.
కోవిడ్ అనంతరం విపరీతంగా పెరిగిన గుండెపోట్లు, జాగ్రత్తలు తీసుకోకుంటే ముప్పే
ఇటీవలి చరిత్రలో కోవిడ్ పీడ ప్రపంచాన్ని పెద్ద కుదుపు కుదిపింది. కోవిడ్ జబ్బుకి కారణమైన కొరోనావైరస్ ఉపరితలం మీద వుండే స్పైక్ ప్రొటీన్ కి రక్తం గడ్డ కట్టించే లక్షణం వుంది. కోవిడ్ మరణాలలో మూడింట ఒక వంతు ఊపిరితిత్తులలో రక్తం గడ్డ కట్టడం మూలంగా జరిగినవి అని కోవిడ్ మొదటి వేవులోనే వైద్య పరిశోధకులు గుర్తించారు.
Ads
దాంతో కోవిడ్ జబ్బు బారినపడి హాస్పిటల్ లో చేరే వారికి రక్తం గడ్డ కట్టకుండా ఆపే మందులను, గడ్డను కరిగించే మందులను ఇచ్చారు. హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేసిన తర్వాత కూడా ఎపిక్సబాన్, రివరోక్సబాన్ వంటి యాంటీకోయాగ్యులేంట్స్ మందులను వైద్యులు పేషంట్స్ కి ఇచ్చిన సంగతి తెలిసిందే.
వైద్య పరిశోధనలు – గణాంకాల క్రోడీకరణ దానికి తగ్గట్టుగా పాటించాల్సిన విధి విధానాలను నిర్దేశించడం సంప్రదాయకంగా చాలా నెమ్మదిగా, దీర్ఘకాలంలో జరుగుతూ ఉంటుంది. కోవిడ్ వంటి జబ్బు విషయంలోనూ అదే విధమైన సాచివేత వైఖరి మూలంగా ప్రజలు విపరీతంగా నష్టపోయారు. ఆరోగ్యాలను కోల్పోవడమే కాకుండా, అనేకమంది తమ ప్రియమైన కుటుంబ సభ్యులను కోల్పోయారు.
ఈ అంశాన్ని కోవిడ్ రెండో వేవ్ నుండీ నేను పదే పదే ప్రస్తావించాను. అధిక రక్తపోటు, మధుమేహం, ఛాతిలో నొప్పి, స్థూలకాయం, గుండె ఆపరేషన్ జరిగిన వారు గుండెపోటుకి గురయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. దాంతో ఈ రిస్క్ ఫ్యాక్టర్స్ కల వారికి రక్తం గడ్డ కట్టకుండా ఉండే ఔషధాల (యాంటీ కోయాగ్యులేంట్స్)ను ఇవ్వడం ఆధునిక వైద్యంలో ప్రామాణికమైన అంశంగా ఉంది.
కోవిడ్ ను కూడా గుండెపోటుకు ఒక రిస్క్ ఫ్యాక్టర్ గా పరిగణించాలని, కోవిడ్ బాధితులలో గుండెపోటు నివారణకు గాను ఏస్పిరిన్ వంటి యాంటీ కోయాగ్యులెంట్ వాడే విషయాన్ని అత్యవసరంగా పరిశీలించాలని పదే పదే చెప్పాను. కోవిడ్ డెల్టా వేవ్ సమయంలో తేలికపాటి కొరోనా జబ్బుకు ఇంటి వద్దనే వైద్యం చేసుకునే హోంకేర్ కిట్ లో ఏస్పిరిన్ ను ప్రధానమైన ఔషధంగా చేర్చాను. తెలుగు రాష్ట్రాలలో విస్తృత జనాదరణను పొందిన ఆ హోమ్ కేర్ కిట్ లక్షలాదిమందికి భరోసాగా నిలిచి, వేలాది ప్రాణాలను నిలిపింది.
కోవిడ్ లోనూ, తర్వాతా గుండెపోటు మరణాలు విపరీతంగా పెరిగిపోయాయి అనే అంశాన్ని గుర్తించడానికి కేవలం నిజాయితీతో కూడిన పరిశీలన సరిపోతుంది. దీనికి పెద్ద ఎత్తున పరిశోధనలు చెయ్యాల్సిన అవసరం లేదు. దురదృష్టవశాత్తు ఇప్పటికి కూడా కోవిడ్ తర్వాత పెరిగిన గుండెపోటులను ప్రస్తావించడంలో వైద్య వ్యవస్థ బాగా వెనకబడింది.
కాగా వ్యాపార రంగం ఈ విషయాన్ని చాలా ముందుగానే గుర్తించింది. ఆరోగ్యం, వైద్యం ఇన్సూరెన్స్ కి సంబంధించి, ఆయా ఇన్సూరెన్స్ సంస్థలకు వివిధ అనారోగ్యాల పోకడలను గురించి సవివరమైన విశ్లేషణ ఇచ్చే ఏజన్సీలు దాదాపు అన్ని దేశాలలోనూ ఉంటాయి. అమెరికాకు చెందిన సొసైటీ ఆఫ్ ఏక్చువరీస్ (SOA) 2022 లోనే తమ దేశంలో 20 శాతం మేరకు గుండె మరణాలు పెరిగాయని తెలిపింది. అయినప్పటికీ దీనిని వైద్య వ్యవస్థ పెద్దగా పట్టించుకోలేదు.
తాజాగా మనదేశంలో ‘పాలసీ బజార్’ అనే ఇన్సూరెన్స్ అడ్వైజరీ సంస్థ వెలువరించిన నివేదిక మేరకు, 2019-20 సంవత్సరంలో మొత్తం ఇన్సూరెన్స్ క్లెయిములలో గుండె జబ్బుల క్లైములు 12 శాతం ఉన్నాయి. కాగా 2023-24 సంవత్సరానికి మొత్తం ఇన్సూరెన్స్ క్లెయిములలో 20 శాతం మేరకు గుండె జబ్బుకు సంబంధించినవే ఉన్నాయి. అనగా 2019-20 లో 100 మంది ఇన్సూరెన్స్ పాలిసీదారులు గుండెకు సంబంధించిన సమస్యలకు గురి అయ్యారు అనుకుంటే, 2023-24 సంవత్సరంలో ఇది చాలా పెరిగి, దాదాపు 167 మంది గుండెజబ్బుల బారిన పడ్డారు.
ఎస్, కోవిడ్ తో గుండె జబ్బులు విపరీతంగా పెరిగిపోయాయి. జాగరూకతతో ఉండాలి. వైద్యులు కూడా ఈ ముప్పుని గుర్తించాలి. కోవిడ్ బారిన పడటం గుండెపోటు ముప్పుకి ముఖ్యమైన సూచికగా చూడాలి. దాన్ని నివారించడానికి తగిన సూచనలు ఇవ్వాలి. —- డాక్టర్ యనమదల మురళీకృష్ణ, ఎండి, సాంక్రమిక వ్యాధులు నిపుణులు, కాకినాడ
Share this Article