుంది..?!
  • పాకిస్థాన్ కకావికలం… ఇప్పటికే చావుదెబ్బ… సిందూరం భగభగ…
  • ఈ యుద్ధంతో అశాంతి కాదు… శాంతి కోసమే ఈ యుద్ధం… ఇలా…
  • అంబానీ కదా… చివరకు యుద్ధ చిహ్నాన్ని కూడా హైజాక్ ప్రయత్నం…
  • యుద్ధమంటే… విజయమో, పరాజయమో మాత్రమే కాదు..!

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions