పాము , తేలు , పొట్టేలు , ఏనుగు , సింహం కాదేది సినిమాకు అనర్హం . ముఖ్యంగా శాండో చిన్నప్ప దేవరుకు … భారత సినీ రంగంలో నిజమైన జంతువులనే హీరోలుగా పెట్టి చాలా సినిమాలను తీసిన నిర్మాత ఈ చిన్నప్ప దేవర్ . జంతువులను మచ్చిక చేసుకోవటం , వాటితో కనెక్ట్ కావటం ఆయనకు ఎలా ప్రాప్తించాయో తెలియదు . బహుశా భగవద్దత్తం అయి ఉండాలి .
By the way , ఆయన సుబ్రమణ్య స్వామికి గొప్ప భక్తుడు కూడా . సుమారు వంద సినిమాలను తీసాడు . MGR తోనే 16 సినిమాలు తీసారు . MGR కు దేవర్ అంటే ఎంత అభిమానం అంటే దేవర్ అంత్యక్రియలకు కోయంబత్తూరుకు వెళ్ళారు . కధల్ని నేయటంలో సిధ్ధహస్తుడు . స్క్రీన్ ప్లేను తయారు చేసుకోవటం , ప్రొడక్షన్ ప్లానింగులలో మన రామానాయుడు , నాగిరెడ్డి- చక్రపాణిల్లాగా చాలా ప్రొఫెషనల్ . హాథీ మేరీ సాథీ వంటి బ్లాక్ బస్టర్ని నిర్మించి , రాజేష్ ఖన్నాను మాస్ హీరోని చేసింది ఈ చిన్నప్ప దేవరే .
రుజువు ఈ పొట్టేలు పున్నమ్మ సినిమాయే . 1978 లో సూపర్ డూపర్ హిట్ . పెద్ద పెద్ద స్టార్లు లేరు . ఒక బయలాజికల్ పొట్టేలు , మరో నాన్ బయలాజికల్ పొట్టేలు . నాన్ బయలాజికల్ పొట్టేలు శ్రీప్రియ … మురళీమోహన్ , మోహన్ బాబు , పద్మప్రియ , అల్లు రామలింగయ్య , ప్రభాకరరెడ్డి , జయమాలిని ప్రధాన పాత్రధారులు .
Ads
మామూలు కధ . ఒక సాధారణ అమ్మాయి శ్రీప్రియను ప్రేమించి పెళ్లి చేసుకుంటాడు హీరో మురళీమోహన్ . హీరో ఎస్టేటులో ఓ నక్కజిత్తుల మేనేజర్ ఆస్తి మీద కన్నేసి , మోసంతో హీరో చెల్లెల్ని పెళ్లి చేసుకుని ఇంటి అల్లుడు అవుతాడు . ఇంటి కోడల్ని భర్త చేతే ఇంట్లోంచి గెంటిస్తాడు . పొట్టేలు సహాయంతో , తన ఆత్మవిశ్వాసంతో హీరోయిన్ కాపురాన్ని చక్కదిద్దుకుంటుంది .
ఎన్ని సినిమాలు చూడలేదు ఈ కధాంశంతో ! సినిమా కధనం , నడిపించే విధానం సూపర్బ్ . చూస్తేనే అర్థం అయ్యేది . ముఖ్యంగా ఈతరంలో సినిమా ఫీల్డులోకి రావాలనుకునే ఔత్సాహిక దర్శకులు , కధకులు ఇలాంటి సినిమాలను అధ్యయనం చేయాలి .
ఈ సినిమాలో ముందుగా మెచ్చుకోవలసింది పొట్టేలునే . ఓ మనిషి లాగా నటించింది . వీర విహారం చేస్తుంది . ఆ తర్వాత పొట్టేలు పున్నమ్మ శ్రీప్రియ . బ్రహ్మాండంగా నటించింది . ముఖ్యంగా కోర్టులో తన కేసును తానే వాదించుకునే సీన్ ఈకాలం యువతులు తప్పక చూడాల్సిందే . మోహన్‌బాబుతో వాదనలు రక్తికట్టాయి. మురళీమోహన్ తన పరిధిలో తాను నీటుగా నటించారు . మోహన్ బాబు నక్కజిత్తుల విలనిజం బాగా ప్రదర్శించారు . జయమాలిని , పద్మప్రియలు అందంగా కనిపిస్తారు .
ఈ సినిమాలో మెప్పు పొందలసిన మరో వ్యక్తి ఆత్రేయ . అందమైన డైలాగులనే కాదు ; పదునైన డైలాగులను కూడా వ్రాయగలనని రుజువు చేసుకున్నారు . పాటలను అన్నీ ఆయనే వ్రాసారు . కె వి మహదేవన్ సంగీత దర్శకత్వంలో చాలా చాలా శ్రావ్యంగా ఉంటాయి . సినిమాకు దర్శకుడు దేవర్ అల్లుడు త్యాగరాజన్ .
ఈతరంలో చూడనివారు ఉంటే తప్పక చూడండి . యూట్యూబులో ఉంది . An unmissable , feel good , entertaining movie . పాటల వీడియోలు , కొన్ని సీన్ల వీడియోలు కూడా ఉన్నాయి . అందరూ చూడతగ్గ సినిమా . ఒకప్పుడు పిల్లలు ఇలాంటి సినిమాలను తెగ నచ్చేవాళ్ళు . కామిక్కులకు అలవాటు పడి వీటిని చూడటం మానేసారు , చూసినా ఎంజాయ్ చేయలేకపోతున్నారు ఏమో !
Of course . ఇప్పుడు నిషేధం కూడా ఉందనుకోండి . సినిమా ఫీల్డులోకి రావాలని ఉవ్విళ్లూరే ఔత్సాహికులు మాత్రం ఓ సబ్జెక్టు లాగా అధ్యయనం చేయండి . #తెలుగుసినిమాలసింహావలోకనం #తెలుగుసినిమాలు ….. (దోగిపర్తి సుబ్రహ్మణ్యం)
(ఇప్పుడు ప్రాణుల్ని సినిమాల్లో చూపించాలంటే నానా ఆంక్షలు… పరిమితులు… కేసులు… అందుకే వాటి పాత్రల్నే మానేశారు దర్శకులు… ఒక్క ఫ్రేములో అలా మామూలుగా చూపించాలన్నా భయమే ఇప్పుడు… శేఖర్ కమ్ముల ఏదో సినిమాకు డిజిటల్ కుక్కను వాడుకున్నాడు పాపం… ఆమధ్య రక్షిత్ శెట్టి చార్లి సినిమాలో కుక్క ఎంత బాగా నటించింది..? రెండు కుక్కలకు అలా ట్రెయినింగ్ ఇచ్చారు… గ్రేట్… గతంలో విఠలాచార్య సినిమాల్లో జంతువుల పాత్రల విన్యాసాలు తెలిసినవే కదా… ముచ్చట )
Share this Article