లగ్గం… ఈ సినిమా చూశాక ఓ విరక్తి ఏర్పడింది… గతంలో తెలంగాణ యాసను పనిమనుషులకు, వీథి రౌడీలకు, కమెడియన్లకు పెట్టి ఇన్నేళ్లూ అపహాస్యం చేశారు… వెక్కిరించారు… పకపక నవ్వారు… తెలంగాణ భరించింది…
ఇప్పుడు తెలంగాణ యాస, ప్రాంతం, నేపథ్యం అన్నీ ట్రెండింగ్… దాంతో డబ్బు కోసం తెలంగాణతనాన్ని కావాలని తెచ్చిపెట్టుకుంటున్నారు కొందరు నిర్మాతలు… ప్రేమ కాదు, అవసరం, ప్రేమ ఉండే సవాలే లేదు… జస్ట్, స్వార్థం… బలగం, దసరా మాత్రమే కాదు, ఆమధ్య ఫుల్లు కరీంనగర్ బ్యాక్ డ్రాపులో ఓ సినిమా కూడా వచ్చి ప్రేక్షకాదరణ పొందింది.,.. (షరతులు వర్తిస్తాయి)… అంతెందుకు ఆంధ్రా కమ్ముల శేఖర్ కూడా ఫిదా సినిమాలో అచ్చమైన తెలంగాణ పెళ్లిని, యాసను చూపించాడు…
ఒక బలగం, ఒక దసరా కాదు… ఇన్నేళ్లూ వెకిలి చేసిన ఆ నిర్మాతలు, ఆ దర్శకులకే ఇప్పుడు తెలంగాణతనం ఓ అవసరం… సరే, తెచ్చిపెట్టుకున్న కృత్రిమ ప్రేమనైనా భరిద్దాం… కానీ తెలంగాణతనాన్ని అంటరానితనంగా చూసిన సోకాల్డ్ ఆంధ్రా నటులను తీసుకుని, అత్యంత కృతకంగా వాళ్లతో తెలంగాణ యాసను పలికించి, మరింత ద్రోహం చేస్తున్నారనిపిస్తోంది…
Ads
నటుడు ఇతర యాసల్ని పలకొద్దనీ కాదు, ప్రయత్నించొద్దనీ కాదు… సపోజ్, తనికెళ్ల భరణిని తీసుకొండి… పర్‌ఫెక్ట్ స్లాంగ్… కోట కూడా… నాని కూడా ఏ ప్రాంతీయ యాస పాత్ర వచ్చినా సరే, సాధన చేస్తాడు, నేచురల్ డిక్షన్ ప్రయత్నిస్తాడు… అదీ ఆదర్శం… దసరాలో కూడా బాగానే చేశాడు…
ఐతే సరైన డిక్షన్ లేకుండా, మరీ కృతకంగా తెలంగాణ యాసను పలికించి మరింత ద్రోహం చేయడంకన్నా అసలు తెలంగాణ సినిమా అనే పేరిట ప్రేక్షకుల కళ్లకు, చెవులకు గంతలు కట్టడమే అభ్యంతరకరం… లగ్గం సినిమా చూసేంతసేపూ అదే బాధ…
ఇది సినిమా సమీక్ష కాదు… సమీక్షలు రాసేంత సీనూ లేదు సినిమాకు… తెలంగాణ పల్లెలో చావును, పెళ్లిని, కల్చర్‌ను చూపే సినిమాలు ఈమధ్య వచ్చాయి… కానీ ఈ లగ్గం వేరు… ప్రత్యేకించి రాజేంద్రప్రసాద్ డిక్షన్ ఓ పెద్ద శాపం…
తెలంగాణలో లగ్గం చేసిండు, లగ్గమైతది బిడ్డా అనే మాటలకు వేరే అర్థాలు కూడా ఉన్నాయి… శాస్తి చేశాడు, నీ పనైతది బిడ్డా అనే అర్థాల్లో చెప్పుకుంటాం అలా… అవును, ఈ సినిమాలో నటీనటుల కృతకమైన తెలంగాణ యాస కూడా అలాగే తెలంగాణ యాసకు లగ్గం చేసింది…!
Share this Article